డబ్బు విలువలను గుర్తించకుంటే నడుమంత్రపు సిరి ఎగిరిపోతుందని చెప్పే కథ.
రాజన్న గుడి ముందర బజార్లోమాసిపోయి, రంగు వెలిసిన సఫారీలో నడుస్తున్న శాలీని ఎక్కడో చూసినట్లుందని… బుర్రను ఆరా తీస్తున్నడు రవీంద్ర.

ఇద్దరి చూపులు కలుసుకున్నయి.

అనుమానం లేదు, ఇతడు అతడే! నిర్ధారించిండు రవీంద్రలోని విలేఖరి. సూటిగా చూడలేక, కళ్ళు దించుకుని, రవీంద్రను తప్పించుకోడానికి అడుగుల వేగం పెంచిండు ఆగంతుకుడు.

పట్టువదలని వార్తాహరుడు వేగంగా కదిలి, ఎట్టకేలకు దొరకపుచ్చుకుని, “ఎల్లారావు గారు! మంచిగున్నరా? నన్ను గుర్తు పట్టిండ్రా?” అన్నడు.

సంభాషణ కొనసాగించడం ఇష్టం లేదన్నట్లు ముక్తసరిగా “అ!” అన్నడు.

అవన్నీ పట్టించుకుంటే వార్తా కథనాలు ఎలా పుట్టుకు వస్తాయని, “చాలా రోజులుగా కనిపించడం లేదు! రండి. ఉడిపి హోటల్ల కూసుని చాయ్ తాగుతాం” అంటూ దారి తీసిండు.
తనతో వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ‘చాయ్’ మాట చెవులు వినేసరికి- ఎండి అలుకు పిడుచయిన నాలుక, మనసు మాట వినలేదు. అడుగులు అనుకోకుండానే రవీంద్రను అనుసరించినయి.

హెటల్ ఖాళీగా ఉంది. టిఫిన్లు తినే సమయం దాటి పోయింది. భోజనాలకు ఇంకా వేళ కాలేదు. అటూ ఇటూ కాని ఘడియలు. ఓ టేబుల్ ముందర వాళ్ళు కూర్చోబోతున్నది చూసి, వచ్చిన బేరర్కు “రెండు టీ” అంటూ రవీంద్ర ఆర్డర్ చేస్తుంటే “టిఫిన్ కూడా చెప్పండి” అన్నడు లో గొంతుకతో ఎల్లారావు. “అలాగే” అంటూ ఆర్డర్ చేయ బేరర్ వైపు తల తిప్పుతుంటే, “దోశ తప్ప, మరేం టిఫిన్లు లేవు సార్!” అన్నడు బేరర్. “సరే! ఒక మసాలా దోశ. ఎక్సట్రా కర్రీ. తిన్నంక, రెండు టీ” చెప్పాడు.

ఇద్దరి మధ్యన మౌనం తోడయ్యింది. ఎల్లారావు బజారును గమనిస్తున్నట్లున్నా చూపులు ఎక్కడో శూన్యాన్ని వెతుకుతున్నవి. ఒక్క చోట దృష్టి అన్చకుండా చూస్తున్నడు.

ఎల్లారావును గమనిస్తున్నడు రవీంద్ర. కళ తప్పిన ముఖం. చిక్కిపోయిన శరీరం. సఫారీ వేసుకోవలసిన సమయ సందర్భం కాదు. మరో రకం బట్టలు లేక, తొడు క్కున్నట్లు ఉంది. నూనె అంటని తల.

పెరిగిన గడ్డం. తిండి కూడా సరిగా లేదేమో! ఆలోచనల్ని మధ్యలో తుంచుతూ దోశ వచ్చింది. ఆవురావురుమని తినడం మొదలు పెట్టిండు.

ఈ ఇరువురి పరిచయం అప్పట్లో గొడవతో మొదలయ్యింది…
‘డబ్బులు తీసుకుని, ‘వీసా’ ఇప్పియ లేదని’ వచ్చిన ఆరోపణలను నిర్ధారించుకోను ఎల్లారావు ఇంటికి వెళ్లిండు రవీంద్ర.

