1941 లో వెలువడ్డ ఈ కథలో మనిషి అలవాటైన అంశాన్ని దేన్నైనా స్వీకరిస్తాడని మనం స్వేచ్ఛ అనుకున్న దానిలో నిజమైన స్వేచ్ఛ లేదని నిరూపించారు రచయిత్రి…

ఆనాటి సాయంకాలం స్నేహితులంతా సేటు రాజారాం ఇంట్లో విందారగించి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వివిధ విషయాలను చర్చిస్తున్నారు. ఉత్సాహంగా సేటు రాజారాం తెల్లటి పర్షు మీద ఉన్న పట్టుదిండ్లకొరిగి హుక్కా పిలుస్తున్నాడు అవసరమని అనుకొన్న చోట్ల

తాను కూడా కూడా పాల్గొంటూ. దగ్గర నిలువబడియున్న నౌఖరు లక్ష్మన్ కాళీయైన గాజుగ్లాసులో వైను నింపుతున్నాడు. స్నేహితులు సేటు బలవంతం చేయాలని బెట్టుసరిగానే కాళీ చేస్తున్నారు పాత్రలు. సేటు “లక్ష్మన్! మొన్న ప్రత్యేకంగా ఆర్డరిచ్చి తెప్పించిన సీసా తీసుకురా” అన్నాడు. లక్ష్మన్ తెచ్చి మళ్లీ గ్లాసులో నింపాడు. స్నేహితులు ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. ‘సేట్! వేపారం బాగా సాగుతున్నట్లుందే! అన్నాడొక స్నేహితుడు. ‘అవును మరి లేకపోతే ఇంత ఖరీదు గల వైను తెప్పించటం

సామాన్యమా’ అన్నాడు మరొకడు. లక్ష్మన్ అందిచ్చిన గ్లాసు తీసుకుంటూ సేటు కూడా గ్లాసులోనిది కొద్దిగా చప్పరించి స్నేహితులవంక చూచి మందహాసం చేశాడు.

గ్లాసులు కాళీ కావటంతో ఉత్సాహం ఇనుమడించింది అందరికీ. అంతకుముందుదాకా చర్చిస్తున్న విషయం మళ్లీ ఎత్తుకున్నారు.

‘మీరు ఏమన్నా అనండి! యావజ్జీవం ఖైదు శిక్ష అనుభవించటం చాలా ఘోరం. అంతకంటే రెండు నిమిషాల్లో ప్రాణం పొయ్యేటట్లు ఉరితీయటం మంచిది’ అన్నాడు రాంలాల్ పట్టుదలగా.

‘బతికితే బలుసాకయినా తినొచ్చు. అసలే లేకుండా అంతమొందటంకంటె ఎట్లాగో ప్రపంచం మీద ఉండటంనయం’ అన్నాడు నరోత్తందాసు. ‘ఏమి స్వేచ్చ లేక జీవితాంతంవరకు ఆశలన్నీ చంపుకొని బతికి బాధపడటంకంటె ఉరిశిక్ష అనుభవించటం చులకనగాదూ” అని తాను కూడా ఒక సమిధ వేశాడు సేటు.

‘ఈ రెండు శిక్షలూ నాగరికత దేశాల్లో గర్హమయినవి. నెమ్మదిగానో తొందరగానో వ్యక్తుల ప్రాణాలు తీయటమే ఈ రెంటి ఉద్దేశం. కాని తప్పుచేసిన వాళ్లను మంచిమార్గంలో ప్రవేశపెట్టటానికి బదులు సంఘంలోనుండి వాళ్లను పూర్తిగా అంతమొందించటం దెబ్బతగిలిన వేలును పూర్తి కోసివేయటం వంటిది’ అన్నాడు.

లలితా ప్రసాదు చేతిలోని సిగరెట్టు బూడిద దులుపుతూ. నిజమే! ఈ రెంటిలో నాకయితే యవజ్జీవ శిక్షేవనయమనిపిస్తుంది’ అన్నాడు సరోత్తందాసుమ సేటువంక చూస్తే సేటు తన మాటను పడగొట్టాలని అన్నట్లుగా అనుకొని ‘యావజీవం ఏమిటోయి? ఒక ఐదేండ్లు ఉండలేవు! ఏకాంతంగా యావజ్జీవం గడపాలంటే మాటలా?, అన్నాడు సేటు పూర్తిగా వాదనలోకి జొరబడి. ఇద్దరికీ తమ మాట నెగ్గాలన్న పంతం ఎక్కువయి వాదన ముదురుతోంది. స్నేహితులు వాళ్లకు పొగవేస్తున్నారు. తాము తమాషా చూస్తే, ‘ఐదేళ్లుకాదు పదేళ్లుంటాను నువ్వు ఎట్లా చెప్పితే అట్లా’ అన్నాడు నరోత్తందాసు, ‘ఆ! పందెం! రెండు లక్షలు!” అన్నాడు సేటు ఉద్రేకం పట్టలేక, ‘ఓ సిద్ధం! నువ్వు రెండు లక్షలు గుమ్మరించాలి మరి ?’ అన్నాడు నరోత్తందాసు ‘తప్పకుండా?” అన్నాడు. సేటు.

