రిటైరై అప్పుడే పుష్కర కాలం గడిచింది. 6-1-2020 న జరుగబోయే గోల్డెన్ జుబ్లీ ఫంక్షన్ సందర్భంగా కాలేజి నుండి ఆహ్వానం అందింది. ముప్పై నాలుగేండ్ల అనుబంధం ఆ కాలేజీతో .ఇంకా వారం రోజులుంది .ఓల్డ్ స్టూడెంట్స్.. కొలీగ్స్ అందర్నీ కలవొచ్చనే ఆరాటం.ఏడు రోజులు ఏడు యుగాలుగా గడిచినై.ఆరోగ్యం పెద్దగా సహకరించడం లేదు.నిమోనియా సోకింది. మందులు తప్పవు కదా! వాటి సైడెఫెక్ట్ తో కాళ్ళ వాపులు. స్వేఛ్చగా తిరుగలేను.కచ్చితంగా కారు ప్రయాణమే.తప్పదు. నాకవసరమైనప్పుడు వచ్చే డ్రైవర్ మల్లేశం కు ఫోన్ చేసిన. ఊళ్ళో లేనన్నాడు.ఇంకో డ్రైవర్ కృష్ణకు చేసిన.అక్కడా మొండిచెయ్యే ఎదురైంది.ఇక నా ప్రయాణానికి నీళ్ళొదులుకున్నట్టే అనుకొని నీరు కారి పోయిన.మధ్యాహ్నం భోజనం చేద్దామని వంటింటి వైపు పోతున్న నన్ను ముందు నా పని చూడమన్నట్లుగా ఫోన్ మోత.తప్పదు కదా!.వెనక్కి పోయి ఫోన్ అందుకున్న.రాగిణి మేడమ్ ఫోన్.

ఆమె మా కాలేజిలో డెబ్బై ఐదు లో అనుకుంట ఓ సంవత్సరం పని చేసింది.

” మీరు గోల్డెన్ జుబ్లీకి.పోతున్నరా ” ఆమె ప్రశ్న

“పోవాలనే అనుకున్న. డ్రైవర్ లేడు” నా సమాధానం.

“ఔనా? ఐతే ఓ పని చేద్దాం. మీరు మా యింటికి రండి. మా కారులో పోదాం.” ఆమె పరిష్కార మార్గం చెప్పింది. నా సంతోషానికి అవధులు లేవు.ఎగిరి గంతేసిన.ఇక చెప్పేదేముంది.బడి రోజుల్లో చిన్న పిల్లలు విహారయాత్రకు పోతున్నంత ఉత్సాహంతో కూకట్ పల్లి లోని వాళ్ళింటికి చేరుకున్న. అటుపై శంకర్పల్లి మీదుగా మా ఊరు వికారాబాదుకు ఒంటిగంటకల్లా చేరుకున్నం.న్యాయంగా ఆ రోజు వికారాబాద్ లో నాకు ఓ విందు భోజనానికి.. మరో విద్యాపీఠం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానాలున్నై.రాగిణీ మేడమ్ కు అసౌకర్యం అవుతుందన్న ఆలోచన ..కాలేజికి పోవాలన్న ఆతృత ఆ ఆహ్వానాలను తిరస్కరించింది.

ఆహ్వాన కమిటీ ముందు భోజనాలు చేయమంది.హాల్లో అడుగు పెట్టినం.అంతా అనుకున్నట్టే పాత విద్యార్థులు ..ఎక్స్ కొలీగ్స్..నాన్ టీచింగ్ ..కాంటిన్ జెంట్ ..ఊరి పరిచయస్తులు ఎంత మందో. ఆత్మీయ ఆలింగనాలు (కరోనా రాలేదు కదా) కరచాలనాలు నమస్కారాలు .కలగూర గంప వ్యవహారం .భోజనాలు ముగుస్తుండగానే ఎవరో మోసుకొచ్చిన వార్త.ముఖ్య అతిథి రాక గంట ఆలస్యమని. చేసేదేముంది? కాలేజంతా కలియ తిరుగుతూ స్టాఫ్ రూం చేరుకున్నం.ఉత్సాహం ఉరకలు వేసినా ఏడు పదుల వయస్సాయె.అలసట ఆవహించింది.మా తెలుగు అధ్యాపకుడి ఆహ్వానం తో మా శరీరాలు కుర్చీలలో చేరగిలబడిపోయినై. ఆ గదితో ఉన్న అనుబంధం ఇంతా అంతా కాదు.నా కళ్ళు ఎంతో ప్రేమగా ఆ గదినంతా కలియ చూసినై. నాక్ సందర్భంగా ఏర్పాటు చేసిన రకరకాల చార్ట్స్..ఫొటోలు..తెలుగు..ఇంగ్లీష్..హిందీ శాఖలు కలిసి కొన్న బీరువ అన్నీ నన్ను ఆత్మీయంగా పలకరించింది.ఆ పలకరింపులు నన్ను గతంలోకి తీసుక పోయినై.

