ఫోన్ లో అవతలి  నుండి  ఆ మాట  చెవి మీద పడoగానే ప్రాణం ధస్సు మన్నది.   గాబరా ఎక్కువైంది , మనసుకు ఏమి తోచక అశాంతితో  ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అపుడపుడు పీల్చుకోనికే గాలి అందడం లేదని అనిపించింది.  ఇంట్లో కూర్చున్న కాడి నుండి దిగ్గున లేచి గాలి కోసమని గడపదాటి బైట నిలబడింది సంఘమ్మ. చల్లటి వేపచెట్టు  గాలి ఆమె  ముఖానికి ఒక్కసారి రప్పున  తాకడం వళ్ళ ప్రాణం కాస్త నిమ్మళమైనట్లు అనిపించింది. కానీ కడుపులో అలజడి, గాబరా తగ్గలేదు.  దర్వాజకు  కుడి బందుకున్న  పెద్ద వేప చెట్టు  పెద్ద పెట్టున గాలి వీస్తూవున్నా కడుపులో వేడి కక్కుతూనే   ఉన్నట్లున్నది.  పైట కొంగుతో నెమ్మదిగా ముఖం నుదురు తూడ్చుకుంటూ  “ఎందుకు నాకు కడుపులింతగానం గాబరైతున్నది..?                                            నేను బుగులువడుతున్నానా..?  మరీ ఎక్కువ ఫికరు చేస్తున్నానా ..?  ”   అని పరి పరి విధాలా ఆలోచిస్తున్న సంఘమ్మకు యాబై  ఏళ్ల వయసుoడొచ్చు.

