…. తిరునగరి దేవకీ దేవి

ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగను అధికమాసం వెనక్కిపంపింది. మరో మాసం ..ఎదిరి చూపులు..తప్పదు…ఐనా నిరీక్షణా  ఆనందమే..అనుభూతే..

బతుకమ్మంటేనే పూల జాతర  .మట్టి ..చెట్టు.. చేను ..చెలక ..చెరువు..  పంటలతో సంబంధం. పర్యావరణాన్ని ఆరాధించడం.దానితో మమేకమవ్వడం.సమిష్టి కుటుంబాల నెమరి వేత.పుట్టింటితో ఆడపిల్లల ఎడతెగని అనుబంధం.ఇంటాదుల ప్రమేయం.ఇచ్చిపుచ్చుకునే తత్వం బతుకమ్మ !…  పేరులోనే దీవెన…ఇల్లిల్లు వాడ వాడలు ఏకమయ్యే చైతన్యం…ఎంత గొప్పదీ పండుగ. పేర్పులో శిల్పం..పాటలో  సంగీత సాహిత్యాలు ..ఆటలో నృత్యం .ఆడేతీరు…చిత్రలేఖనంకాగా  అది లలిత కళల సామాహారమే..ఎంత అద్భుతమది.దీనికిదే సాటి.ఊరు సాంతాన్ని ఒక్కసోటికి చేర్చే పండుగ. పూలను జనంతో  మమేకం చేసే పండుగ…ఆంధ్రుల గొబ్బెమ్మ…కేరళ ఓనమ్….లంబాడీల తీజ్ పండగ విదేశీయులు  జరుపుకునే  పూల పండుగలతో పోలికలున్నా దీనికిదే సాటి.రామ రావణ యుద్ధం రామ రావణ యుద్ధం వలెనే…అన్నట్లు.

గతం జ్ఞాపకాలు గంపలకొద్ది.ఆనందానుభూతులూ గరిసెలకొద్ది .వినాయక చవితి వచ్చిందంటే

చాలు..నిమజ్జనానికి ఎదిరి చూపులు..ఆ చూపుల పరమార్థం..మరునాడే బొడ్డెమ్మల పున్నమ. ఆడపిల్లలమంతా  ఖుషీ ఖుషీగా ..ఆరాటమైతే చెప్పలేనంత .. మాది పీట బొడ్డెమ్మ వంతెన. కొందరేమొ వంచన అంటరు.ఇంకొందరేమొ ఆనవాయితి అని గూడ అంటరు.బొడ్డెమ్మను గూడ అందరిండ్లల్ల ఆడరు.ఆడెటోల్లింటికే ఆడకట్టు పిల్లలందరొస్తుండె.మాది హుజురాబాద్. మా నాయినమ్మింట్ల బొడ్డెమ్మ వంచనుండె. మేమైతె పున్నమెల్లినంక ఐదొద్దులకు అంటే పంచమి నుండే ఆడుతుంటిమి..సంగీత ఇంటోల్లేమొ పున్నమి తెల్లారి నుండే ఆడుతరు. ఇంటింటింకో తీరు. ఇంటి పక్కల ఇజయ ..సరల ..గీత.. అరుణ ..ఇంగ సునిత అందరం దూమ్ తడాక. మొత్తం పది మందిముంటుండె.పుట్టమన్ను తెచ్చుడేందో గాని గౌన్లు లంగాలకంత మన్నే.ఉతుకలేక అమ్మ తిట్లే తిట్లు. పీట  మీన ఐదంతరాల బొడ్డెమ్మను మా ఎంకటేస్వర్ల  చిన్నాయినే ఏస్తుండె. కాని ఆగమంత మాది. బొడ్డెమ్మ పండుగంటెనే పెండ్లి కాని పిల్లలదాయె.ఇంగాయన ముద్దుగ బొడ్డెమ్మ నేసుడుతోంటే మా వొయ్యిలకు దసరా దాంక మస్త్ పుర్సత్.దినాం ఆ బొడ్డెమ్మ ను ఎర్ర మన్నుతోని అలికిన ఆకిట్ల పెట్టి దాని మీన  పూజిచ్చిన కలశం పెట్టి ఆట పాట ఒక్క తీరా! ఆఖర్న

” నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ

నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు

నినుగన్న తల్లికి నిండ నూరేండ్లు

పాలిచ్చె తల్లికి బ్రహ్మవెయ్యేండ్లు

పిల్లి పెసరికాయ పీట పీటా

అల్లంకొమ్ము జోజోట

అత్తల గరిటె చందప్పా

లేవే లేవే గౌరమ్మ.”  !

