నాటి సమాజంలో వివక్షను చెప్పిన కథ…

-జి. సురమౌళి

“ఏమోయ్ మల్లయ్యా! పట్నం బోయినవేమో? ఎప్పుడస్తివి? ఏమేం జూసచ్చినవు? మీ సబలెట్ల జరిగె గింత జెప్పవ్?” పనిదీరి కూకున్న పటేలు మల్లయ్య నడిగిండు.

“ఏం జెప్పమంటవ్ పటేలయా, మా పెద్ద సబ జెప్పింరు! అబ్బ ఏం జనం ఏం జనం ! ఓ పెద్ద తీరుతమోలె ఉన్నదనుకో”

“ఎంత సేపాయె నువ్వచ్చి, బుక్కెడంత సల్లపడె వత్తన్నావా.”

“ఇంటికోయి సల్లపడే వత్తాన్న బుక్కెడు. గింతగ్గిపుల్లుంటిత్తారు సుట్టేసుకుంట”

పటేలయ్య అగ్గిపుల్ల యియ్యంగనే సుట్టమీద అగ్గి పెట్టుకొని. మోకాల్లకు రుమాలు జుట్టుక కచ్చీర్ల కూకున్న మల్లయ్య సుట్టదాక్కుంట చెప్పుతాండు. తాను పట్నంల జూసివచ్చిన పెద్ద సబ సంగతి.

“నాలుగు రోజుల ముందుగనే నేనీ ఊల్లకెల్లి ఎల్లిపోయిన్నా ? నా అసుంటోల్లు -ఓ యాభైమందచ్చిండు….. మేమందరం గలిసో రెండెకరాల మైదానం సాపుజేసుట దలిగినం. అన్లున్న మున్లు పల్లేరుగాయలు ఏరి. గడ్డి జెక్కి ఊడ్చి ఆ మైదాన్ల ఓ పెద్ద పందిరేసినం.

పెద్ద పెద్ద బొమ్మలు పటాలు పరదాలు గట్టి సర్లమోలిగి జేసినమా మైదానాన్ని అంతకు ముందాడ పందులు మేసేటియి. పందిర్లేసిన మోలె బంగలాల్లగూడ అంత సుకముందదనిపించింది. సర్గమే అనుకో. రాత్రనక పగలనక, యాల్లపూట నిద్దర్లేక యాలక్కూడులేక పనిజేతే రేపు సబనంగ అన్ని తయారైపోయినయి. ఆనాడు మాత్రం కంటికి కూరుకు రానిచ్చిందా? ఆగుల పంటుర్కి పర్రెల్దీయ మనిరి. ఎండాకాలమాయె. అచ్చెటోల్లందరికి నీల్లెట? ఇంజనపెట్టి పంపుల్లోని పలెల్లనుంచి పాకల్లకు నీల్లు దెస్తిమి. ఇగ సబ నాడు ఆ పందిట్ల కూకుండి ఆల్లు జెప్పే మంచిమాటలేమన్న ఇందామంటే సాగనిచ్చింరా ? అచ్చిన పెద్ద పెద్ద దొరలు ఆ నల్లలకెల్లి పంపుల్లచ్చిన ఉడుకునీల్లు దాగెటోల్లు గాకపోయిరి. పెద్ద పెద్ద కడవలు దెచ్చి నీల్లు నింపి పెట్టినం. ఓ నూరు కొత్త కడవలు నింపుదుం రోజు తెల్లరంగనె. ఇగ సబ మొదలయితదనంగ మాత్రం మమ్ముల్నందర్ని పనిడిసి పెట్టి అల్లతోని ఊరవలిదాంక మేమూ ఊల్లున్నోల్లు, అందరం గలిసిపోయినం. అయిన పేరేందో ఆ పెద్ద దొరచ్చిండు. ఆనాడు మన కచ్చీర్ల కాయిదం గొట్టలే? ఆ కాయిదంల ఉన్న దొర. ఆయన్ని పందిట్ల దాంక పందిట్లదాంక “జై” “జై” అనుకుంట దెచ్చినం. పందిట్ల కాయినె అడుగు పెట్టంగనే మమ్ములను దొలుకొని అంటకాడికి దిసుకపోయిరి. ఆడ నీళ్లు నింపుడు, ఇత్తార్లేసుడు. ఊడ్చుడు. దీంతోనే సరిపాయె. ఒక్కమాట సబల జెప్పిందింటె ఒట్టు. రోజు ఎంతమంది తింటాండిరో ఏమొ? అంతమంది యాడ్నుంచి అచ్చింరో ఎమో? , ఒక్కొక్క బంతికి మున్నూరుమంది దాంక లేత్తాండిరి. అసుంటియు పూటకు ఇరువయి బంతుల్లో సెటియి. బంతికి కూకుండగనే ఇతార్లేసుడు. ఆల్లందరికి నీల్లువోసుడు, అల్లు లేవంగనే ఆ ఇత్తార్లు దీసుడు. మల్లా ఇంకొగబంతి. ఇట్ల యిరువయి బంతుల్లేసెటాల్లకు పొద్దంగు. మేం బుక్కెడు దిని లేస్తుం, సుట్ట ఓ బుక్కు దాగుదుమొ లేదా మల్ల మొదటి బంతోల్లు ఇంకో