భాగ్యనగరానికి  యాబై కిలోమీటర్ల దూరం ఉన్న కొత్తపల్లి అనే చిన్న పల్లెటూరు ఈమె అత్తగారిది.   పక్కనే ఉన్న బస్వాపురం  ఈమె తల్లిగారి ఊరు. ఈమె భర్త మొగులయ్య వ్యవసాయంలో మంచి పనోడు అని మెచ్చి ఈ ఇంటికిచ్చి లగ్గం చేసిండ్రు. ఉన్న ముగ్గురు అన్నతమ్ములు తమ తమ వాటాలు పంచుకొనంగా తలా  రెండెకురాలు  భూమి వచ్చింది.  సంఘమ్మ మొగులయ్య దంపతులు తమ వాటాకొచ్చిన రెండెకురాల భూమిలో ఒక అర్క ఎవుసం తో  యాడాదికి  రెండు పంటలు తీసుకుంటూ జీవనం గడుపుతున్నారు.  ‘ఆస్తుల తోడు లేకపోయినా అన్నాతమ్ములతోడు ఉండాలి’ అన్నట్లు ఒకరేనుకొకరు  ఐదు మంది సంతానాన్ని కన్నారు.  ఇద్దరాడపిల్లలు అయితే ముగ్గురు మగపిల్లలు. ఐదుగురివి పెళ్లిళ్లు ఐపోయినయి.  ఎవరి సంసారాలు వారివైనవి. ఉన్నంతలోనే  ఆడపిల్లను లగ్గం  చేసి  అత్తగారింటికి సాగనంపారు.  ముగ్గురు కొడుకుల నడుమ ఉన్న రెండె కురాల భూమిని ఐనకాడికి సాగుచేస్తూ వచ్చిండ్రు.  తండ్రి ఇచ్చిన సలహా తో ఇంకో ఐదేకురాల  భూమిని కౌలుకేసుకొని సాగుచేయవట్టిండ్రు. ఎదో  ‘సద్ది బట్ట ఎండకూడది , అప్పు తీర్చుండని సావుకారి మనింటికి రాకూడదీ’ అన్న కొలతలో సంసారం ను జరుపుకుంటొస్తున్నారు. అయినప్పటికీ ఇంటిలో మనుషులు పెరిగిరి బైట సరుకుల ధరలు  పెరిగే. ఈ దినాలలో పిల్లల చదువుకావాలె.  సరే .. ఇంటి ఎవుసం  చేసుకుంటూనే  ఉన్న పల్లెలో ఏదైనా పైసలొచ్చే  పనిచేద్దామంటే  కరువాయే.. ఇక తప్పదని  సాగు పనిని అన్నకు అప్పజెప్పి తమ్ములిద్దరు  పట్నంలో ఏదన్నా పని చేసి  బత్కుదామని మహారాష్ట్ర లోని బొంబాయికి వెల్లిండ్రు . ప క్కూరోళ్ళు చేరినదగ్గర ఇండ్ల  నిర్మాణపు మేస్త్రి దగ్గర పనికి కుదిరిండ్రు. కొన్నిరోజులు అన్నాతమ్ములిద్దరు మాత్రమే  వెళ్లి పనిచేసిండ్రు తరువాత తమ భార్యలని తీసుకెల్లిండ్రు.  తమ కొడుకులు ఆ రకంగా దూర ప్రాంతాలకు బతుకుతెరువుకై  వెళ్లడం తల్లితండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. ”ఉన్న నాడు తింటాం లేని నాడు  ఉపాసముంటాం. అందరం ఐతే ఒకదగ్గరుoటం ”చెప్పాలన్నా  చెప్పలేకపోయిండ్రు.  కారణం మారుతున్న పరిస్థితులు , తమ కాలానికి తమ పిల్లల కాలానికి వచ్చిన  తేడాని  అర్థం చేసుకున్నారు కనుక.  వారి జీవితం వారు. ఎ క్కడ బతికిన క్షేమంగా ఉంటె చాలును అనుకున్నారు. పెళ్ళిలకి చావులకి వారొచ్చినపుడు మనసును నిమ్మళం చేసుకున్నారు,  సంబరపడ్డారు.   రాలేకపోయినప్పుడు  కుంగిపోయిండ్రు.  ఈ కుంగిపోవుడు ఎప్పుడో ఓనాటికీ తెల్లారుతుందిలే  అనుకుంటే ఇపుడీ కరోనా లాక్ డౌన్ వార్త .’ ఈ  ఆలోచనలు అన్నీ సంఘమ్మను జుంటీగలోలె ముసిరినై.   అంతలో నాయనమ్మా బాబాయ్  ఫోన్ చేసిండు తాత మాట్లాడుతున్నాడు నిన్ను పిలుస్తున్నాడు.   అనగానే సంఘమ్మ తన గతపు జ్ఞాపకాలనుండి తేరుకుని లోపలకు నడిసింది.  ఫోన్ లో ఏమి తెలిసిoది  అని   దీనంగా ముఖాన్ని  పెట్టిన భర్తను గమనినించింది.  ‘కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర సర్కార్  లాక్ డౌన్  ప్రకటించిoద.   గాడీలు బస్సులు అన్ని బందయినాయంట’  అని  మొగులయ్య  ఫోన్ అందించిండు. ఆదుర్ధాగా  అందుకుని చెవిదగ్గర  పెట్టుకున్నది. అవతలనుండి చిన్నకొడుకు సురేష్  మాటలు … అమ్మా మెం బయలు దేరినo ,  ఇప్పుడన్ని చెప్పలేం ఫోన్లో ఛార్జింగ్ ఐపోంది మెం బాగానె ఉన్నాం.  ఇంటికొచ్చే వరకు ఎన్ని దినాలయితదో చెప్పలేం . ‘ మీరు  భద్రం’  అని చెప్పి ఇక ఉంటాను అని  ఫోన్  పెట్టేసిండు . ‘ పిల్లలు భద్రం’ అనే మాట పూర్తి కాకుండానే ఫోన్ ఆగిపోయింది.  అప్పటిదాకా కడుపులో ఉన్న దిగులు ఒక్క సారి ఏడ్పు రూపంలో బయటికి తన్నుకొచ్చింది.  అయ్యో పిల్లలను దయజూడు భగవంతుడా …. అని శోకం పెట్టింది. అయ్యో….!  ఏడువకు ‘మెం బాగున్నాం’ అని వాళ్ళు ఫోన్ లో చెపితే మనము ఏడ్వడం ఏమిటి ? తాసిలి .. మనకు మనం అన్ని ఊహించుకోవద్దు.  ఆ ఎల్లమ్మ  తల్లి   మీద భారమేసి మల్లా వచ్చే ఫోన్ కోసం ఎదురు సూడాలే. అంతే మరి . ఈ మాటలతో సంఘమ్మ ఏడ్పును బందుచేసి  తనకు తాను నిభాయించుకోవట్టింది. సంఘమ్మకు సర్ది చెప్పిoడే కానీ మొగులయ్య మనుసంతా భారం అయింది.

