బక్క పల్చటి శరీరం. ఎముకల్ని కప్పి ఉంచడానికి ఉన్న చర్మం తప్ప అధికమైన శరీరభాగం ,శరీరభారం లేని అతి సాధారణ మనిషి అతను.ముఖంపై చెరగని చిరునవ్వు అతని సొంతం.ఆ చిరునవ్వులో మాలిన్యం లేదు. ఈర్ష్య లేదు. అతని పాదాలు తిరగని పాలమూరు గ్రామాలు లేవు.తను నడయాడిన పాలమూరు పల్లెలన్ని చరిత్రలుగా నిలిచినవి.రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని రోజుల్లో అతని కాళ్ళు బండి గిర్రలై అనేక ప్రాంతాలను చుట్టి తను సేకరించిన వాటిని పుస్తక రూపంలో మలిచారు. కరెంటు వెలుగులు లేని రోజులలో కందిలి వెలుగులని ఆసరా చేసుకుని గుట్టలు, గుళ్ళు తిరిగి సమాజానికి అక్షర వెలుగులని పంచిన కాంతిరేఖ అతను.

ఇతరుల పట్ల కఠినంగా మాట్లడటం ,ఇతరులని విమర్శించడం ఎరుగని గొప్ప సాత్వికుడాయన.తాను ఎక్కడికి వెళ్లినా కంటపడ్డ శాసనాలు ,స్తంభాలు ,చారిత్రక స్థలాలు ,తాళపత్ర గ్రంథాలు ,చెవినపడ్డ మౌఖిక కథనాలు ,గాథలు అన్నింటినీ సేకరించి వాటిలోని విషయాలను ,చరిత్రను పుస్తకం రూపంలో తెచ్చేవరకు విశ్రమించని అక్షర సైనికుడతను.పుస్తకాలే లోకంగా పుస్తక రచన ,పుస్తక పఠనం ,పుస్తకాల భద్రత అను మూడింటిని ఒకచోట చేర్చి పుస్తకానికి ఆయన పర్యాయపదంగా మారి మనిషే ఓ పుస్తకంగా వెలుగొందారు.

ప్రముఖకవి పరిశోధకులు ,శతాధికగ్రంథకర్త ,సాహితీవేత్త , నిత్య సాహిత్య అన్వేషి అయిన మాన్యులు ,పెద్దలు డా౹౹ కపిలవాయి లింగమూర్తి గారు 1928 మార్చి 31నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ ,ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలం జినుకుంట గ్రామం నందు జన్మించారు. తల్లి మాణిక్యాంబ తండ్రి వెంకటాచలం గారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన కపిలవాయి గారు తన బాల్యాన్నంతా అమ్రాబాద్ లోని అమ్మమ్మ గారింట్లో గడిపారు. మేనమామ చేపూరు పెదలక్ష్మయ్య గారి సాన్నిహిత్యంలో వృత్తివిద్యను ,సాధారణ విద్యను అభ్యసించారు.

45 సంవత్సరాల వయసులో ప్రారంభించిన సాహితీసేద్యం 45 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగించిన సుప్రసిద్ధ సాహిత్యవేత్త.తుదిశ్వాస వదిలే వరకు అక్షరాన్ని అమితంగా ప్రేమించిన అక్షర పిపాసి.అతనికి తీరని దప్పిక ,ఆకలిలాంటివి ఏవైనా ఉన్నయంటే అవి కేవలం చదవడం ,రాయడం మాత్రమే. అతను చేసే భోజనమే కాదు అతని కలం నుండి జాలువారిన రచనలు ,మాటలు కూడా సాత్వికమే.ఆయన సాహిత్య కీర్తిపతాక తెలుగు నేలపై చిరస్థాయిగా నిలిచి ఉంది.

మన చుట్టూ ఉన్న ,మనకు తెలియని చరిత్రను తవ్వి మనకందించిన మనకాలపు గొప్ప పరిశోధకులు. తెలుగు సాహిత్యం ,పరిశోధనల్లో ఆదిరాజు వీరభద్రరావు ,బిరుదురాజు రామరాజు ,బి.ఎన్.శాస్త్రి ,సురవరం ప్రతాపరెడ్డి ,గడియారం రామకృష్ణ శర్మ ,తెలకపల్లి రామచంద్ర శాస్త్రి ,కేశవపంతుల నరసింహ శాస్త్రి ,కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి లాంటి దిగ్గజాల సరసన చెప్పుకోదగిన వారు కపిలవాయి గారే.