అనుకుంట పై కలశాన్ని తీస్తుండిరి. అటెంకల నాయినమ్మ అటుకులు బెల్లమో.. పుట్నాలు శర్కరనో.. కొబ్బరి ముక్కల్నో ప్రసాదంగ పంచుతుండె.నిద్ర పుచ్చే పాట తప్ప అన్ని బతుకమ్మ పాటలే.   ఎనిమిదొద్దులాడినంక తొమ్మిదోనాడు మా దోస్తులు రోజు కలశంల తెచ్చి పోసిన బియ్యం పెసరి పప్పులతోని అమ్మ పరమాన్నమొండి అందరికి పెడుతుండె.ఆ బొడ్డెమ్మను బాయిల్నో నీల్లున్న బకెట్లనో నిమజ్జనం   చేస్తుంటమి.”గౌరమ్మకు మంచిగ మొక్కండి జల్ది లగ్గమైతదంటుండె నాయినమ్మ. అటెంక మేమెక్కువ దినాలు హుజురాబాద్ ల లేకుంటిమి.మా అమ్మమ్మ ఊరు అనుమకొండకు మా మకాం

మారింది.మా బాపు అన్మకొండల్నే కాన్గీబడి పెట్టిండు.అమ్మమ్మోల్లకు బొడ్డెమ్మ పండుగ లేదు.

బొడ్డెమ్మ నిమజ్జనానికి మజ్జెల. ఒక్క రోజుే రికామ్ ..పెత్రమాస నుండ బతుకమ్మ పండుగ షురూ..

“పిల్లలకు వచ్చింది ఉయ్యాలో బొడ్డెమ్మ పండుగా ఉయ్యాలో

              పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాస/ బతుకమ్మ పండుగా ఉయ్యాలో”

అంటే బతుకమ్మ పెండ్లైన పెద్దోల్లది. ఐనా ఆట పాటల ఆరాటమంతా పిల్లలదే.. పూలను జమచేసుకునుడంత పిల్లల పనే. తంగెడు పూలు గనులు పూలు కొనక తప్పేది కాదు. గోడల మీన రంగురంగుల కట్ల పూలు ఇంటెన్క పూసే ఉద్రాక్ష గోరంట పూలు అన్ని మా పాలే.

ఈ పూలన్ని అల్కటల్కటి పూలు.నీల్లల్ల ఏస్తె తమాషగ తేలుకుంట పోతై.నీల్లు పొయ్యకంటనే పెరిగేటివి. జప్పున వాడిపోవు కూడ. అంటే అసలు సిసలైన అందమన్న మాట.