ఇంకేముంది ? వ్యవహారం ముదిరింది. సేటు రాజురాంతోటలో పదేళ్లపాటు ఏకాంతవాసం నరోత్తందాసు అనుభవించేటట్లు తదుపరి నరోత్తందాసుకు సేటు రెండు లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేయించారు. స్నేహితులు.

సేటు అంతా అయిపోయ్యాక కళ్లు తెరిచాడు. “ఎంతపని జరిగింది? ఎందుకు వచ్చినట్లు ఈ రెండు లక్షలదండుగు” అన్నాడు. స్నేహితులతో, స్నేహితులందరూ రెండు లక్షల కొరకు వెనుకకు పొయ్యే పీనాసి అని బనాయించేరు. సేటు సిగ్గుతో మారుమాట్లాడక ఒప్పందం అంగీకరించాడు.

తోటలో ఒక గది ప్రత్యేకించారు నరోత్తందాసుకొరకు. సరిగ్గా పదేళ్లకు ఏ రెండు నిమిషాలు తక్కువయినా కూడా రెండు లక్షలు చెల్లించే బాధ్యత సేటుకు ఉండదు. ఖైదీకి కావలసిన వస్తువులు అర్దరు వ్రాసి తెప్పించుకోవచ్చు. పుస్తకాలు బట్టలు భోజనం వగైరాలు. అతనికి బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం ఉండకుండా ఈ వస్తువులన్నీ కిటికీ ద్వారానే వెళ్లవలసి ఉండేవి. ఖైదీ కావాలంటే ఉత్తరాలు వ్రాసుకోవచ్చు.

మొదటి సం||రమంతా చాల విసుగుగా, విచారంగా గడిపాడు. ఖైదీ ఎన్నోసార్లు ఏడవటం కూడా వినపడేది అక్కడి చౌకీదారుకి, రెండు మూడేళ్లు గడిచాక ఈ ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు. రాత్రింబగళ్లు చదవటమే చదవటం. ఖైదీ కావాలెనని వ్రాసి పంపిన పుస్తకాలు తెప్పించకలేక అవస్థపడేవాడు సేటు, తన స్థితిని గురించి విచారపడటానికి సమయమే చిక్కకపోయేది ఖైదీకి,

ఒకనాడు సేటుకు ఖైదీ పదిబాషలలో ఒక ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరం ఆయాభాషలు వచ్చినవాళ్లకు చూపెట్టుమని తప్పులు లేకుండా సరిగా ఉన్నట్లయితే తోటలో శంఖు ఊదమని వ్రాశాడు. అట్లాగే శంఖు ఊదారు.

సేటు రాజారాంకు ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యమైనది. ఈ ఏకాంతవాసం పదేళ్లపాటు అనుభవించపోతాడా ? నేను రెండు లక్షలియ్యబోతానా అనుకున్నాడు. సేటు. మొదటి సం||రంలోనే భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని ఆశించిన సేటు చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోవటం, అందులో ఖైదీ ఏమాత్రం ఒంటరితనం బాధ’ అనుభవించటం లేదని తెలుసుకొని కిటకిట పడ్డాడు.

