సృజన చింతన లో రైతు

తెలుగు సాహిత్యం రైతుకు మొదటినుండి పెద్ద పీట వేసింది . స్వేద జీవితాన్ని చిత్రించడం లో మన సృజనకారులు ఇతోధికం గా కృషి చేశారు .బహుశా రైతు కష్ట సుఖాలు కవులు గుర్తించినంతగా మరెవ్వరూ గుర్తించ లేదేమో ?

పోతన స్వయం గా హలం తో పొలం దున్ని జీవనం సాగించాడు. ‘’హలికుడైన నేమి ?అని రైతు ప్రసక్తి తెచ్చి ఆత్మాభిమానం ప్రకటించాడు. ప్రబంధ కాలం లో కృష్ణ దేవరాయల విలుబుత్తూరు వర్ణన లో రైతు జీవన ప్రసక్తి తీసుకొచ్చాడు .వానలు అధికంగా పడుతున్నప్పుడు రైతులు పగళ్ళు ఎట్లా గడిపారో చెప్పాడు తన ‘’గురుగున్ చెందని పద్యం లో ‘’ . అట్లాగే ‘’వరజు బడి రొంపి ద్రోక్కం’’అన్న పద్యం లో రైతులు బురద దున్నుతున్నపుడు వాళ్ళ కాళ్ళ కు నీరు కట్టెలు అనే పాములు చుట్టుకున్నాయట,అవి బంగారు రంగుతో ఉండడం వల్ల హలికులకు బంగారు గండపెండేరం లా అమరినవని అంటాడు . ప్రబంధాలలో అనేక సార్లు వ్యవసాయ వాతావరణపు వర్ణనలు కనిపిస్తాయి .మంచన ,శ్రీనాధుడు, లాంటి కవులు ఎందరో రైతు స్పృహ తో సాహిత్యం సృష్టించారు .

ఆధునిక కాలం లో దువ్వూరు రామి రెడ్డి ‘కృషీవలుడు’ కావ్యం ,అట్లాగే తుమ్మల సీతా రామ మూర్తి ‘’క్షేత్ర జీవి’’ కావ్యం రైతు ను వస్తువు గా చేసుకొని రచించిదే . గుర్రం జాషువా ,కరుణ శ్రీ , శ్రీశ్రీ ,కుందుర్తి లాంటి కవులెందరో రైతు శ్రమ కు నీరాజనాలిచ్చారు. గంగుల సాయి రెడ్డి తన కావ్యం లో తెలంగాణ కర్షకుని జీవన రేఖలు చిత్రించారు .’’న్యాయ మూర్తులు నీ వార లడుగరైరి ,న్యాయ వాదులు నీ వార లడుగరైరి ,ఇంకా పరవారి ముచ్చట లెందుకయ్య,కర్షకా నీదు కష్టముల్ గాంతురెవరు ?’’అని ఆవేదనతో ప్రశ్నించారు . వానమామలై జగన్నాథాచార్యులు రైతు రామాయణం రచించారు .ఇక దాశరధి ‘’తెలంగాణము రైతుదే ‘’ అని రైతు పట్ల ప్రకటించిన అభిమానం మనకు తెలిసిందే .

కవి సాహిత్యం అనే పొలం లో శ్రమిస్తే రైతు భౌతికమైన పాడి పంటల్లో పరిశ్రమిస్తాడు .ఒకరిది మేధోమధనం .రెండవది ఖరీదు కట్టే షరాబు లేని ఘర్మ జల ప్రవాహం .శిశువు నుంచి పశువు వరకు ఊపిరి పీల్చడానికి మూలమైన ఆహార సాధనం .

అట్లాంటి రైతు ఇపుడు న్యాయ పోరాటం చేస్తున్నాడు .’’అయినను బోయి రావలయు హస్తినకున్ ‘’ అని వెళ్లి తన గమ్యాన్ని వెతుక్కొంతున్నాడు .

అట్లాంటి అన్నదాతకు సృజన లోకం తమ అక్షరాలతో సంఘీభావం తెలుపుతున్నది .కొన్ని సాహితీ సంస్థ లైతే సంయుక్తం గా సమ్మేళనాలే నిర్వహించాయి .

మనం కూడా తంగేడు పక్షాన అన్నదాతకు సంఘీభావం ప్రకటిద్దాం . మన సృజన సంగమం నుండి కర్షక విజయం ఆకాంక్షిద్దాం .

జై తెలంగాణ …జై జాగృతి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com