మా ఇంటెన్కోల్లింట్ల పారిజాత చెట్టుండేది.మస్త్ పూలు  మా దిక్కు పడుతుండె .పదిలంగ ఏరి దండ కుచ్చుతుంటిమి… మొదటి రోజులన్ని రెండు బతుకమ్మలే. ఓటి పెద్ద బతుకమ్మ. రెండోది పిల్ల బతుకమ్మ. బతుకమ్మను సిబ్బిల పేరుస్తుండరి.అడుగున ఆనపు కాయ ఆకును తెమ్మని గెదుముతుండె అమ్మ. పెత్రమాసనాయె. వారం వర్జం తెలువనోల్లంత పెద్దల పేర్న  బాపుకు బియ్యమిస్తుండిరి. వాల్లందరు మాపటేల పసాదమని అస్తుండిరి. అందుకే అమ్మకు తీరకుండె.దబ్బ దబ్బ బతుకమ్మన పేర్సి  దేవుని దగ్గర పెడుతుండె పూజా పునస్కారం మల్ల ..పనిల మునుగుడే..ఆటకు తీరికేది? జర మంచిగున్న  బట్టలేసుకొని ముద్దుగ తయారుబడి మా ఇంటి దగ్గరున్న శివుడి గుడికి మా చెల్లె కృష్ణ నేనే పోతుంటిమి.మొదటి రోజు  తులసి దళాలు బాగం వక్కలే పసాదం.గదేందని మేమైతె ముక్కిరు స్తుంటిమి.ఆట మజాకు పసాదం ముచ్చటే ఖాతరు చెయ్యకుంటిమి.ఈ పసాదాల ముచ్చట్లలల్ల ఊరును బట్టి కులాన్ని బట్టి  మస్త్ ఫరకున్నది. సద్దుల్నాడు తప్ప అన్ని రోజులు అటుకులు ..పుట్నాలు. బెల్లం. శర్కర…గవ్వే ఉంటుండె .పేపర్లల్ల చపాయించినట్లు..పాటలల్ల సెప్పినట్లు ముద్దపప్పులు ఎన్నముద్దలు. ఎలగపండ్లు మాకేం తెల్వదు.మెదకోల్లకైతె  బలంగల్ల మలీద ముద్దలె పసాదం.నేను. నౌకరి చేసిన వికారాబాద్ల ఓ సామాజిక వర్గం రకరకాల వంటలొండుకొచ్చుకొని బతుకమ్మ ఆడినంక ఆ గుల్లె కూకొని తినుడు గిట్ల ఎరుకె.ఇంగ నాకు తెల్వని ముచ్చెట్లెన్నో.

మా  వాడకట్టోల్లం అమాస నాడు శివుడి   గుల్లె..అటెంక..నర్సిమ్మసామి గుల్లె…పెద్దకో(వె)ల. సిన్నకోయల.. ఎయిస్తంబాలగుడి..అంటే దినమొక్కగుడికన్నమాట. ఇగ ఆరోనాడుఅర్రెం. ఆట లేకుండె… అదేందంటే… బతుకమ్మ అలిగింది.. బతిలాడితె ఏడోరోజొచ్చిందంటుండ్రి… ఈపెద్దో ల్లేందో ముచ్చట్లన్ని మడత పెట్టే సెప్తరు.తొమ్మిదొద్దులు గంప గుత్తగాడితె పిల్లాజెల్లా.. ఇల్లంతా ఆగం కాగలదని సోంచాయింపేమొ. పద్దతులు.. పనులు.. ఆడోల్లై.. నిర్ణయాలన్నీ మొగోల్లయుంటైయాయె.. ఐనా యాడాదికోపారి ఆడుకుంటాన్రు ఇంతాసరైదామనే సోయి లేని మొగోల్లని… తెల్వని ముచ్చటా… అర్రెంనాడు అమ్మలంత ఇల్లంత సవరిచ్చుకుంటుండ్రి.ఏడోనాడు బొందిలి(రజ్ పూత్ వీథి)వాడ ఎదురుంగ ఉండే ాములోరి గుల్లె అటెంక బాలసముద్రం కట్టకింద…సద్దుల్నాడు పద్మాక్ష్మమ్మ గుండం దగ్గర. వరంగల్ జనం బద్రకాలి చెరువుకు..కాజీపేటోల్లు ఒడ్డేపల్లి సెర్వకు పోతుండ్రి.ఆఖర్న అంటే సద్దుల బతుకమ్మ నాడు పద్మాక్ష్మమ్మ గుండం దగ్గరికి పోతుంటిమి మేము.

బాలసముద్రమంటె యాదికొస్తాంది..ఆడ ఓ మంచి సెరువు ఉండేదట..జనానికి అది సిన్నపాటి సముద్రమోలె అనిపించి బాల సముద్రమని పిలుసుడు షురూ చేసిన్రట.బస్టాండ్ కు ఎదురుగ్గ ఉన్న కాలనీ పూర బాలసముద్రమే.అదిప్పుడు నీల్లు లేని సముద్రం.ఆ బాల సముద్రంల ఇప్పుడు షోకు షోకు అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బంగ్లాలు.