గేటు పక్కన టూ-వీలర్లు, ఫోర్-వీలర్లు పార్కు చేసి ఉన్నయి. వాటి పొంటి తన స్కూటర్ ఆపి, గేట్ ముందుకు వచ్చిండు. సెక్యూరిటీ గార్డులు లోపలికి వెళ్లనీయకుండా ఆపి, వివరాలు అడిగిరాసుకుని, వాకీ టాకీలో కాంటాక్ట్ చేశారు. “రమ్మ”ని, లోపలి నుండి పిలుపు వచ్చాకా లోపలికి వదిలారు.

విశాలమైన ఖాళీ స్థలం. మధ్యన పెద్ద ఇల్లు. ముందర ఒక వైపు, జర్మన్ షెపర్డ్ కుక్కల షెడ్. మరో వైపు షెడ్లో ఓ నాలుగు రకాల కార్లు, సైకిల్ మోటర్లు, స్కూటర్లు ఉన్నయి. తను ఎటు వెళ్ళినా కాన్వాయ్! లోకల్ ఎమ్మెల్యేకు లేని హంగామా. ఇంటి లోపలికి చెప్పులు విప్పి ఎంటర్ కావాలి. ఎల్లారావుగా రూపాంతరం చెందిన ఎల్లయ్య దొరతనం!

ముందు గది సిటౌట్ గోడలకు వేలాడుతున్న దేవుళ్ళ ఫోటోలు. వాటితో సమాంతరంగా తన గల్స్ యజమాని ఫోటో! రవీంద్ర కోసమే ఎదురు చూస్తూ నిలబడ్డ ఓ వ్యక్తి, ఆఫీస్ రూమ్ కు తీసుకుపోయిండు. చుట్టూ…. అవసరార్థం తిరిగే మనుషులు! చోటామోటా రాజకీయ నాయకులు! ఊర్లో పెద్ద మనుషుల్లాగా, పహిల్వాన్లలాగా చలామణి అయ్యేవాళ్ళు!

అప్పటికే అక్కడ కూర్చుని ఉన్న తెలిసిన వాళ్ళు అందరూ రవీంద్రను పలకరించిండ్రు.

తనను తాను ఎల్లారావుకు పరిచయం చేసుకో పోతుంటే, “రవీంద్ర గారు! చెప్పండి. ఇలా వచ్చారు! ఏం పని?” అన్నడు.

విషయం చెబితే… అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ముఖం రంగు మారింది. కుర్చీలోంచి లేచి, నడుస్తూ “రండి” అంటూ లోపలికి దారి తీసిండు. తనతో పాటు ఒక బౌన్సర్ అనుసరించిండు. హాల్ లోని సోఫాలో కూర్చున్నంక, బౌన్సర్ ను వెళ్ళమని సైగ చేసిండు.

అతిథిని చూసి, ఏం చెప్పకుండానే టీబిస్కెట్లు తీసుక వచ్చిన స్త్రీ మూర్తిని, తన ‘రెండో భార్య’ని పరిచయం చేసిండు. “నమస్తే” చెబుతూ టీపాయ్ మీద ట్రే ఉంచింది. ఒంటినిండా నగలు! ఇంట్లో ఉన్నా ఎక్కడికో తయారై పోతున్నట్లు అలంకరణ! మరాఠా వనితల తొమ్మిది గజాల నవారి చీరలో! నట్టింట్లో నడుస్తున్న ‘రామప్ప నాగిని’లా ఉంది. బాగోదని ఊరకున్నా- చూపు తిప్పనివ్వని అందం!

సంభాషణలోకి ఉద్యుక్తుడవుతూ “టీ తీసుకో”మని, తాను తీసుకుని తాగుతూ “ఎవరెవరో బట్ట కాల్చి మీద వెయ్యాలని చూస్తరు” అన్నడు.

“నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నయి. ఏదైనా అడ్వర్స్ న్యూస్ రాసే ముందు, వాళ్ల వివరణ తీసుకొని రాయడం నా అలవాటు” అన్నడు రవీంద్ర.

