వెన్న

పిల్లలకు వెన్నంటే చాలా యిష్టం. పెద్దలకు గూడా వెన్నంటే యిష్టమే. కాని ప్రత్యేకంగా పిల్లలకు వెన్నంటే ప్రాణాలు లేచివస్తాయి. పిల్లలతో బంతి కూర్చున్నప్పుడెల్లా నాకో పెద్ద సంకటము ఎదురౌతుంది. “అమ్మా! నాన్నకు వెన్న చాల పెట్టావు” అని పిల్లవాళ్ళు మారాము ఆరంభిస్తారు. యదార్థంలో పిల్లవాళ్ళకన్నా నాకు ఎప్పుడూ ఎక్కువ పరిమాణంలోనే వెన్న ఉంటుంది. పిల్లవాళ్ళకన్న ఎక్కువ పరిమాణంలో పెద్దలకు వెన్న ఎందుకుండాలో నేను ఎన్నడూ తరచి తరచి ఆలోచించలేదు. పిల్లవాళ్ళకన్న నాకు వెన్న ఎక్కువ పరిమాణంలో ఉండడం, పిల్లలు దానిని వేలు పెట్టి చూపడం నాకు సిగ్గుగా ఉంటుంది. పిలవాళ్ళ మాటలు నాకు సబబుగా కనబడుతాయి. కాని నేను ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాను. యింటికి పెద్ద వాడనన్నట్టు, కష్టించి పోషించే వాడిననన్నట్టు, భారవాహకుడనన్నట్టు, లేక యింత వెన్న నాకు అవసరమన్నట్టు?

పిల్లవాళ్ళకు ఈ ప్రత్యేకతలు, ఈ ప్రాధాన్యతలు ఏవీ అర్థంకావు. యితర విషయాలెట్లా ఉన్నా తాము ప్రేమించే వెన్న దగ్గర మాత్రము అంతా సమానులే అన్నట్లు వాళ్ళు అట్లాగే మారాము చేస్తుంటారు.

అప్పుడు తల్లి ఓ తమాషా చేస్తుంది. ఆ పిల్లవాళ్ళ కంచాలలోని వెన్ననే వెడల్పుగా అదిమి “అబ్బో? నాయనకు ఎంత వెన్న అంటుంది.

పిల్లవాళ్ళ పైన తల్లి గారడి ఏమాత్రము పనిచేయదు. ఆ గారడి అంతా ప్రత్యక్షంగా తమ కళ్ళముందు జరగబట్టి, అదంతా కేవలం మోసం, దగా, అన్నట్లు పిల్లలు మరింత గట్టిగా మారాము చేస్తుంటారు. అప్పుడు తల్లి మరొక యుక్తి చేస్తుంది. పిల్లవాళ్ళ కంచాలలోని వెన్న వాళ్ళకు కనిపించకుండా తీసి “అబ్బా! మా అబ్బాయికి కొంచెం పెట్టండి” అంటూ నా కంచంలోని వెన్నను తీసినట్టుచేసి తలాకాస్త పెడుతుంది. పిల్లవాళ్ళు దానిని కూడా నమ్మరు. ఆ యుక్తి ఏమిటో తెలియకపోయినా, దానిలో కూడా ఏదో కృత్రిమమున్నట్టు శంకించి మరింత పెద్దగా మారాము చేస్తుంటారు.

అ తల్లి బుజ్జగిస్తుంది. లాలిస్తుంది. ఏవో తియ్యని మాటలు చెప్పి మనసు మరల్చటానికి ప్రయత్నము చేస్తుంది. కాని పిల్లలు తమ పట్టు విడువరు. అలాటి క్లిష్ట సమయాల్లో మా పెదమ్మాయి నాకు సహాయపడుతుంది. మా పెద్దమ్మాయి చాలా నెమ్మదికలది. ఎదురు పరిస్థితులు తూచి మాట్లాడే నేర్పు దానికి చాలా ఉంది.