సద్దుల బతుకమ్మ సంబురాలైతే చెప్ప వశం గాదు.తంగేడు గునుగు పూలు ఇంటి ముంగలికే వచ్చి అమ్ముతుండిరి. రేపనంగనే ఆ పూలు కొనెటోల్లం.ఇంటెన్క చెట్ల పూలు ..పక్కింటోల్లై….దోస్తు లిండ్లల్ల…. జమ చేసుడే చేసుడు. పల్లెటూర్లల్ల అన్నో తమ్ముడో  పైసున్న మారాజులకు జీతగాండ్లో సేను సెల్కల్ల అడవిల పొంటి  తెంపుకొస్తుండిరి. మేమైతె….తంగెడు పూల ఆకులు రిబ్బి సిన్న సిన్న కట్టలు కడుతుంటిమి. గునగు పూలనైతె రకరకాల రంగులద్ది ఆర బెడుతుంటిమి.రాత్రి నిద్రే పట్టకపోతుండె.

తెల్లారితె పండుగ.నిద్రల అమ్మ బతుకమ్మ పేరుస్తాంటె.. మేము పూలందిచ్చుడు ఆడకట్టోల్లందరికంటె మా బతుకమ్మ ఖూబ్సూరత్ గ ఉన్నట్టు… కలలే కలలు. అమ్మ పొద్దున్నే లేసి గిన్నెలు బొన్నెలు తోముకొని పెయ్యికోసుకొని వంటింట్ల సొస్తుండె. చింతపండు పులిగోర.. నిమ్మకాయ పులిగోర.. పెరుగన్నం.. పెసరి ముద్దలు. పల్లిముద్దలు.. సత్తుపిండి.. నువ్వులముద్దలు.. కొబ్బరి ముద్దలు… మొత్తం ఎనిమిది రకాలు చేస్తుండె. మా దోస్తు ఉష వాళ్ళ అమ్మైతె నువ్వులు పెసళ్ళు కొబ్బరి… అన్నిటితోని సద్దులు కలుపుతుండె. శోభ వాళ్ళమ్మ అన్ని పొడలు కొడుతుండె.వంట కాంగనె అమ్మ ఐదు బతుకమ్మలు పేరుస్తుండె.రెండు పెద్దై  మూడు చిన్నై.అమ్మకు పని తీరక నేను చెల్లె ఇద్దరమే ఆడనీకె పోతుంటిమి.

మద్యాన్నం బతుకమ్మల జాతర.. కొందరు పెద్ద పెద్దగ పేరుస్తుండిరి .ఇంటాడోల్లు ఆకిలి సల్లి ముగ్గుపెట్టి బతుకమ్మను పెట్టి ఐదుసుట్లు తిరిగి జీతగాండ్లతోని మోపిచ్చుకుంట సప్పుల్లతోని పోతుండ్రి. ఇంకొందరు రిక్షామీన.. తోపుడు బండి మీన… బండి మీన… ఒక్కోల్లు… ఒక్కోతీర్న. వాల్లను చూసుడుతోనె మా జాగను ఎవరన్న కబ్జా చేస్తరన్న బుగులాయె. మేంసుత  కొత్త బట్టలేసుకొని  ముర్సుకుంట  జప్పున బయలుదేరుతుంటిమి. మా ఆగం గాకున్నది గాని… ఎవ్వరి గుంపులు వాల్లయె. ఎవ్వరి జాగ వాల్లదే. కాని జనమెక్కువ.. జాగ తక్కువ.. ఇసుకేస్తె రాలనంత జనం. ఇంగో తమాషేందంటే ఆటను సూడ్డానికే కాదు కాని ఆడే ఆడోల్లను  చూసేందుకు..మొగోల్లు..గుంపులు..గుంపులు .అండ్ల చిడాయించెటోల్లు కొందరు..సందుల సడేమియా లెక్క దొరికిన కాడికి దోసుకుందామని కొందరు.. సూడాల్నన్న సంబురం తోని ఇంకొందరు..ఆల్లింటి ఆడోల్లకు కాపలగ కూడ కొన్ని చీడ పురుగులు. ఎవల లొల్లి వాల్లదే.ఆ రోజైతె