అంతలో బయటి నుండి చాటింపు సప్పుడు వస్తే వాకిట్లోకి వచ్చి ఇనవట్టిండ్రు .   ‘ ఇది పంచాయితీ మాట. అందరూ  జెర జాగ్రత్తగా వినుండయ్యో …యో  ….. హో ….  వినకునకుంటే మీకే నష్టం… విన్నోళ్లకు లాభం… దేశమంతా కరోనా వైరస్ మహమ్మారి మనుషుల ప్రాణాలు  తీ స్తుందంట.  మన కొత్తపల్లి నుండి ఒక్క మనిషి  కూడా బయటికి వెళ్ళవద్దు. బయటి మనిషి మన ఊరి లోకి  రావొద్దు.  పట్నం నుండి అస్సలు రావొద్దు.  అందరు జర బద్రంగా ఉండాలే. సబ్బువెట్టి  చేతులు రుద్ది రుద్ది కడగాలో ,  మనుషులు ఒకరికి ఒకరు రాస్క పూస్క తిరుగొద్ద,  ఒకరికి ఒకరు అందనంత దూరం ఉండాలే. తుమ్ము దగ్గు వచ్చినపుడు మాస్క్ తప్పకుండ వాడలోహో అని దండోరా వేసి  మరీ ప్రకటించాడు.  ముక్కు మూతికి తప్పకుండా బట్టగట్టుకోవాలె  హో …..హో…’ అని చాటింపు వేసిన మస్కురాయన వెళ్లిపోయిండు.  అది విన్న సంఘమ్మ కు కొడుకులు కోడళ్ళు మనుమండ్లు మన్మరాళ్ళు ఒక్కరి తర్వాత ఒకరు కళ్ళళ్ళ కదులుతున్నారు. ఉన్న ఊరు ఇల్లు కాడనే   ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే నే కష్ట తరమనిపిస్తున్నది. ఊరు గాని ఊరు, జాగ కాని జాగల పిల్లల వెట్టుకోని  కరోనా కట్టడిని ఎట్ల పాటిస్తారో ఏమో ?  చాలీ చాలని జీవితాలనే  దూరరాజ్యానికి బత్క ఓయిన వలస పక్షులకు  ఇపుడీ కరోనా ఓ పెద్ద పరీక్ష లానే తయారైంది’ అని వేదనకు గురైంది. ఫోన్ మోగుతదేమోనని  మల్లి మల్లి  దానివైపే చూస్తున్నారు ఇంటoదరు.  ఒకమారు ఫోన్ చేసి చూడు బిడ్డా అని పెద్దకొడుకుకు సలహా ఇచ్చింది తల్లి. ఇంతకూ ముందే  చేసిన అమ్మ తమ్ముడి ఫోన్ బందైఉన్నది.  అంటే మరింత దడ్సుకుంటది అని చెప్పలేదు. చేస్తాను ఇగ చేస్తాను అని చెపుతూ వాయిదా వేస్తున్నాడు. అంతలోనే ఫోన్ మోగింది సురేష్ నుండి. అందరికి ప్రాణాలు లెసోచినై .  ఫోన్ ఎత్తి  ఎట్లున్నారురా తమ్మి…? పలుకరించిండు అనంతగిరి .

అవతలి నుండి సురేష్ బదులిస్తూ  ‘ ‘ఆ .. అన్నా ..   మెం బాగున్నాం  మీరెట్లున్నారు, అందరు  బాగేకదా’  అడిగిండు సురేంద్ర.  ‘ఎం చెప్పమంటావు  మాపరిస్థితి.  అమ్మ నాయిన తమ ప్రాణాలు అరచేతుల్ల వెట్టికొని మీకోసం చూస్తున్నారు…’అని అనంతగిరి  అంటుండగానే  ‘ మాగురించి తర్వాత చెప్పుదువు గాని ఆల్లిప్పుడెక్కడ ఉన్నారు ? పిల్లలు తల్లులు బాగున్నారా ? అడుగు కొడుకా ‘ అన్నది పక్కలనే నిలవడిన  తల్లి సంఘమ్మ ..

 ముందు మీగురించి అంట చెప్పురా అని  పెద్దన్న అనంతగిరి అడిగిండు.

