సత్య శోధన జరగాలి …

సత్యం అత్యంత శక్తివంతమైంది. సత్యం మనిషికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది. సత్య స్ఫూర్తి అనేక మహాకార్యాలకు హేతువౌతుంది. సత్య స్ఫూర్తి వల్ల సాహిత్యం మరింత శక్తివంతంగా నిలబడుతుంది.

అనేక సందర్భాలలో అబద్దాలు రాజ్యమేలుతాయి. తమ సామాజికవర్గం బలంవల్ల, లేక ప్రాంతం బలం వల్ల, చరిత్రలో అట్లాగే సాహిత్యంలో వక్రీకరణలు చొరబడుతాయి. ప్రజల్ని అదే నిజం అనేంత భ్రమలో పడేస్తాయి.

“People have a natural inclination to lie to others” అంటాడు బెకన్. అంటే మనిషిలో స్వాభావికంగా అసత్యం వైపు మొగ్గు ఉంటుంది. భ్రమల మీద ఆరాధన ఉంటుంది. ఈ బలహీనత, చరిత్రలనే వక్రీకరించిన విషయం మనకు తెలుసు. ఇది మనిషిలో అసాధారణ ప్రతిపత్తి ప్రోదిచేసిన విషయం మనం చూశాం. కాగా కాల్పనికతను వేరుగా చూడవలసిన అవసరం ఉంది. సాహిత్య సృజనకు కాల్పనికత ఒక అనివార్యమైన అంశం. విషయం యథాతథంగా వ్యక్తీకరిస్తే అలంకారికతకు చోటెక్కడ? పాఠక ప్రియమైన సన్నివేశ కల్పన ఎట్లా జరుగుతుంది? కాబట్టి సాహిత్యం కాల్పనికతను ఆశ్రయించక తప్పదు.

కాగా కాల్పనికత అంటే వక్రీకరణ కాదు. అసత్యాలు ప్రచారం చేయడం అసలే కాదు. కాల్పనికత ప్రధానంగా భావోద్వేగానికి, ఊహా చిత్రానికి ప్రతిపాదికగా నిలుస్తుంది. దీన్ని గురించి రికెట్ ఇట్లా అంటాడు “Romanticism surely widening of the imaginative horizon, a sharpening of emotional sensibility” ఇట్లా కాకుండా కేవలం అసత్యాలు ప్రచారం చేసే కాల్పనికత సమాజాన్ని రుగ్మమయం చేస్తుంది. చరిత్రను వక్రీకరిస్తుంది. సామాజిక న్యాయానికి తప్పుడు నిర్వచనం ఇస్తుంది.

కాల్పనికత కూడా వాస్తవికత పునాదిగా ఉండాలి. కాల్పనికతా సౌరభం వాస్తవికతా నేపథ్యం గానే కొనసాగాలి. కావ్యం ఆనంద హేతువు ,సామాజిక ప్రయోజనకారి అనడం లో ఈ రెండు ఇమిడి ఉంటాయి. ప్రక్రియలో ఈ రెండు సమన్వయం పొందాలి. వాస్తవం పునాదుల మీద మాట్లాడేవాడు ప్రజల మనిషై ఉంటాడు. ప్రజాక్షేత్రంలోని సుఖదుఃఖాల మీద అవగాహన కలిగి ఉంటాడు. పీడనను నిశితంగా వ్యతిరేకిస్తాడు. మానవలోపాల పట్ల సానుభూతితో ఉంటాడు.

మనిషిలో సహజాతంగా ఉండే భ్రమలను అతడు తొలగించ గలుగుతాడు. సృజనలో హేతుబద్ధతకు ఆస్కారం అవుతాడు.

ఇటువంటి సత్యం పునాదులుగా కొనసాగే సాహిత్యాన్ని స్వాగతిద్దాం. సత్యాన్వేషణ మన పరిశోధనకు మూలభూమిక అని విశ్వసిద్దాం.

జై తెలంగాణ, జై జాగృతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com