రంగుల తోరణాల్లెక్కనే ఊరంత.ఉన్న మారాణుల పెయ్యి మీదికి  మూలకున్న నగలన్ని అచ్చి పడుతుండె. లేనోల్లు  కూడ తిప్పలు వడి కొత్తబట్టలు తెచ్చుకుండిరి. పండుగ నాడు సుత కంగన్ హాల్ నిండ జనముంటుండె. ఉన్న మా రాజుల ఐష్యత్ ఓ దిక్కు….లేనోల్ల ఆరాటం ఆనందం ఇంకో దిక్కు. ఎవల్ల కుతి వాల్లదే.ఆ కుతిల ఎక్కువ తక్కువలేముంటై.

మా గుంపు సిద్దేశ్వరుని గుడికి జర్ర ఇటొంకల అంటె ఆ గుడి తోట ముంగల ఉంటుండె. గుంపు మజ్జెల ఎంపలి సెట్టు కొమ్మను పెట్టి సుట్టూత బతుకమ్మలు..ఆ సుట్టూత ఆడోల్లం.. ఒకల్లు పాట సెప్ప్తెమిగిలినోల్లు సదువ.ఆ గుంపులంత మా సుట్టాలమేనాయె… ఇంగో ముచ్చట  ఖుల్లం ఖుల్లం ఇప్పి సెప్త. ఆడసుత కులం గుంపులన్న మాట.కొన్నేమొ ఆడకట్టు గుంపులుంటుండె. మా గుంపుల విమలమ్మత్తనే  ఇద్దరక్కసెల్లెండ్లు ఉయ్యాలో.”… తూర్పు దిక్కునా ఉయ్యాలో… ఇటు గుట్టటటుగుట్టా కోల్ జనకు జనకునింట్లా కోల్….అప్పుడే వచ్చెనూ ఉయ్యాలో….చినుకు చినుకూ వాన ఉయ్యాలో… ఒకటో మాసం నెలతన గర్భిణి… చింతాకు చీరల్ల చీరా గట్టింది…. ఒకటా రెండా మస్త్ పాటలు సెప్తుండె.పల్లెటూరోల్లైతె బూలచ్చుమమ్మ కత..రాజ రంపాలుని కత…రేణుకా దేవి ఎల్లమ్మ కత…అంటే పెద్ద పెద్ద పాటలు దినామింత పాడుతుండిరి.

సిన్నప్పుడు పాటలు పాడుడే తెలుసు. ఆ పాటల మర్మం తెల్వదు. పెరుగుతరాంగ పాటలు సమజై  పాటలల్ల ఇంత ఇక్మత్ ఉన్నదా అని నోరెల్ల బెట్టిన. ఆ పాటలల్ల బతుకమ్మ పండుగ పుట్టుక పూర్వోత్తరాలు..కుటుంబ అనుబంధాలు..సమిష్టి కుటుంబాల సమస్యలు… పొరపొచ్చాలు.. ఆర్థిక అనుబంధాలు… స్వార్థాలు… సంప్రదాయ నిర్బంధంలో వెలిబుచ్చుకోలేని వ్యక్తీకరణలు…. పరిహాసాలు.. రాజకీయాలు సామాజికాంశాలు… వినోదం.. విజ్ఞానం సమస్తంతో  మమేకమైనై. ఆ సంగతులను ఇంకోపారి పుర్సత్ గ చెప్పుకోవాలె.