***** *****. *****. ******. ******* క్లాసు ముగించుకొని వచ్చి రిజిస్టర్స్ డ్రా లో పెడుతున్న..లాంగ్ బెల్ ..అది అకాల లాంగ్ బెల్. అంటే ఏదో బంద్ అన్నట్టు..బిసి విద్యార్థులు ఫీసులు విషయంగా చేస్తున్న బంద్ అన్న వార్తను రుక్కమ్మ మోసుకొచ్చింది.విద్యార్థులున్నా లేకపోయిన అధ్యాపకులు ఫైవ్ అవర్స్ స్టే కంపల్సరి కదా! లైబ్రరీకి పోదామని లేచిన.

“ప్రిన్స్ పల్ సారు పిలుస్తుండు” అంటూ రుక్కమ్మ ఎంటరైంది.

ఏమై ఉంటుందని ఆలోచిస్తూనే ప్రిన్స్ పాల్ రూం చేరుకున్న. ఆయనకు విష్ చేసి ఓ చేర్ లో కూర్చున్న

“ఎందుకు పిలిచినట్టు” అన్న మొహం పెట్టి.

“మేడమ్! కాలేజ్ డే వారం రోజులే ఉంది. పిల్లలకు లిటరరీ ప్రైజులు అకడమిక్ ప్రైజులు తేవాలె. విద్యార్థులు లేరు..క్లాసులూ లేవు.ట్రేన్ టైముంది..ఈ ోజే పోతే బాగుంటుంది కదా! “ప్రిన్సిపల్ మాట.

నేను కాలేజిలో చేరి ఇరవై ఏడు సంవత్సరాలు.ఇప్పటి వరకు నేను లిటరరీ కన్ వీనర్ అయింది లేదు.పుస్తకాలు తెచ్చింది లేదు.అందుకేనేమొ ఆయన మాట నా చెవుల్లో అమృతం పోసినట్లని పించింది.వెంటనే అందుకు సిధ్ధమైన. మా ఇంటి ప్రథమ పురుషుడికి కూడా సమాచారం చేర వేసి లేడికి లేచిందే పరుగన్నట్లు బయలు దేరిన. నాతో పాటు తెలుగు ఇంగ్లీష్ హిందీ సలహా దారులతో ఉరుకుల పరుగులతో ట్రేన్ కాచ్ చేసినం. ఏ సిగ్నల్స్ ఆటంకపరుచ లేదు.పన్నెండున్నరకల్లా నాంపల్లి ..ఒంటిగంటకల్లా నవయువగ బుక్ హౌసు చేరుకున్నం.

నేను కాలేజిలో చేరి ఇరవై ఏడు సంవత్సరాలు.ఇప్పటి వరకు నేను లిటరరీ కన్ వీనర్ అయింది లేదు.పుస్తకాలు తెచ్చింది లేదు.అందుకేనేమొ ఆయన మాట నా చెవుల్లో అమృతం పోసినట్లని పించింది.వెంటనే అందుకు సిధ్ధమైన. మా ఇంటి ప్రథమ పురుషుడికి కూడా సమాచారం చేర వేసి లేడికి లేచిందే పరుగన్నట్లు బయలు దేరిన. నాతో పాటు తెలుగు ఇంగ్లీష్ హిందీ సలహా దారులతో ఉరుకుల పరుగులతో ట్రేన్ కాచ్ చేసినం. ఏ సిగ్నల్స్ ఆటంకపరుచ లేదు.పన్నెండున్నరకల్లా నాంపల్లి ..ఒంటిగంటకల్లా నవయువగ బుక్ హౌసు చేరుకున్నం.

విద్యార్థుల ప్రైజ్ పుస్తకాలు..ఓ పది వేల విలువ సుమారుగ..అని షాపు యజమానికి చెప్పినం.