 ‘మాకేమైతది ? మీరేం పరేషాన్ కాకుండి.  ఇదేమన్నా వేరే దేశమా ? మన పక్క రాష్ట్రమే. మాకేమన్న కొత్తదా ఇది.  ఫోన్ సప్పుడు వెట్టు అమ్మ నాయన  అందరితో మాట్లాడుతా..’ అన్నాడు సురేoద్ర .

 ఆఖరోడు  రవీంద్ర  రవీంద్ర భార్య సురేంద్ర భార్య వారి ముగ్గురు పిల్లలు  సప్పుడు పెట్టి మాట్లాడుతున్న సురేంద్ర చుట్టూ మూగి ఆతృతగా వింటున్నన్నారు. ఇక్కడ అనంతగిరి చుట్టూ కూసోని ఆత్రంగా వినవట్టిండ్రు . నాయన అమ్మా వదిన పిల్లలు బాగున్నారు కదా.  ఇప్పటికైతే  మెము పిల్లలు బచయించినట్లే .  తమ్ముడు నేను  జెర  అప్రమత్తమైనందుకు చాలా నయం అయింది .  మూట  ముల్లె సర్దుకొని  పిల్లలున్నారుకదాని   ఓ ప్రైవేట్  ట్రాలీ మాట్లాడుకొని సామానంత  ట్రాలీలేసుకుని, మేము కూడా అందుట్లనే కూసోని బసుకాడికొచ్చినం.  కానీ   ఎం గద్దు, బసుల్లేవు .  ఒక్క బసుoటే అందుట్ల కాలు మోప సందులేకుండా  ఇర్గ వడ్డరు  జనం.   బస్టాండ్  పక్కకు ఒక లారీ లోడ్ తో సోలాపూర్ పోతుంటే  డ్రైవర్ ను బతిమిలాడుకొని ఒప్పించుకున్నం  వేయి రూపాలిచ్చినం . వెనుక  లోడ్ ప్యాక్ మీద తమ్ముడు నేను సామానేసుకొని  కూసున్నమ్.  పిల్లలను మీ మర్దళ్లను  ముందల కూశ్నవెట్టి భివాండీ నుండి సోలాపూర్ దాకా వచ్చినం.  లారి  అన్లోడ్ చేయడానికి  ఆగి oది.    సోలాపూర్   రోడ్ల మీద జనం  గుంపులుగా నిలవడకుండా పొలిసు కట్టడిచేస్తున్నoదుకు మేం దిగలేదు. సోలాపూర్లో  అన్లోడ్ అయిందాకా ఆరుదాపున  మెం ఒకరికి ఒకరం దూరం దూరం నిలువడ్డం.   కాళీ అయినంక  అదే లారీ ఎక్కి సోలాపూర్ శివార్లు దాటి దాదాపు నలపై కిలోమీటర్లు వస్తిమి.  సడక్ పక్కన ఉన్న ఊరులో దిగినం. ఊరు బడిల ఉన్న నల్లనీళ్లు తాగి  అందరం ఈన్నే ఉన్నo .  నేను తమ్ముడు పోయి ఊరు సర్పంచ్ దగ్గరకు వెళ్లి  మా దీన పరిస్థితిని వినిపించినం.  అయ్యో పిల్లలు ఆడాళ్ళు ఉన్నారు కదా పాపం ఉండండి. ఒక్క రోజుకాదు కదా  మీరు మీ ఊరికి వెళ్ళడానికి ప్రభుత్వ వాహనాలు  తిరిగేదాకా ఉండoడి,  మెం గ్రామ కమిటీలో కూడా ఈ అంశాన్ని తీర్మానం చేస్తాము.  ఇక ఊరు వారి దృష్టిల  పడుతుంది. కనుక వాళ్ళు ఎవ్వరూ మిమ్ముల  అభ్యంతర పెట్టరు. మీరు  కూడా  ఈ కరోనా పరిస్థితిలో పాటించాల్సినవి  పాటించాల్సి ఉంటుంది’  అని  అయన పెద్ద మనసుతో దయ తలిచారు.  రేపు ఉదయం వెళ్లి కలవాల్సి ఉంది.  ఇప్పుడైతే మీతో మాట్లాడితే సగం రంది ఎంటకైతదని, ఈ బడీల సెల్ కు  చార్జియింగ్  పెట్టి మీతో మాట్లాడుతున్నం.