నాకతేందో కూడ సెప్పాలె కదా! రెండు మూడు   పాటలు కాంగనె ఆ గుంపుల నుండి మెల్లెగ మిస్కుతుంటి.. గుంపులన్ని ఎతికి నా పాతదోస్తులందర్ని కలిసొస్తుంటి.అది జాతర కాని జాతర. పండుగ జాతర. గద్ద ఆకాశం నుండి సూసినట్టు కండ్లు కలియ తిప్పుతుంటి. నా లెక్కనే ఇంకొందరు. ఆ అచ్చట్లు … ముచ్చట్లు …చప్పట్లు.. ఎంత సూసినా కుతి తీరదనుకోండి.

ఏ ముచ్చటాకాముచ్చట సెప్పాలె కదా!.సద్దుల్నాడు ఆగమెక్కువ.. పాటలు తక్కువ… సంచులు సగపెట్టే సరికి అంగడిచ్చుల్లా అన్నట్టు.ఆటకు టైం తక్కువే. నన్ను సూడు నా అందం   సూడనుకుంట వలాయంచి ఆనొస్తుండె. మంచి మంచి చీరలాయె.కొందరివి కొత్తవి. కొందరివి పట్టువి.ఇంకొందరివి కొత్తవి పట్టువి. తడిసి ముద్దైతయని… బతుకమ్మల్ని పట్టుకొని గుండం కట్టమీకి జప్ప జప్ప పోతుంటిమి. గౌరమ్మను తీసి తపుకుల పెట్టుకొని బతుకమ్మలను గుండంల ఇడుస్తుంటిమి.కొందరు మొగోల్లు  అచ్చంగ గా పని కోసమే ఉంటుండ్రి. కొందరు బతుకమ్మ మజ్జెల దీపాలు పెడుతుండిరి.బతకమ్మలు నీల్లల్ల తేలుతుంటే కండ్లు జిగేల్మంటుండె. అటెంక  గౌరమ్మను పెట్టిన తపుకు మీన ఇంగో తపుకు మూసి

                      ఉసికల పుట్టిన గౌరమ్మ

                       ఉసికల పెరిగిన గౌరమ్మ

                       పొన్నాగంటి తాళ్లు

                        పోకలగంటి వనములు… అనే పాటను పాడినంక ఆగౌరమ్మ పసుపును పెళ్ళైన ఆడొల్లందరు ఒకల్లకొకరు ఇచ్చుకొని జమాయించి పుస్తెలకు పూసుకంటుండ్రి.ఆల్లింటాయన పదిలంగ ఉండాల్నాయె.. లేకపోతే మొగడు లేని ఆడోల్లకు  బతికినా ఫాయిదుండదని తరతరాలుగ చూస్తున్ననిబద్దాయె. అటెంక పల్లెంల పసాదం మీన ఇంగో తపుకు మూసి ఇచ్చుకుంటి వాయనం పుచ్చుకుంటి వాయినం అనుకుంట ఒగల్లకోల్లు ఇచ్చుకుంటుండిరి.అటెంక తొవ్వల బిచ్చగాల్లకు పసాదం పైసలు పంచుకుంట ఇంటి దారె. ఎదిరి సూసుట్లనే సంబరం. పండుగొచ్చే .. పాయె… మల్లెప్పుడొస్తదో… ఎదిరి సూపులే

ఇంత సంబరంగ జరుపుకునే పండుగ మెల్లగ హైజాకు ఐంది.రకరకాల పూజలు ముందు కచ్చినై. వరలక్ష్మీ వ్రతాలు నవరాత్రుల హంగామా ఎక్కువై  ఆడపిల్లలు బతుకమ్మంటె ముక్కిరుస్తుండె. తెలంగాణ ఉద్యమం మొదలైనంక బతుకమ్మ ఉద్యమ పండుగైంది.జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ప్రతి సంవత్సరం ప్రతి జిల్లా తిరిగి ఈ ఆట పాటను నెత్తికెత్తుకుంది.. అదో పునరుజ్జీవనం .బతుకమ్మ దీవెనలతో అత్యాచారాలు హత్యాచారాలు గృహ హింసలు తొలగి సమాజం ముందుకు సాగాలని ఆశిస్తూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com