
అతని పేరు చెబితే జనం ఉత్సాహం తో ఉరకలు వేస్తుంటారు .వేదికపై అతనుంటే చాలు అతని పాట కోసం ,మాట కోసం , జనం ఎంతసేపైన ఎదురు చూస్తుంటారు … పాట….దానిలో కనిపించే సామాజిక వాస్తవికత ,చక్కగా ఒదిగి పోయే జానపదుల పదాలు ,అన్నిటినీ మించి మైమరపించే కవిత్వం ….అతనే గోరేటి వెంకన్న …
ఆయనకు ఇప్పుడు దక్కిన ఎం ఎల్ సి . ఈ తరం రాష్ట్ర సాహిత్య కారులందరికి దక్కిన గౌరవం . ఈ అవకాశం ఆయన ఖాతా లో మరిన్ని విజయాలకు చేర్పు కావాలని తంగేడు ఆశిస్తోంది .ఆయనను మనసారా అభినందిస్తోంది.
గోరేటి 1963 లో నాగర కర్నూలు జిల్లా గౌరారం గ్రామం లో జన్మించారు .సారస్వత పరిషత్తు లో తెలుగు సాహిత్యం లో ఎం.ఏ. చేయడం అతనికి ప్రాచీన సౌదర్య మీమాంస బాగా పట్టువడింది .ఆంగ్ల సాహిత్య పఠనం అతని కి కొత్తపోకడలు, ఆంగ్ల ఈస్తటిక్స మీద అవగాహన పెంచింది . తండ్రి సహజ గాయకుడు కావడం వల్ల బాల్యం నుండే ఆ కళ పట్టువడింది .హరిశ్చంద్ర లాంటి పౌరాణిక నాటకాలలో పాల్గొనడం వల్ల భాషాభిఙ్ఞత తో పాటు ప్రదర్శన అలవడింది . సహజమైన ప్రకృతి పరిశీలన వల్ల అతని వ్యక్తీకరణ కు మరింత స్వభావ రమ్యత చేకూరింది . మార్క్సిజం అధ్యయనం ,ఉద్యమాల నడుమ జీవితం వల్ల దీన్నైనా ప్రశ్నించగల సత్తా అలవడింది .ఇట్లా తెలంగాణాకు వెరసి తెలుగు సమాజానికి ఒక అపూర్వ సాహితీ మూర్తి దొరికాడు
వెంకన్న వందలాది పాటలతో గాత్రం తో విన్యాసం తో ప్రేక్షకులను, వీక్షకులను ఉర్రూత లూగించాడు .’’ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా ?’’ లాంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపు ఊపాయి. ‘’నీ కంఠమెంత మధురమే లచ్చుమమ్మా అనే పాట సౌందర్య మీ మాంసకులకు గొప్ప ఉపాదేయమైంది .’’ ఆమె పాట పాడుతే పాలిపోయిన కండి చేను విరగబూస్తుందట ,ఆమె కునుకు తీస్తే నీలి తెప్ప వాలి నీడ ఇస్తుందట , , ఆమె నడుస్తే పల్లేరుగాయలు మల్లెపూవు లవుతాయట, ఆమె మెడ మీద ఎండపొడ ఆభరణమై మెరుస్తుందట . ఒక మహాకవికి కాకపోతే ఇంత భావుకత ఎవరికుంటుంది ?
ఆయన రాసిన ఓ .నల్ల తుమ్మా పాట కావ్య గౌరవం పొందింది .మనిషి చనిపోతే తన వాళ్ళే పీనుగని ఈసడించుకొంటారు . కాని నల్లతుమ్మ చనిపోయి కూడా బల్లలుగా మంచం గా బొంగరం గా చెక్కిలి మెప్పించు ముక్కు పుడక గా బతుకుతుంది .నల్లతుమ్మ కంచ లేకుండా పెరిగి కంచెలా మారుతుంది , నల్లతుమ్మకు మేకపంచకమే సురగంగ ,.ఇలాంటి భావాలు ఒక గోరేటి గాక ఎవరు చెప్పగలరు ?
ఆయన భావుకత సినిమా పరిశ్రమ ను ఆకర్షించింది .ఎన్ కౌంటర్ ,శ్రీరాములయ్య ,కుబుసం ,వేగుచుక్క ,బందూక్, పీపుల్స్ వార్ లాంటి అనేక సినిమాలకు ఆయన పాటలు రాశారు .కుబుసం లో అయన’’ పల్లె కన్నీరు పెడుతుంది’’ అనే పాట ఆనాటి తెలుగు దేశం ప్రభుత్వం లో నే భూకంపం పుట్టించింది .. అయన చేసిన రిజిస్ట్రార్ ఉద్యోగం సాహిత్య వృక్షం గా విస్తరించిన ఆయనకు ఒక చిగురాకై పోయింది .
గోరేటి ఏకునాదం మోత ,రేలపూతలు, అలచంద్ర వంక ,పూసిన పున్నమ ,లాంటి పాటల పుస్తకాలు ప్రచురించారు.
వెంకన్నకు 2006 లో ఆనాటి ప్రభుత్వం హంస అవార్డ్ ప్రకటించింది .2016 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజి అవార్డ్ తో గౌరవించింది .
ఆయనకు ఇప్పుడు దక్కిన ఎం ఎల్ సి . ఈ తరం రాష్ట్ర సాహిత్య కారులందరికి దక్కిన గౌరవం . ఈ అవకాశం ఆయన ఖాతా లో మరిన్ని విజయాలకు చేర్పు కావాలని తంగేడు ఆశిస్తోంది .ఆయనను మనసారా అభినందిస్తోంది.