“ఏ టైప్ పుస్తకాలు ఇయ్యమంటరు సార్” షాపు ఓనర్ ప్రశ్న

“సాహిత్యానికి సంబంధించినవి.”

“అవేనా? కాంపిటీటివ్ ఎక్జామ్స్ కి సంబంధించినవా?”

“మాకు సాహిత్యం పుస్తకాలే కావాలె.”

“అది కాదు సార్. కాంపిటీటివ్ లో డిస్కౌంట్ ఎక్కువ ఉంటది.”

“డిస్కౌంట్ లొల్లి పక్కన పెట్టండి.పిల్లలకు ఉపయోగ పడేవే కావాలె.”అన్నాం మేము. “మీ ఇష్టం.పుస్తకాలు వెతుక్కొండి.”షాపు ఓనరు.

ముగ్గురమూ షాపు లోపలికి పోయినం. షాపంతా కలియ తిరిగినం. నేను మా తెలుగు అధ్యాపకుడు నారాయణ రావు కలిసి పరి శోధన చేసిన లెవల్లో పుస్తకాలు వెతికినం. దాశరథి “చిల్లర దేవుళ్ళు” ..వట్టికోట “ప్రజల మనిషి” ..శ్రీ శ్రీ మహాప్రస్థానం ..కొడవటిగంటి “చదువు” ఇంకా అమృతం కురుసిన రాత్రి, మేఘ సందేశం, రాచకొండ ఇల్లు …అన్నీ పిల్లలకు సాహిత్యంతో పరిచయం ఉండే..ఆలోచన కల్పించే పుస్తకాలను సెలెక్ట్ చేయడంతో పుస్తకాలతో యుద్ధం చేసినమా అనిపించింది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండ ఏదో దీక్ష చేసిన ఫీలింగ్. టైమే తెలియలేదు. ఏడైంది..తొందరగా తెమలమని గడియారం హెచ్చరించింది .ఇంగ్లీషు ,హిందీ సలహాదారులు తమకు అనుకూలమైన పుస్తకాలు సెలెక్ట్ చేసుకున్నరు. నేను కౌంటర్ దగ్గరికి పోయి “బిల్ ప్రిపేర్ చేయండి “అంటూ మేం సెలెక్ట్ చేసిన పుస్తకాలను బిల్ కౌంటర్ టేబుల్ మీదికి చేర్చినం.

నేను కౌంటర్ దగ్గరికి పోయి “బిల్ ప్రిపేర్ చేయండి “అంటూ మేం సెలెక్ట్ చేసిన పుస్తకాలను బిల్ కౌంటర్ టేబుల్ మీదికి చేర్చినం.

“మేడమ్ డిస్కౌంట్ 15+10% ఓకేనా?”అడిగిండు షాపతను “అర్థంకాలేదు” అన్నాను.

నేను “15% బిల్లులో చూపించి మీ చేతికి 10% ఇస్తం”.

“షాపతను “ఔనా!”అంటూ మా సహాధ్యాపకులవైపు చూసి

“ఈ బహిరంగ రహస్యం ఇప్పటి వరకు మనకు తెలియదు కదా!” అన్నాను నేను.

“నిజమే! మనకు అప్ టు డేట్ నాలెడ్జ్ నిల్”నవ్వుతూ అన్నారు మావాళ్ళు.

“ఏంచేద్దాం?”అని ప్రశ్నించి” ఒక పని చేద్దామా”అని నేనే తిరిగి అన్న”

“చెప్పండి” అడిగిన్రు మా వాళ్ళు

“10% తో విద్యార్థులకు ఉపయోగపడే పనేమైన చేస్తే?”అన్నాన్నేను.

“చాలా మంచి ఐడియా”మా వాళ్ళ సమాధానం.

“సేట్ జీ ! 15+10% చెయ్యండి” అని చెప్పగానే “సరే “అంటూ ఆయన బిల్ చేసి ఇచ్చిండు. కరెక్ట్ గా గుర్తు లేదు.ఓ పన్నెండు వందల చిల్లర మా చేతిల పెట్టిండు.ఆ పుస్తకాల పాక్ లను షాపులోనే పెట్టి వెనకాల ఉన్న ఓ చిన్న హోటల్ లో ఆత్మారామణ్ణి శాంతిపచేసి ..పుస్తకాలతో ….ఆటోలో నాంపల్లి చేరుకున్నం.అదృష్టం కొద్ది ట్రేన్ దొరికింది. సీట్లూ దొరికినై.పని అనుకున్నట్టుగా సవ్యంగా సాగి నందుకు తృప్తిగా అనిపించింది.ఊపిరి పీల్చుకున్న.ట్రేన్ తో పాటు నా ఆలోచనలూ వేగం పుంజుకున్నై. మధ్యలో విరామంగా మా వాళ్ళతో చాటింగ్ కూడా. ఉన్నట్టుండి నా మెదడులో ఓ మెరుపు.