సుధీర్ఘ సాహిత్య జీవితంలో (45 సంవత్సరాలు ) శతాధిక గ్రంథాలను ఎలా రాయగలిగారో మన ఊహకు కూడా అందని విషయం. ఒక రోజులో ఏదీ రాయకుండా ,చదవకుండా అన్న పానీయాలు కూడా ముట్టుకోరంటే సాహిత్యంపై అతనికున్న మక్కువ ,ప్రేమ ఏపాటిదో మనం గుర్తించవచ్చు. నిరంతరం అక్షరాలను అల్లుకుంటూ సృజన సాహిత్యాన్ని పుస్తకాల దండలుగా ధరించినారు. 90 ఏళ్ల వయసులోను కళ్ళద్దాల అవసరం లేకుండానే రోజులోని అత్యధిక సమయం కేవలం చదవడానికి ,రాయడానికే కేటాయించారు.

తనకు ప్రాచీన గ్రాంథిక పాండిత్యం ఉన్నా తను రచించిన పుస్తకాల ద్వారా సామాన్య ప్రజలకు ,పరిశోధకులకు చేరువ కావాలనే తపనతో తన రచనల్లో సరళమైన వాడుక భాషను వినియోగించారు.పద్యం ,గద్యం ,గేయం ,వచనాలు ,శతకం ,కథ ,నవల ,కావ్యం ,ద్విపద ,నాటకం ,చరిత్ర ,ఉదాహరణం ,బాలసాహిత్యం ,సంకీర్తనం ,బుర్రకథ ,హరికథ ,సంకలనం ,అనువాదం ,స్థలపురాణం ,పీఠీకలు ఇలా సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను ముద్దాడిన అక్షర ప్రేమికుడు.

సాహిత్యంలో ఏదో ఒక ప్రక్రియకు పరిమితం అయ్యుంటే వారు కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయేవారు.కానీ..! అలాకాక మారుతున్న కాలానుగుణంగా సాహిత్యంలో వస్తున్న మార్పులకనుగుణంగా తాను మారుతూ అనేక ప్రక్రియలను రాసి సాహిత్య చరిత్రలో శిఖరాగ్ర స్థానం చేరుకోగలిగారు.ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఆయన రాసిన అనేక పుస్తకాలు సాహిత్యకారులకు ప్రామాణికంగా నిలిచాయి.కీర్తి ప్రతిష్టలు , అవార్డులు ,సన్మానాలు ,శాలువాల మీద ధ్యాస లేని జీవితం వారిది.వందల అవార్డులు ,సన్మానాలు ,బిరుదులు వారిని వెతుక్కుంటూ వారి ఇంటి గడపను తొక్కినయి.

నాగర్ కర్నూల్ జాతీయోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా , పాలెంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల యందు ఉపన్యాసకులుగా పనిచేసి ఎందరో శిష్యులను తీర్చిదిద్దినారు.సాహిత్య పరిశోధనల కోసం అనేక పుస్తకాలను ,తాళపత్ర గ్రంథాలను సేకరించి తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి భద్రపరిచారు.ఈ గ్రంథాలయం భవిష్యత్ పరిశోధకులకు ఒక సాహిత్య బాండాగారంగా నిలిచిపోయింది.వారు స్వయంగా స్వర్ణకారులు ,శిల్పులు ,చిత్రకారులు కూడా.

ఎన్నో ఏళ్ల నుండి వారిని ఆహ్వనిస్తూ వారి ఇంటికి చేరిన పెళ్లి పత్రికలు ,దుకాణాల ప్రారంభోత్సవ ఆహ్వాన కరపత్రాలు ,వారి సాహిత్యాన్ని ప్రేమించి ,అభినందిస్తూ రాసిన ఉత్తరాలు అలాగే భద్రపరిచి ఉంచారు. వీటి సహాయంతో మనం ఏకంగా పుస్తకాలే రాసేయవచ్చు.చేతికి అందిన ప్రతి కాగితాన్ని భద్రపరచడం వారికున్న మంచి అలవాటు.

డా౹౹ కపిలవాయి లింగమూర్తి గారి జీవితం ,సాహిత్యంపై పరిశోధనలు చేసి ఎం.ఫిల్ , పి.హెచ్.డిలు పొందినవారు ఉన్నారు. ఇంకా ఎంతో మంది పరిశోధక విద్యార్థులు ఎం.ఫిల్ , పి.హెచ్.డి లు సాధించడంలో వారే సూత్రధారిగా మార్గదర్శనం చేసిన నేపథ్యం ఉంది.

