తెలంగాణ జీవన విధాన ముఖచిత్రం బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధించే  చైతన్యపు సంతకం బతుకమ్మ పండుగ. మనకున్న పండగలన్నిటిలోకి విలక్షణమైన పండుగ ఇది. సహజంగా పండుగ అంటేనే సంబురం. అందులోనూ బతుకమ్మ పండుగంటే బతుకును ఒక పండుగగా జరుకోవడమే. దాదాపు మన పండుగలన్నీ ఇంటి దగ్గర, కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా ఉంటాయి. కానీ బతుకమ్మ పండుగలో పూలు తేవడం నుండి మళ్లీ బతుకమ్మను నీటిలో వదిలే వరకూ ఇందులోని ఘట్టాలన్నీ ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా, అందరితో కలిసి సాగుతాయి. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే పూలుంటాయి. కట్టను సంరక్షించుకుంటేనే చెరువుంటుంది. జమ్మి చెట్టైనా పాలపిట్టైనా ప్రకృతి చక్కగా ఊంటేనే. సహజ వనరులను కాపాడుకోవాలనే స్పృహను తెలిపేదే బతుకమ్మ. ప్రకృతి నుండి పూలను సేకరించడం మళ్లీ అదే ప్రకృతిలో భాగమైన చెరువులో వదలడం. ఇదొక గొప్ప అద్యాత్మిక భావన. అలాగే గొప్ప మానవ సంభంధాల మణిహారం కూడా బతుకమ్మ. సమానత్వం ఐక్యతల సమ్మేళనం ఇది.

సద్దుల బతుకమ్మనాడు పొద్దున్నేఅందరూ, ముఖ్యంగా పిల్లలు బతుకమ్మ పూల కోసం గుంపులు గుంపులుగా బయలుదేరడం ప్రతీ పల్లెకూ సుపరిచితమే. తెచ్చిన పూలను ఒక్కొక్క వరుసా ఒక పద్దతి ప్రకారం పేర్చడంలో స్త్రీల సహజ సృజనాత్మకత కనిపిస్తుంది. తంగేడు, గునుగు, కట్ల, బీర, గుమ్మడి వంటి తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మతో అమ్మ ముందుకు సాగితే చిన్న బతుకమ్మతో ఆడపిల్లలు, సద్దులతో మగపిల్లలు వెళ్ళడం ప్రతి తెలంగాణ బిడ్డకూ ఎక్కడ ఉన్నా ఎప్పటికి నిలిచిపోయే ఒక అందమైన జ్ఞాపకం. తమ తమ ఇండ్ల ముందు ఆడిన అనంతరం బతుకమ్మలతో స్త్రీలంతా ఉరి మద్యలో కానీ గుడిదగ్గరకు కానీ చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ చుట్టూ లయబద్దంగా అడుగులేస్తూ బతుకమ్మ పాటలు పాడడం ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ జన జీవనంలో పాటది ప్రముఖ పాత్ర. ఇక బతుకమ్మ పాటలకైతే ఈప్రాధాన్యత మరీ అధికం. బతుకమ్మ పాటల్లొ ప్రధానంగా కనిపించేవి ప్రకృతి, లోకరీతి,  చరిత్ర, వీర గాథలు, ఇతిహాసిక ఘట్టాలు,  మానవ సంభందాలు, ప్రజల నమ్మకాలు. ఇందులో రాముడు విరిచిన శివధనుస్సు నుండి మూసీ వరదల్లో మునిగిన పట్నం దాకా… గ్రామ చెరువుకు ఆరమై (ఆహారమై) ఊరిని కాపాడిన అక్కమ్మ నుండి  పండుగకు తీసుకెళ్లేందుకు వచ్చే అన్న కోసం చెల్లె ఎదురుచూపుల దాకా ప్రతీది వీటిలో ఒదిగిపోతాయి. కదిలించే ఆర్ద్రం, సున్నితమైన వ్యంగ్యం, విన సొంపైన ప్రాసతో రాగయుక్తంగా ఒకరు పాడుతుంటే బతుకమ్మల్ని మధ్యలో ఉంచి వాటిచుట్టు వలయాకారంలో నెమ్మదిగా అడుగులేస్తూ మిగతావారు అ పాటను అనుసరిస్తారు. అందుకే బతుకమ్మ పేర్చడం ఒక కళ. బతుకమ్మ ఆడడం ఒక కళ. బతుకమ్మ పాట పాడడం ఒక కళ.