టీ తాగే వరకు మాట్లాడకుండా వేచి చూసి. లేచాడు. లేస్తున్నరవీంద్ర చెయ్యి పట్టుకుని మరో గదిలోకి తీసుకెళ్లాడు. బెడ్ రూమ్ లో ఉంది. కాట్ పై పరిచిన బెడ్ షీట్ తొలగించాడు. కళ్ళు చెదిరిపోయాయి. బెడ్ నిండా పరచిన కరెన్సీ నోట్లు! ఓ కట్ట తీసి, రవీందర్ కు ఇవ్వబోతుంటే “నేను అలాంటి వాడ్ని కాదు” అన్నడు.
“మీ గురించి తెలుసుకున్న. ఇప్పుడు చూస్తున్న. డబ్బులతో కాకపోతే మరో దారిలో వెళ్లాల్సి వస్తుంది” అన్నడు. నవ్వి, బయటకు వచ్చిండు రవీంద్ర.

మర్నాడు వార్త రావడం, బాధితునికి డబ్బు వాపస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రవీంద్ర ఉద్యోగ రీత్యా కరీంనగర్ వెళ్లడంతో తన గురించిన సమాచారం తెలియకుండా పోయింది. మళ్లీ ఇలా ఇప్పుడే కలుసుకోవడం.

అతడు నిమ్మలం అయినంక, టీ తాగుతున్నప్పుడు “ఆ పటాటోపం అంతా ఏమయిం దని అడిగాడు.

“పెద్ద చదువులు లేకపోవడం, పల్లెటూరి అమాయకత్వం, ఇవేవీ సంపాదనకు అడ్డు రానప్పుడు, సంపద తుడిచి పెట్టుకు పోవడానికి కూడా అవే కారణం కాదు. విధి రాత కాదు. లోపమల్లా పైస విలువ గుర్తించకపోవడమే!

బొంబాయికి పోతుంటేనే ‘దేశం’ పోతున్నడని ఏడ్చే కాలంలు ఏకంగా దేశం కాని దేశం! ఎడారి ప్రాతం! కడుపు చేత పట్టుకుని, పెండ్లాం పిల్లలను వదిలి, బతుకు తెరువు కోసం పోయిన. శ్రమను, నిజాయితీని నమ్ముకున్న.

నా పనిని మెచ్చిన యజమాని, ‘వీసా’ల గురించి చెప్పి, ఇండియా తిరిగి పంపించిండు. కనుచూపుమేర పరుచుకున్న ఇసుకలా ఎటుచూసినా రూపాయలు కనిపించవట్టినయి.

దొరల్లా, రాజకీయ నాయకుల్లా ఉండాలని, ‘నన్ను నేను తయారు చేసుకోకుండా’ వాళ్లని అనుకరించటం మొదలు పెట్టిన.

ఈ హెటల్లోనే తిని, వందకు తగ్గకుండా బడ్జిస్ ఇచ్చేవాడిని. పక్కనున్న పాన్ టేలాల సిగరెట్ ప్యాకెట్ కొన్నంక, ఎంత మిగిలినా తిరిగి తీసుకున్నది లేదు.

మార్కెట్లో కొత్త మోడల్ బండి వచ్చింది అంటే, తెమ్మని డబ్బులు ఇవ్వడమే తెలుసు. ఎవరి పేరున రిజిస్టర్ అయ్యింది తెలియదు. జాగాలు, పొలాలు అంతే! ఎవరి పాలు ఎంత అయిందో లెక్కా పత్రం లేదు.

ఆరోజు హవాలా సొమ్ము కారు సీట్లలో దాచి పెట్టి, బొంబాయి పోతుంటే పూణేలో పట్టుకున్నరు. లెక్క చెప్పలేకపోవడంతో అరెస్టయి జైల్లో పడ్డ. విడుదలయి వచ్చేసరికి, ఏమీ లేదు. సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

చిన్నప్పుడు, బళ్ళో పంతులు చెప్పిన పద్యంలా సంపద రానూ వచ్చింది! పోనూ పోయింది! పద్యం బట్టీ వట్టినా ఒంట పట్టిచ్చుకోలేదు. రెండో భార్య, సందు దొరికిందని దొరికిన కాడికి అందుక పోయింది. మొదటి భార్య, పుట్టిన ఊరు, తిరిగి దిక్కయింది.”

బతుకు సమరంలో సర్వం కోల్పోయి, నడమంత్రపు హంగు ఆర్బాటం పోయి శిథిలాలుగా మిగిలిన గత వైభవపు ఆనవాళ్ల మధ్యన, రోదనతో నిలిచిన ఎల్లయ్య ఓ పాఠం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com