పూటకు తయారవుదురు. ఇగెప్పుడు దీరాలె, అందరు రెండుపూటలు తినెటాల్లకు నాత్తిరి రెండు జాములౌ. ఇట్ల సబ జరిగిన మూడు రోజులు పెద్ద పెద దొరలచ్చి మంచి మంచి మాటలు జెప్పుతాంరనేగాని, ఒక్క మాటిన్న పాపాన పోలేదు. అన్నందుకు ఆకరునాడు. అదేం సబనో రెండు జాముల్నాత్తిరికి మొదలు పెట్టింరు. ఆ నాత్తిరి వొదామన్నా పందిట్లకు పోనియ్యకపోయిరి. కట్టెపట్టుకొని ఎవడో లోపలకు పోయె పోరగాడు అడ్డగిచ్చె, లోపలికెల్లి ఎవరో ఉరికచ్చి నన్నాడజూసి బల్ల మీద జంపుకానాలు దులుపాల్నని, నన్ను దోలుకపాయె. న్యాలమొ అన్యాలమొ, జంపుకానాలు దులుపవోయినోన్ని ఇగాన్నే కూకున్న. మొట్టమొదటు ఎవలో ఒకాయినె కన్లకద్దాలు బెట్టుకున్నడు, హరిదాసోలిగే శెల్లాగప్పుకున్నడు: లేసి పుత్తకాలు రాసెటోల్లకని ఏమేమొ జెప్పిండు. పుత్తకాలల్ల దరిద్రుల కతలుండాల్నట. ఎవడు జదువతడు పటేలా ? మరి మాకేమొ సదువే రాకపోయె. సదువచ్చినోల్లెమొ దరిద్రులెగాకపోయిరి. అయినాయినె, పుత్తకాలు రా సెటోల్లకు చెప్పిండు. ఇని ఆల్లు సప్పట్లుగొట్టింరు. నడుమనాకెందుకు, ఆ మాటజెప్పి అయినె గూకుండగనే ఇగ పాటలు జదువుడు మొదలు పెట్టింరు. సుక్కవొడిసెందాంకా దెగలేదు. ఒక్కొక్కలేరా వత్తరు. ఒకటో రెండో పాటలొ పదాలొ జదువుతరు. దిగుతరు. దిగినోడు మల్ల ఎక్కడు. ఇట్ల తెల్లారగట్లదాక జదివినోడు మల్ల జదువకుండ జదివింరె పాటలు, నాత్తిరాయె ఏం పనిలేకపాయెనని పోయికూకున్న తపుల, తాలం ఆర్మొని, మద్దెల, ఏది లేకుండగనె జదువుతాంరు. ఒగలో రాగంల జదివితే ఇంకోలింకో రాగంల జదివిరి. అయ్యన్ని ఆల్లు గట్టిన కయిత్తాలట. అయితే రాగం లేకుండ జదువాన్నా ? మనూరు పొట్టిలింగడు కయిత్తం గడితె ఏం కమ్మగ జదువుతడు. తాళం లేకపోతే మానాయె. చేతులున్నయిగదా ? చప్పట్లు గొడితే అరిగిపోతాయి? పాటలంతా అయిపోయినాంక అందరు గొడ్తరేమొ చప్పట్లు ? తాలం గలిసెటట్లు ఆల్లకు గొట్టరాదా?” ఎరుకలేని మల్లయ్య పటేలయ్యకేమన్న ఎరుకనేమొ అని అడిగిండు.

