
ఎవరో వచ్చెదరుద్దరింతురని నీవెంతేని భావించినన్
వివరింపందగు నీకు నీవె కృషితో విజ్ఞత్వమున్ దాల్చచున్
భువిలో సాగగ మేలు నీకు కలుగున్ పూర్ణ ప్రభాజాలముల్
నవచైతన్యము నిండగా కదలుమా ! నానాక్రియోద్యుక్తతన్!
నవచైతన్యము నిండగా కదలుమా ! నానాక్రియోద్యుక్తతన్!
నిత్యోత్సాహము నిర్విరామకృషితో నీ మార్గమున్ జాగృత
స్తుత్యమ్మౌనటు దీర్చుకోవలయు నీతోబాటుగా దీనులన్
సత్యా నందా పథాలలో నడుపుచున్ సామాజికౌన్నత్యమున్
ముత్యమ్నున్ వలె దీర్ఘగావలయు నీ మోదాలు పండించుచున్ !
ఆర్తత్రాణ పరాయణత్వమున సంహ్లాదమ్ము నిల్చున్ సదా
కీర్తిక్ నిల్పెడి సేవలందు జనతాగేహాల దీపాలతో
మూర్తీభూత దయాపయోనిధివిగా భూషింపుమా ! నీ కృషిన్!
సేవాభావము తృప్తి కారకమగున్ సేవింప భావింపుమా!
ఆవిష్కారముగాగ నీగుణములే ఐశ్వర్య జాలమ్ములై
కానింపంగ సమస్త మానవ మనః కాంత్యుద్భవానందమున్
రావోయ్ ! నవలోకమున్ నిలుపగా రాజిల్లగా రాష్ట్రమే!
విద్యావైభవముల్లసిల్లునటులన్ వేవేల రూపాలతో
నుద్యద్భానుడవై జనావళికి సద్యోగమ్ము కల్పింపగా
నుద్యోగాత్ముడవై విశేష కృషితో నుప్పొంగి లక్ష్యమ్ములన్
వేద్యంబౌనటు జేసి సాగు మిరులన్ భేదించు సూర్యుండవై !
డా॥అయాచితం నటేశ్వరశర్మ
9440468557