“రేపు ఉదయం వరకు పదేళ్లు నిండుతాయి. ‘మా ఒప్పందం ప్రకారం అతనికి రేపు నేను రెండు లక్షలు గుమ్మరించాలి’ అనుకున్నాడు. సేటు. కాలం అంతా ఒక్కతీరుగా ఉండదు. పదేళ్ల కింద రోజుకు ఐదువందలు సంపాదించే సేటుకు ఇవ్వాళ యాభై రూపాయలు రావటం కష్టంగా ఉన్నది. వ్యాపారం నష్టం వచ్చి సన్నగిల్లటం మూలానా రెండు రూపాయలు రెండు లక్షల సమానంగా ఖర్చు పెట్టుతున్నాడు. ‘రేపు ఎట్లాగూ ఇయ్యటం తప్పదు. ఇస్తే ఇంక నేను బిచ్చమెత్తుకోవాల్సిందే? అంటూ ఎటూ తోచక పచారు చేస్తున్నాడు తన గదిలో. ‘నేననుకున్నట్లు వీడు చచ్చిపోతే ఎంతబాగుండేది! ఏ దిగులు లేకుండా!’ అని గొణిగాడు మళ్లీ! ఇంతలో గడియారం రెండు కొట్టింది. కిటికీలో నుండి బయటికి చూచాడు. దట్టంగా చీకటి ఉన్నది. సన్నగా తుంపరపడుతోంది. చప్పున పెట్టెదగ్గరకు వెళ్లి ఎర్రటి ముఖమలు ఒరలో మెరిసిపోతున్న చిన్న కరవాలం మొలలో దోపుకొని తాళపు చెవులగుత్తి పట్టుకొని బయలుదేరాడు. తోటలోకి వెళ్లి చేతిలోని టార్చి వెలిగించి చౌకీదారును పిలిచాడు. వాడు పలకలేదు అంతరాత్రి. ‘మొదలు అనుమానం చౌకీదారు మీదపడుతుంది. తరువాత ఎట్లాగయినా తప్పించుకోవచ్చు’ అని మొలలో ఉన్న కత్తిని చూసుకున్నాడు. మెల్లిగా గది దగ్గరకు వచ్చాడు. బల్లమీద లాంతరు వెలుగు కిటికీలోనుంచి కనబడుతున్నది. టేబిలు దగ్గర కుర్చీలో ఖైదీ కూర్చున్నాడు కిటికీవేపు వెన్నుచేసి, ఐదునిమిషాలు గడిచాయి. ఖైదీ కదలనేలేదు. ‘పదేళ్ళ నుండి ఇట్లా కదలకుండ కూర్చోటం అలవాటయింది కాబోలు’ ననుకున్నాడు సేటు. కిటికీ తలుపు చప్పుడు చేశాడు. అయినా కదల్లేదు. సేటు తలుపు తాళం తీశాడు. పదేళ్లకింద వేసిన తాళం, తీస్తుంటే కిర్రుకిర్రుమన్నది. తాను తాళంతీస్తే ఎంత ఆశ్చర్యంగా చూస్తాడో లేక ఏమన్నా అంటాడేమోననుకున్నాడు. కాని అతడు కదలనన్నా కదలలేదు. గడ్డం జుట్టు బాగా పెరిగింది. చిక్కిశల్యమయి ఉన్నది అతని శరీరం, సూర్యరశ్మి లేక ఒళ్లంతా పండుబారింది. టేబిలుమీద అన్నీ తెరచిన పుస్తకాలు కుప్పలుగా పడి ఉన్నవి. అతని ఒళ్లో కూడా ఒక పుస్తకం ఉన్నది. చదువుతూ చదువుతూ నిద్రపోయినట్లున్నది అనుకున్నాడు సేటు. ‘ఇప్పుడు పొడిచివేయటం చాలా చులకనయినపని’ అని టేబిలువంక చూడగానే ఒక కాగితము మీద ఏదో వ్రాసి ఉన్నది.

అది తీసి దీపం వెలుతురులో చదవటం మొదటు పెట్టాడు. ‘నేను రేపు ఉదయం బంధవిముక్తుణ్ణి అవుతాను. నాకు స్వేచ్చ వస్తుంది. కాని నేను ఈ గది వదలి వెళ్లడానికి ముందు కొన్ని విషయాలు నీకు విశదీకరించటం అవసరం.

ప్రపంచం అంతా పెద్దవాళ్లన్నట్లు మిథ్య. ఈ స్వేచ్ఛ, ఈ జీవితం బుద్బుదప్రాయాలు. ప్రపంచంపై మెరుగులతో నిండి ఉన్నది. ఇట్లాంటి బూటకపు ప్రపంచంలో జీవించటం నా కిష్టం లేదు.

ఈ పదేళ్లబట్టి నేను ఐహిక సుఖాలన్నిటినీ పుస్తకాలద్వారా అనుభవించాను. తోటల్లో విహరించాను, ఆరామాల్లో విశ్రాంతి తీసుకున్నాను. స్త్రీలను ప్రేమించాను, యాత్రలు సేవించాను, చూడదగినవి చూశాను, వినదగినవి విన్నాను, అంతా అనుభవమయినదినాకు.

నీ పుస్తకాలవల్ల జ్ఞానం సంపాదించాను. నేను మీ అందరికంటె తెలివిగలవాడనయ్యానన్న నమ్మకం నాకు బాగా కుదిరింది.

కాని ఈ పుస్తకాలు ఈ జ్ఞానం అంతా వ్యర్ధం. ఎంతటివాడికయినా చావుతప్పదు. అందం, చందం, ధనం, ధాన్యం, తెలివి, గొప్పతనం అంతా చెల్లు దీనితో,

ప్రపంచం అబద్దాన్ని నిజంఅంటుంది. పై మెరుగులన్ని నిజమయిన అందం అని నమ్ముతుంది. ఇట్లాంటి లోకమే స్వర్గమని ఆనందిస్తుంది.

నాకు ప్రపంచం మీద విసుగుపుట్టింది. ఇవేవి నన్నాకర్షించవు. కొన్నాళ్ల క్రింద రెండు లక్షల ఆస్తికోసం ఎన్నోకలలు కన్నాను. అనుభవించినట్లే ఆనందించాను. కాని నేడు నాకవి అనవసరం. కనుక నేను నిర్ణీత సమయంకంటే ముందుగా వెళ్లిపోయి మన ఒప్పందం విచ్ఛేదం చేస్తున్నాను. ”

సేటు ఇదంతా చదివి కాగితం అక్కడ పడేసి ‘నూరేళ్లు జీవించు నాయనా’ అని నెమ్మదిగా వెళ్లిపోయినాడు. తెల్లవారి చౌకీదారు ఖైదీ పారిపొయ్యాడని బిక్కమొహం వేసుకొని చెప్పాడు. .

రాజారాం సేటు బల్లమీద ఉన్న రెండులక్షలు ఒప్పందం వ్రాసిన పత్రం వంక ఒకమాటు చూచి డ్రాయరులో పడేశాడు.[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com