నాన్నకు పెట్టే అంత అన్నము మీకు పెడతాము. ఆ పచ్చళ్ళు, కూరలు అf. పెడతాము. అవన్నీ తింటే అంత వెన్న మీకు పెడుతుంది అమ్మ” అని సూటిగా అడుగుతుంది. పిల్లలు ఏమీ మాట్లాడరు. నా అన్నము వాళ్ళకు గుట్టవలె కనబడుతుంది. పెద్దదానికి సమయానికి చక్కని యుక్తి తోచినందుకు, అది పిల్లల పైన అమోఘంగా పనిచేసినందుకు లోలోన నాకూ ఆ తల్లికీ అమితానందం కలుగుతుంది. పిల్లలు ఓ క్షణం సేపు మాటాడకుండా ఊరుకొని “ఈ యుక్తిలో నిజమున్నా వెన్న విషయములో మాత్రము రాజీ లేదన్నట్టు” మళ్లీ మారాము ఆరంభిస్తారు.

“పిల్లలతో పంక్తిలో కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరు” నా పైకి లేస్తుంది తల్లి. – “ఒక్కళ్లు కూర్చుంటే చాల పెడదామని కాదూ” పిల్లలు అంటారు. మీకు దెబ్బలు లేవురా? “మాకు వెన్న పెట్టు”? “తింటే తినండి- లేకుంటే లేచిపోండి” born ఆ “వెన్న పెడితే తింటాము” తల్లికి కోపం వచ్చి తలకో చరుపు వేస్తుంది. పిల్లలు కోపంగా,

జాలిగా ఏడ్పులు ఆరంభిస్తారు.

“పిల్ల చేష్టలు – పోనిద్దూ – వాళ్లకు తెలియదు” అంటాను నేను. “ఏమిటి పిల్ల చేష్టలు? పెద్దలకెంతో పిల్లలకంత కావాలా”? “పిల్లలకు తెలియదూ”?

““పిల్లలు! మీరూ పిల్లలే” రోషంగా అంటుంది తల్లి. అకస్మాత్తుగా నాకు నా పిల్లచేష్టలు జ్ఞప్తికి వస్తాయి. నాపిల్ల చేష్ట లేమిటంటారు?

ప్రపంచ దృష్టిలో నేనో ఎదిగినవాడినైనా, విశ్వ రచయితల పంక్తిలో నేనో పిల్లవాడిని. పిల్లలకు వెన్న అంటే యిష్టమైనట్టు నాకు కీర్తి అంటే చాలా యిష్టము. విశ్వరచయితల పంక్తిలో కూర్చున్న నాకు అస్తమానమూ వాళ్ళ కీర్తి పైననే చూపు ఉంటుంది. వాళ్ళ విద్య, వాళ్ళ అనుభవం, వాళ్ళ కృషి, వాళ్ళ సాధనతో నిమిత్తం లేకుండా కేవలం వాళ్ళ కీర్తివంకనే చూస్తూ ఉంటాను. అది నా జీవితమనే కంచములోకి రావాలని, నా అజ్ఞానము, అల్పత్వము, అలసత అన్నీ మరచి. అందుకే మా అబ్బాయి మోస్తరు నాకు చెంపదెబ్బలు తగులుతుంటాయి.

విఫలత్వపు చెంపదెబ్బలు!

అబ్బాయి వెన్నకోసరం మారాము చేస్తుంటాడు. .

నేను కీర్తి కోసరం? అయితే నేనో పిల్లవాడినే.

అకస్మాత్తుగా నా పెదవుల పైన చిరునవ్వు విరుస్తుంది. మా! నాన్న నవ్వుతున్నాడు అంటారు”

పిల్లలు ఏడుస్తూనే. తల్లీ పిల్లలూ నావంక ఆశ్చర్యంగా చూస్తారు.

కాని వాళ్ళకు నా నవ్వులో అంతర్గర్భితమైయున్న ఏడ్పు ఏమి తెలుసు? అడియాస,

విఫలత్వముల ఏడ్పు. పిల్లవాళ్ళ ఏడ్పు ఆగిపోతుంది. నాలో ఏడ్పు ఆరంభమౌతుంది. పిలవాళ్ళ ఏడ్పు, బలహీనతలు, అందరికి కనపడుతాయి. కాని పెద్దల ఏడ్పు? అది మరింత ఎదిగినవాళ్ళకే కనపడుతుంది. ”

(స్రవంతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com