” ఇగ వట్టు  తమ్ముడితో మాట్లాడుండి అని రవీంద్ర చేతికి ఫోన్ ఇచ్చి సురేంద్ర పక్కకు జరిగిండు.  ఆదేవుడి దయవల్ల మంచిగైతే ఉన్నారు . ఉన్నకాడ భద్రం. కొత్తజాగల పిల్లల యామారకుండి. అటిటు వడి తోడెం దినాలు గడిపితిరంటే  గట్టేక్కినట్లే. యాబండిల నన్న ఇల్లు చేరొచ్చు.  అనుకుంటేనే  ఎంత దూరమొచ్చిండ్రు,  మన ఇల్లు  చేరనీకే ఇంకెంత దవున్నది ‘ అడిగిండు  తండ్రి.

 ‘దగ్గర దగ్గర సగానికి పైననే వచ్చినట్లు. ఇంకా మూడొందల చిల్లర  కిలోమీటర్లు దూరం ఉండొచ్చును .  ఆరేడు గంటల నడక బసు నడవొచ్చున’ ని  బదులు  చెప్పిండు రవీంద్ర.

ఇక్కడి నుండి ఆటో కట్టుకొని అక్కడికి  మా రావచ్చును , కానీ ఈడ కూడా వాహనాలను   ఎక్కడివక్కడ మొత్తం కట్ బంద్ చేసిపెట్టిండ్రు.  ఏమో బిడ్డా  ఇది కూడా మన మంచికేనేమో.  ప్రపంచమంతా ఇదే కట్ బంద్. అందరిట్లా మనము ఒకరం అనుకోవాలె. మీరింకా భద్రం జాగాలున్నారనుకో.   అది  మన అదృష్టంమని మర్చిపోవద్దు. వార్తల్ల చూస్తున్నాం గా …   పాపం పిల్లలు తల్లులు రోడ్ల మీద ఎర్రటెండల్లా నడుస్తున్నరు. వారికన్నా ఎన్నో పాళ్ళు మీరు మేము సుఖంగా ఉన్నాం’  అని చెపుతూ ఉంది. అంతలోనే

‘మాకు యా వార్తలు చూసే దానికి లేదమ్మా. జనాలు నడుస్తున్నారా’?  అని ఆశ్ఛర్యంగా అడిగిండు కొడుకు సురేంద్ర.  ఆమ్మో సడకెoబడి సాళ్లు కట్టినట్లు  నడుస్తున్నారు జనాలు .   వాళ్ల ఆపతిని చూడలేక పోతున్నంరా తండ్రి. నీళ్లు నిండిన కళ్ళ తడిని పైట కొంగుతో ఒత్తుకున్నది సంఘమ్మ.

 ”కష్టాలకు ఓర్చుకుంటైనా, ఓ పూట తిన్నా తినకున్నా  ఒక్క తలం ఉండడం పిల్లకు ఐతే ఇపుడవసరం రా నాయనా , మీరు  ఆ తలంలోనే ఉండుండి . మిమ్ములనుందనిచ్చినోళ్లు  సల్లగ బతుకని  ” అని సంఘమ్మ చేతిలోని సెల్ఫోన్ దగ్గరకు తల వంచి చెప్పిండు. మొగులయ్య.

  ”ఎన్కటికి ఇలాంటి గత్తర మహమ్మారీలను మస్తు ఎగుకుంటొచ్చిండ్రు మనోళ్లు.  ఆ తరానికి ప్లేగు ఐతే ఈ  తరానికి కరోనా అన్నట్లుంది ముచ్చట”.  చెప్పింది సంఘమ్మ.