“కాదోయి పిచ్చిమల్లయ్య. అంతయిపోయినమాలిగె చప్పట్లు గొడితె, ఆల్లు చదివింది మంచిగున్నదన్నట్లు” పట్నం పోయిన మల్లయ్యకు తెలువజెప్పిండు పల్లెటూరి పటేలు. “గట్లనా. మరె అన్నిటికి గట్లనె కొట్టింరు. అన్ని మంచిగున్నయనేనా ? ఏమొ అల్లుగొట్టిన కొద్ది నేను గొట్టిన. దొమ్మరాట జూడంగ గొట్టినట్లు, తెల్లారగట్లదాక అట్లనే పాటలినుకుంటగూకున్న. ఇగ తెల్లారినమోలె అందరు ఎల్లపోతాంరు. అందరికి బిస్తర్లు కట్టాలె. ఆల్ల బిస్తర్లన్ని లారీలల్లనింపి ఆల్లందరిని రేసనకు సాగదొలెదాంక నిద్దురవోలె. ఆల్లందరెల్లిపోంగనే ఆనాడు నాత్తిరి దాక పందిల్లిచ్చుట్ల బెట్టింరు. ఒక్కపూటల అంత ఇచ్చపెట్టినం. నాలుగు రోజులు కట్టపడి తయారుచేసిన పందిరి ఇచ్చుడుకుదప్ప మాకెందుకక్కరి కచ్చినట్టు..? మల్లయ్యడిగిన ఈ పెద్ద ప్రశ్న. వేడుక బొమ్మరిండ్లసుకలో బాగొప్ప నిర్మించి” పటేలయ్య నీ పద్దెం జదివెటట్టు జేసింది. “ఏదో మనకోసం రజాకారోల్లను ఎదుర్కొని రాజం సంపాయించి పెట్టి సబలు జేసుకుంటున్న పెద్ద పెద్దగ సదువుకున్నోల్లకు మే చేయగలినంత రెక్కలకట్టం జేత్తనే ఉన్నం. పనంత అయిపోయినమోలె నాలుగు జొన్న రొట్టెలు సద్దిగటిచ్చి సాగదోలింరు. ?” మల్లయ్య చెప్పిన సబ సంగతి పటేలయ్య బాగానే ఇన్నడు. కాని పటేలయ్య యినాలనుకున్నది, సబల జెప్పిన మాటల సంగతి. అది మల్లయ్య కేమెరుక ? ఇంతలకె “ఏం వంతులుగారూ? అంతా బాగేనా ?” అనుకుంటచ్చిండు ఆ వూరి ఎంకయ్య అయ్యో అయ్యోరెంకయ్యగూడ సబ జూడ వోయిండు పట్నం. మల్లయ్యంత ముందగపోలేదుగాని, మల్లయ్యకంటే ముందుగనే వచ్చిండు. “ఎంకయ్య పంతులటి ఇయ్యాలీపు మాటే బంగారమై పోయింది. మల్లయ్యా, పట్నాలకు పోతాండు సబలల్ల దిరుగుతాండు. మన సంగతి మరిచిపోతాండు.” పటేలయ్య తాను ఎంకయ్యపంతులు కిచ్చిన దానాలన్ని యాదికచ్చెటట్టన్నడు “ మీరు గూడా అలాగే అంటెట్ల పటేలుగారూ? మీ నీడన్నే మేం బతుకులు వెళ్ళబోసుకుంటు ఉంటిమి. మీరేంది మల్లయ్య ఏంది . మీరందరి క్షేమము మా బతుకు, మిమ్ములను మరిచిపోతే ఎట్ల ?” నక్కవినయం జూపిచ్చుకుంటున్నడు అయ్యోరు. “ఏదో అట్లన్నగని, పట్నం సబకు వోతివి సంగతులు జెప్పవు. మల్లయ్య నడుగుతె ఇంతసేపు ఏమేమో జెప్పిండు. ఆల్లు చెప్పిన మాటలు ఒక్కటి జెప్పలేదు.” కోరికదీరని పటేలు ఎంకయ్య నడిగిండీమాటు.

_ “ఐతే అయ్యగారూ మీరుగూడచ్చినారుంన్రి సబలకు ?” ఊరోడు వచ్చి కలువకుంట పోతడా అనుకునే మల్లయ్య అడిగిండు. * ఆ ఆ నిన్నుగూడ జూచిన, నువ్వు నాకు మా కనుపడ్డవు. నువ్వే నన్ను జూళ్లేదు.” అయ్యగారు మల్లయ్యమీదనే తప్పంత మోపాల్నని జూసిండు. “నేను సూడకుంటే సూడకపోతి. సూసినోల్లు మీరన్న పిలుత్తే మాట్లాడకపోదునా?” మల్లయ్యడిగిన సవాలుకు అయ్యోరెంకయ్య దగ్గర జవాబులేదు. అయ్యో రెంకయ్య పాపం పట్నంల మల్లయ్యను మాట్లాడియ్యాలని మా అనుకున్నడు. కాని తన చుట్టున్న సోపతిగాన్లు నల్లబట్టలతోనున్న మల్లయ్యతోని మాట్లాడుతాంటే జూసి నవ్వుతరేమొ ననిపిచ్చి ఊరుకున్నడు. ఆ సంగతి మల్లయ్యకు కొంత అనుమానమే అయింది. తనను తనూరి ఎంకయ్యనే చిన్నచూపు జూసిండనుకునెటాల్లకు మల్లయ్యకాడుండ బుద్ధిగాలె. పొద్దంగుతుంది. మల్లయ్యకు ఇంట్ల నాగండ్లు గట్ట జూసుకోవాలె. ఈడుంటే ఇగ ఎంకయ్య చెప్పే సంగతి ఇనాలె. పట్నం వేటికోసం బోయిండో ఆ సబల సంగతే. ఆడికిబోయినా అందని సబలసంగతి మల్లయ్యకీడెందుకు? మల్లయ్య ఆన్నుంచెల్లిపోయిండు. పొద్దు అంగుతుంది. తల్లి కడపులకు ఎఱ్ఱవడుకుంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com