అక్కడొక మైదానంలా కనిపిస్తుంది

ఇక్కడ ఒక ఇల్లుండాలి కదా!

ఏమైంది? ఆ ఇల్లు ..నా జీవితం.

అందమైన నా బాల్యం అంతా

అక్కడే గడిచింది..

అన్నీ మధుర స్మృతులే

ఆ ఇంటితో ఇరవై రెండేళ్ల అనుబంధం మరి..

ఇంటిముందు ఉన్న జామ చెట్టు
నీడనే కాదు తీయని పళ్ళను కూడా ఇచ్చేది

ఆ ఇంటి అరుగులతో ఎన్నెన్నో జ్ఞాపకాలు

ఊరికి చివరన ఇల్లు ఉండడం తో

ఆ అరుగులు ఎప్పుడూ పొలాలకు

ఆ అరుగులు ఎప్పుడూ పొలాలకు

స్నేహితులతో ఆడే అష్టాచెమ్మా, పులి మేక

గచ్చకాయలు, పచ్చిసూ,కైలాసం

అన్ని వాటి మీదే..

ఇక సాయంత్రాలు చదువుకోవడం,

హోంవర్క్లు, ఇంటిముందు పూసే

కనకాంబరాలు, మల్లెలు, మూడు రంగుల

డిసెంబరు పూలు, దవనంతో

కలిపి మాలలు అల్లడం అన్నీ

ఆ ఇంటి అరుగుల మీదనే

నాకింకా జ్ఞాపకం ప్రతి గురువారం

ఊళ్లో జరిగే సంతకు చుట్టుపక్కల

ఊర్ల నుండి వచ్చే వారందరికి

ఆ ఇంటి అరుగులే సేద దేర్చేవి.

ఆ ఇంటి అరుగుల పైనే కూర్చుని

వాళ్ళు తెచ్చుకున్న సద్ది తిని

నీళ్ళు ఇప్పించుకుని తాగి వెళ్తుండే వారు..

కొందరు సద్ది లేకుండానే వచ్చే వారు

వాళ్లకు అమ్మ అన్నం, రొట్టెలు, కూరలు పెట్టేది..

ఎంతమందికని అలా పెడతావు అమ్మా !

మనకు కూడా కావాలి కదా అనే వాళ్ళము మేము..

పోనీలే తల్లీ, పాపం ఎండన పడి వెళ్తున్నారు

మీకు మళ్లీ చేసి పెడ్తాలే అనేది..

నాన్న కూడా ఏమీ అనేవాడు కాదు

వారానికి ఒక్కరోజే కదా!

పోనీలే అమ్మా అనేవాడు.

వాళ్ళు తిని, నీళ్లు తాగి వెళ్తూ వెళ్తూ

మాకు దివెనలిచ్చి వెళ్తుంటే

కలిగే ఆనందం కోసమేనేమో మేము

ఐదుగురం నేను ఇస్తా అంటే నేను ఇస్తా

అని చిన్నగా గొడవలు కూడా పడేవాళ్ళము.

ఉదయం నుండి సాయంత్రం దాకా

డ్రమ్ముల కొద్ది నీళ్ళతో వచ్చి పోయే వారి

దాహాన్ని తీర్చడం ఏదో తెలియని

ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చేది.

ఆదివారాలు, సెలవు రోజులు వస్తే చాలు

సాయంత్రాలు ఆ అరుగులపై

కూర్చునే అమ్మ మాకందరికీ

వరుసగా చక్కగా నూనె రాసి…

రెండు జడలు వేసి పూలు పెట్టేది.

ఇప్పుడా ఇల్లు లేదు.. అరుగులు లేవు….

మా గుండెల్లో జ్ఞాపకాల రూపంలో కదలాడుతూ..

అప్పుడప్పుడు కంటినీరై కనిపిస్తుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com