కరోనా అంటకుండా   ఏమేమి చెయ్యాల్నో మన ఊర్లే  సర్పంచ్ కాడినుండి వార్డు మెంబర్ల  దాకా  చెపుతూనే ఉన్నారు.  అస్సలు  గుంపులు కట్టోద్దు, మనిషికి మనిషి దూరం ఉండాలే,   ముక్కు మూతిని ఎప్పటికీ మూసుకోవాలె.. యాడ వడ్తె  ఆడ ఊoచగూడది, తుమ్మొచ్చిన, దగ్గొచ్చిన  బట్టను అడ్డం పెట్టుకోవాలే… అని దినాం చెప్పుతున్నారు. జనం కూడా పబందికొచ్చిండ్రు. కాయస్తో  వింటున్నరు, పాటిస్తున్నారు.  మీరు కూడా ఇవన్నింటినీ పాటించుండి బెటా,  కోడలమ్మలకు పిల్లలకు సావధానంగా చెప్పు బిడ్డ ..కరోనా  సోకకుండా,  మనది కాని  తలంలా భద్రంగా ఉండుండి. ఈ  కడగండ్ల దినాలు ఎల్లకాలం ఇట్లనే  ఉండవు గాక ఉండవు.  మనం కలిసే మంచి రోజులు కుడా తప్పకుండ వస్తాయి. పొద్దుమూకి  పిల్లలతో  మాట్లాడుతనని   నెమ్మదిగా ఫోన్ పెట్టేసింది  సంఘమ్మ.

కొడుకులతో మాట్లాడినంక మనుసు కొంత నిమ్మళమైంది. ఆకలైన సంగతి యాదికొచ్చింది , ‘అయ్యో ఈతనికీ బుక్కెడు వెట్టియ్యనైతి.  ఎంతాకలిగున్నాడో  నీవైనా  అడగనైనా అడగనైతివి అనీ మొగులయ్య వైపు తిరిగి అన్నది ‘  ఈడ్కి రెండు మూడు మార్లాయే  బుక్కెడు తిను మామ అని కోడలుపిల్ల అడుగుతూనే ఉన్నది.

 యాడ కడుపునిండా పిల్లల ఏజన్నేనాయె , ఆకలేడా  ఆకలిని  మరిచిపోయినం. ఐతే మానె తియ్ . పిల్లలు ఒకాడ పదిలంగా ఉన్నరని జాడ తెలిసె.  వారం పది దినాలకైనా ఇంటిపట్టుకొస్తారు.

 బుక్కెడు పెట్టిగ కోడలమ్మ…  ఇగ   ఎదార్థాంగ తింటం . అని నవ్వు నిండిన ముఖంతో  సంఘమ్మను చూసిండు మొగులయ్య.

 ఇదొందో ఇంత గమ్మత్తుగా గజరుగుతున్నదే మయ్యో… అని  బింకంతో నవ్వింది సంఘమ్మ.  ఉండుండి ఉండుండి అని బతిమిలాడి బామాలితే ఉండలేరు. ఇపుడేమో పల్లేడున్నది? …  ఇల్లేడున్నది ?… అని దేవులాడుతున్నట్లున్నది.   భూమ్మీద ఎవుసం చేసుకున్నోనికి చేసుకున్నంత,  ఇంటిపట్టున ఉండి ఇంటి భూమికింత బైట భూమిని  తోడుగా పాలుకేసుకొని ఇజ్జతుగా బతుకుండి అని చెపితే యాడ సెవులకెక్కింది. హో  ఇగ పైసలు గడిస్తo, పిల్లల చదివిస్తాం  అని  ఇల్లును భూమినొదిలేసి  పసి పిల్లలనేసుకొని పోయిరి.  ఎవుసం అంటే ఇజ్జత్  కానీ  సిన్నతనo కాదు కదా !  పిల్లలను  మన పల్లె  బడిలకు పంపి పెద్ద చదువుకు పట్నం  పంపుదాము కదా … అంటే చెవుల మీదపెను వారిందా  మొత్తం  ఎవుసం పనిని పెద్దొని మీ నెట్టేసి పోయిండ్రు .  ఏ మాట కా మాట జెప్పాలంటే   కరోనా జెయ్యవట్టి  మన కొడుకులు కోడళ్ళు ఎవుసం విలువ తెలుసుకున్నారయ్యో …! అని అన్నం బుక్క నములుకుంటా చెప్పింది సంఘమ్మ.

‘ అమ్మా అమ్మా నీవు తక్వ దానివి కావే … ఇంత సేపు పిల్లలను ఫోన్ల  మాట్లాడుకుంట తెగ ఏడిస్తివి, ఇప్పుడేమో  తెగ తిడుతున్నావు . అని అనుమానంతో చూసిండు మొగులయ్య.  ఏడ్పు నవ్వులు వస్తాయి పోతాయి  బతుకులో సంసారంలో కుదురుగా ఉండేది  ఎవుసం కాదా అని నిట్టూర్చింది సంఘమ్మ. ….

                                                             గోగు శ్యామల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com