ఇక సహజంగా సృజనశీలురైన మహిళలకు ఈ పండుగ వారి ప్రతిభకు పదును పెడుతూ ఆనందాల్లో ముంచెత్తుతుంది. ప్రతీరోజు బిజీ బిజీ గా గడిపే ఆడబిడ్డలు నగరమైనా పల్లెలైనా వారి దైనందిన గజిబిజి పనులనుండి ఈ తొమ్మిది రోజుల సమయం వారికి ఒక ఆటవిడుపుగా దొరుకుతుంది. ఇక పండుగలో చివరి అంకం.. ఆడి ఆడి అలసిన ఆడబిడ్డలంతా చీకటి పడుతుండంగ బతుకమ్మలతో ఊరి చెరువు గట్టుకి కదలిరావడం. ఇది చూడడానికి రెండు కళ్లూ చాలవు. కలిసి బతుకమ్మ ఆడడమైనా, బతుకమ్మలను వదిలిన అనంతరం తాము తెచ్చుకున్న సద్దులను పక్కవారితో పంచుకొని తినడమైనా ఒక సామూహిక సమానత్వ ప్రకటన. చెరువుతో ముడిపడని పల్లె జీవితం ఉహకు అందనిది. ప్రాణాధారమైన ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ జీవన వైశిష్ట్యం. బతుకమ్మ పండుగ నీళ్ళ పండుగ. పూల పండుగ.  పల్లె చుట్టూఅల్లుకున్న అందమైన పండుగ. అందుకే బతుకమ్మ  ప్రకృతి పరవశించే పండుగ.. పల్లె విరిసి మురిసే జాతర.

అనంతర కాలంలో ప్రపంచీకరణ ఒక వైపు పక్కప్రాంతం వారి వివక్ష మరోవైపు కావడంతో తొమ్మిది రోజుల పండుగ కాస్తా సద్దుల బతుకమ్మకే పరిమితమయ్యే పరిస్థితి. సమైక్యాంధ్ర పాలనలో ప్రభుత్వ సంస్కృతిక పీఠాల నుండి సినిమాలు, పాఠ్యపుస్తకాల దాకా ప్రతీ చోట విస్మరనకు గురైంది బతుకమ్మ.  ఆనాటి ప్రభుత్వాల నుండి గుర్తింపు లేదు. నిధులు లేవు. ఆఖరికి పదమూడేళ్ల కింద కవిత గారు జాగృతి నుండి బతుకమ్మ ప్రారంభించిన రోజున హైదరాబాదులో ట్యాంకుబండ్ పై బతుకమ్మ ఆడుకోడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకొని ఆడాల్సిన పరిస్తితి. ఆ ఒక్క సంవత్సరమే కాదు తెలంగాణ వచ్చే వరకు ఇలాగే జరిగింది. సమైక్యపాలనలో జరిగిన సాంస్కృతిక విద్వంసంలో బతుకమ్మ కూడా అరిగోస పడ్డది.  ఉద్యమానికి ముందే కాదు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలంలో కూడా పండుగ తొమ్మిది రోజులు మిన్నకుండా ఉండేవి ప్రధాన పత్రికలు. సద్దుల బతుకమ్మ తెల్లారి మాత్రం నిన్న తెలంగాణలో బతుకమ్మ పండుగ జరిగింది అని పేపర్లో ఎక్కడో ఓ మూలకు చిన్న సింగిల్ కాలమ్ వార్త వేస్తే బాధపడ్డాయి తెలంగాణ హృదయాలు. అప్పటి ప్రభుత్వాల నుండి పొరుగింటి ప్రాంతేతరుల దాకా అందరిచే వివక్షకు గురై బెంగటిల్లిన బతుకమ్మను లక్షలాది ఆడబిడ్డలతో కలిసి తెలంగాణ నలుమూలలా నిర్వహించింది తెలంగాణ జాగృతి. దానికి సారథ్యం వహించినవారు జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు.