వారి జీవితంలో కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖ సాగరంలో కూరుకుపోయి కూడా గుండె నిబ్బరంతో సాహితీక్షేత్రాన్ని సాగు చేశాడు. తను అనారోగ్యం పాలై హాస్పిటల్ బెడ్ పై ఉండి మాట్లడలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా పలకపై రాస్తూ తన పుస్తకాల గురించి అడిగేవారు. ఇతరుల సాహిత్య సందేహాలను కూడా నివృత్తి చేసిన నిత్య అక్షరశిల్పి. సాహిత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినా ,వ్యక్తిత్వంలో అతి సామాన్యుడతను. గౌరవం కోసం తాపత్రయ పడే వ్యక్తిత్వం కాదు అతనిది.ఉద్యోగ విరమణ అనంతర జీవితంలో నిత్యం పుస్తకాలు రాయడమో ,చదవడమో తప్ప ఇతర వ్యాపకాలు గాని ,ధ్యాస గాని లేదు.

” కంచు మోగినట్లు కనకంబు మోగునా ” అను వేమన సూక్తిని నిజం చేసిన పండితుడతడు.కంచు వంటి కంఠం లేకున్నా సువర్ణాక్షరాలు తన కలం నుండి జాలువార్చి సాహిత్యపు చరిత్రలో సువర్ణాక్షారాలతో (స్వర్ణశకలాలు)తన చరిత్రను తానే లిఖించుకున్నారు.తను సనాతన ,సాంప్రదాయక ,ఆధ్యాత్మిక ,ప్రభోధాలను అనుసరించినా ఇతర భావాలను ,వాదాలను గొప్పగా గౌరవించి ఆలింగనం చేసుకున్న ఉదారవాదం వారిది.అన్ని వాదాల పుస్తకాలను చదివి సరిచేసేవారు.

తెలంగాణ కల సాకారమైనాక స్వరాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ వారి తొలి గౌరవ డాక్టరేట్ అందుకున్న సాహితీవేత్తగా చరిత్రలో నిలిచారు. సాహిత్యంలో వారు చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక , ఉన్నత స్థాయి ,ఇంటర్ ,డిగ్రీ పాఠ్యపుస్తకాలలో వారి రచనలు చేర్చి యావత్ తెలంగాణ విద్యార్థులు చదివి తెలుసుకునేలా చేయగలిగింది.

దాదాపుగా 90 పుస్తకాలను ప్రచురించారు.ఇంకా 25 దాకా డి.టి.పి పూర్తై అచ్చు కావాల్సి ఉంది. వారి చివరి పుస్తకం ” దేవుడు-జీవుడు ” కూడా డి.టి.పి పూర్తి అయ్యి అచ్చు కావాల్సి ఉంది. తన మరణాన్ని కూడా తాను ముందే తెలుసుకుని దాన్ని కూడా అక్షరం ద్వారానే రాసి చూపిన దివ్యజ్ఞాని. ” ప్రాణపక్షి ఇది ఎగిరిపోయే ప్రయత్నంలో ఉన్నది.నా హృదయంలో నుంచి బయటికి వచ్చింది. ” అని తన చివరి ఘడియలని జ్ఞాన నేత్రంతో వీక్షించి తన స్వహస్తాలతో తను ముందే రాసి తెలియపరిచిన గొప్ప మహానుభావుడు.హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్దాయన 2018 నవంబర్ 6 వ తేదీ మధ్యాహ్నం వరకు ఎవరేం అడిగినా..! స్పందించారు. తన శ్వాస ఆగే క్షణాలు దగ్గరయ్యే కొద్దీ పల్స్ రేట్ మెల్లగా తగ్గుతూ….చాలా నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు దిగుతూ సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. వారి జీవితం మొత్తం ఎంత నిష్కల్మషంగా ,ప్రశాంతంగా ఉన్నారో… చివరి శ్వాస వదిలే ముందు కూడా అదే ప్రశాంతత అదే సాత్వికత……

తెలుగు సాహిత్యంలో వారు లేనిలోటు పూడ్చలేనిది.వర్ధమాన కవులు ,రచయితలు ,పరిశోధకులు వారి సాహిత్య వారసత్వం అందుకుని ఎక్కడికక్కడా స్థానిక చరిత్రలను తవ్వి పరిశోధించి మరుగున పడ్డ చరిత్రను ,వెలుగులోకి తీసుకొచ్చి భావితరాలకు అందించినప్పుడే వారికి మనం నిజంగా ఘననివాళులు అర్పించినవారమవుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com