వెంటనే “నాకో ఆలోచన వచ్చింది” అన్నాన్నేను మా వాళ్ళతో.

“చెప్పండి ” “ఓ బీరువా కొందామా?”

బీరువా ఎందుకు?””

“మన సాహిత్య శాఖకు”.

“ఏం చేద్దాం?”

” మన ఫైల్స్ తో పాటు ప్రైజ్ లు తీసుకోని విద్యార్థుల పుస్తకాలను అందులో పెట్టొచ్చు”

“పెట్టి?”

” ఈ మధ్య కాలంల కాలేజ్ డే రోజు విద్యార్థులు అందరు రావటం లేదు. వాళ్ళ పుస్తకాలను బీరువాలో పెట్టొచ్చు. వీలునుబట్టి వచ్చిన వాళ్ళకు ఇవ్వొచ్చని. పుస్తకాలు బీరువాలో సేఫ్టీగా ఉంటై కదా?”

“నిజమే. కాని ఈ అమౌంట్ కు బీరువా !”అనుమానంతో మా వాళ్ళ ఎదురు ప్రశ్న

“అదీ ఆలోచిద్దాం. మనసుంటే మార్గముండదా?! ఐనా బీరువా షాపు ఓనరు నాకు బాగా తెలిపిన వాడే. బాలెన్స్ అమౌంట్ నెక్స్ట్ ఇయర్ ఇద్దాం.ఒప్పుకుంటే ఓకే. లేదంటే మనమే వేసి తర్వాత తీసుకుందాం.పిల్లలకోసం ఆ మాత్రం చేయలేమా?”అన్నాన్నేను. మా వాళ్ళూ అంగీకరించిన్రు.అనుకున్నట్టే షాపు యజమాని ఒప్పుకోవడంతో బీరువా మా స్టాఫ్ రూంను అలంక రించింది. కాలేజ్ డే కూడా ఐపోయింది.పుస్తకాలూ మిగిలిపోయినై.

బహుమతులందుకోని విద్యార్థుల లిస్టు తయారు చేసిన. వీలైనంత తొందరగా స్టాఫ్ రూంకు వచ్చి పుస్తకాలు తీసుక పొమ్మని సర్కులర్ పంపిన. అనివార్యంగా ఆ రోజు రాలేని విద్యార్థులు ఒక్కక్కరు వచ్చి తీసుకుపోవడం చాలా రోజులే కొనసాగింది. తమ బహుమతులు తమకు చేరిన అవకాశానికి ఎంతో మురిసిపోయిన వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తే నా ఆనందానికి అవధులు లేకుండా ఐపోయింది. తర్వాత సంవత్సరం బీరువా బాకీ తీరింది. ఆ తర్వాత మా మా డిపార్టుమెంటు కు కావలసిన పుస్తకాలు అందులో చేరినై.కాలం ఆగదుకదా! వయస్సు నన్ను విశ్రాంతి తీసుకొమ్మంది.

*****. *****. ********

అప్పుడు మేము విద్యార్థుల కొరకు స్వంతంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు.ఒక చిన్న ప్రయత్నంతో వాళ్ళకో సదుపాయం. అందులో కొండంత సంతృప్తి . అదో మధుర స్మృతి.ఆ స్మృతులన్నీ కనురెప్పల చాటున ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.

“మేడమ్! నిద్ర పోతున్నరా? చీఫ్ గెస్ట్ వస్తున్నాడట.అనౌన్స్ చేస్తున్నరు.పదండి”అంటూ రాగిణి మేడమ్ నా ఆలోచనలకు బ్రేకు వేసింది.

వేదిక వైపు నడిచినం.ముఖ్య అతిథి రాక ప్రసంగం నిష్క్రమణ అన్నీ జరిగిపోయినై .కానీ గతస్మృతుల సువాసనలు నన్ను వీడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com