తెలంగాణ ఉద్యమంతో మమేకమై సాగింది బతుకమ్మ సాంస్కృతిక ప్రస్థానం. ఈ క్రమంలో ఏ మీడియా ఐతే మన పండుగకు మొఖం చాటేసిందో అదే మీడియాను భాగస్వాములుగా ఉంచి పండుగ నిర్వహించింది తెలంగాణ జాగృతి. తెలంగాణ జిల్లాలలో తొమ్మిది రోజులు లక్షలాది ఆడబిడ్డలతో బతుకమ్మ సాంస్కృతిక యాత్ర కొనసాగించింది సంస్థ. వినసొంపైన జానపద శైలిలో సాగే మన అచ్చ తెనుగు పదాల బతుకమ్మ చప్పట్ల పాటలను ప్రతీయేడు సహజ పద్దతిలో రికార్డు చేసి సీడీలుగా అందించింది. తెలంగాణ నలుమూలలా సేకరించిన బతుకమ్మ పాటలతో పుస్తకాలు తీసుకు వచ్చింది. దేశ విదేశాలలో వేలాది చోట్ల ప్రత్యక్షంగా బతుకమ్మను నిర్వహించింది. ఆర్టు క్యాంపులు, ఫోటో ఎగ్జిబిషన్లు, కవిత్వ శిబిరాలు నిర్వహించి ప్రతీ కళారూపంలోకి బతుకమ్మను ప్రవహింప చేసింది జాగృతి. ఏ యేటికా ఏడు పెరిగిన ఈ ఒత్తిడికి తలొగ్గి అప్పటి సమైక్య ప్రభుత్వం పండుగ ఏర్పాట్లకు నిధులు విడుదల చేసి జిల్లా కలెక్టర్లకు పంపడం తెలంగాణా ఉద్యమ విజయమే.

ఒకప్పుడు బతుకమ్మ పేరెత్తడానికే వెనకాముందైన మీడియా సంస్థలు ఇవ్వాల బతుకమ్మ ప్రత్యేక పాటలు తీస్తున్నాయి. సంచికలు వెలువరిస్తున్నాయి. ఒకప్పుడు పరిస్థితుల కారణంగా ఒక్కరోజుకే పరిమితమైన పండుగ నేడు ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులు ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వెల్లివిరుస్తుంది. బతుకమ్మ ఇపుడు బడి పిల్లల పాఠ్యాంశమైంది. ఒకప్పుడు తెలంగాణకే పరిమితమైన మన పండుగ నేడు వివిధ దేశాలలో జాగృతి, అనేక ఇతర ఎన్నారై సంఘాల ఆధ్వర్యంలో సగర్వంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ మట్టి వాసనల మకరందాల్ని ప్రపంచమంతా వెదజల్లుతునారు మన బిడ్డలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం బతుకమ్మను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి సారథ్యంలోని తొలి తెలంగాణ ప్రభుత్వం. ఇది ప్రతి తెలంగాణ బిడ్డ ఎదురుచూసిన సంధర్భం. కలలుగన్న దృశ్యం. తెలంగాణ ఆడబిడ్డలు తరతరాలుగా కాపాడుకుంటు వస్తున్న విలక్షణ మహోన్నత సాంస్కృతిక వారసత్వం మన బతుకమ్మ పండుగ. ఈ పరంపరను కాపాడడంలో, ముందు తరాలకు భద్రంగా అందించడంలో తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగునంగా  తెలంగాణ జాగృతి కృషి  సదా కొనసాగుతూనే ఉంటుంది.  తెలంగాణ సంస్కృతి వర్దిల్లాలి.

– రంగు నవీన్ ఆచారి,

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com