మహాత్ముల అడుగు జాడల్లో

నడుస్తున్న వాణ్ణి

మాన వత్వాన్ని గుండెల్లో వెలిగిస్తున్న వాణ్ణి

గతాన్ని ఆకలించుకొని

వర్తమానంలో సాగిపోతున్నవాణ్ణి

25 కి పైగా కావ్యాలు, నాటి భారతి నుండి నేటి మూసి వరకు వివిధ పత్రికలలో వేయికి పైగా విమర్శా వ్యాసాలు, 2 వేలకు పైగా వివిధ గ్రంథాలకు పీఠికలు, పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా పత్రాలు..ఇంకా ఇంకా ఎన్నో. ఇవన్నీ సుప్రసిద్ధ సాహితీ వేత్త, అగ్రశ్రేణి విమర్శకులు, గొప్ప వక్త, కవి, పండితులు, మూడు తరాల సాహితీవారధి శ్రీ తిరునగరి రామానుజయ్య గారి కృషికి నిదర్శనాలు. వీటికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 దాశరథీ పురస్కారంతో వీరిని గౌరవించింది. ఈ సందర్భంగా ‘తిరునగరి’ గా ప్రసిద్ధి చెందిన శ్రీ తిరునగరి రామానుజయ్య గారితో తంగేడు ముఖాముఖి…

నమస్కారం సర్..

ముందుగా 2020 దాశరథీ పురస్కారాన్ని అందుకున్న మీకు తంగేడు సాహిత్య పక్ష పత్రిక తరపున అభినందనలు.

తిరునగరి: ధన్యవాదములు

ప్రశ్న: మీ జననం, బాల్యం విద్యాభ్యాసం గురించి మా పాఠకులకు వివరించగలరు.

తిరునగరి: మాది ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేషంపేట గ్రామం. 24-09-1945 న జన్మించాను. శ్రీమతి జానకీ రామక్క, మనోహర్ గారు మా తల్లిదండ్రులు. మాది చాత్తదశ్రీ వైష్ణవ సాంప్రదాయం. మా నాన్న గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. నా తొలి గురువు మా నాన్న గారే. వారి దగ్గరే సుమతి శతకం నుండి ‘అమరం’ వరకు నేర్చుకున్నాను. మా నాన్న గారే భాగవతం లోని ప్రముఖ ఘట్టాలన్నీ కంఠస్థం చేయించారు. మా అమ్మ గారు కూడా సంప్రదాయ కీర్తనలు, తిరుప్పావై పాశురాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా పాడేవారు. అవన్నీ నాకు కూడా వచ్చేవి. వీటితో పాటు బాల రామాయణం, పంచ కావ్యాలు అన్నీ నాన్నగారే చదివించారు. తుర్కపల్లి, భువనగిరి లలో H.S.C చదివి, హైదరాబాదులో ఓరియంటల్ డప్లమా ఉత్తీర్ణునయ్యాను. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే B.O.L, M.O.L పూర్తి చేసాను.

ప్రశ్న: మీ ఉద్యోగ జీవితం గూర్చి వివరించండి.

జవాబు: 1965 లో అప్పటి రంగారెడ్డి జిల్లా దేవర యాంజల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాను. 36 సం.ల పాటు, తెలుగు పండితునిగా, జూనియర్ లెక్చరర్‌గా పనిచేసి 1999 లో పదవీ విరమణ చేశాను.

ప్రశ్న: మరింత గొప్ప ‌కవిగా, వక్తగా, విమర్శకులుగా పరిణితి చెందడానికి ప్రేరణగా ఎవరెవరిని చెబుతారు.

జవాబు: ముందుగా మా నాన్న గారే నాకు తొలి గురువు. మా నాన్న గారు మనోహరయ్య గారే నాకు సాహితీ పరిచయాన్ని కూడా చేశారు. ఆ తర్వాత నా తెలుగు ఉపాధ్యాయులు, స్వర్గీయ తోట రామదాసు గారు నా పద్య రచనను ప్రోత్సహించి దారిలో పెట్టారు. ఆ తర్వాత దాశరథి గారు నన్ను కవిలా ఎదిగేలా చేశారు.

ప్రశ్న: ఒక పద్య, గేయకవికి ఉండాల్సిన లక్షణాలు మీ దృష్టిలో…?

జవాబు: ప్రాచీన కవిత్వాన్ని క్షుణ్ణంగా చదవాలి. నన్నయ, పాలకుర్తి, తిక్కన, శ్రీనాథులది ఒక రకమైన శైలి. ఆ తర్వాత వచ్చిన ప్రబంధ ములతో రస ప్రపూర్ణమైన కవిత్వం వచ్చింది. వీటిని బాగా చదివినపుడే ఒక కవిత్వం అది పద్యమైనా, గేయమైనా ఇంకా ఏదైనా ఎలా ఉండాలి అన్న ఒక అవగాహన మనకు వస్తుంది. తనదైన శైలిని, ముద్రను ఏర్పరచుకోవడం కవికి అవసరం.

ప్రశ్న: మీకు పేరు తెచ్చిన ‘తిరునగరీయం’ కు ప్రేరణ, ఉద్దేశ్యం ఏమిటి..?

జవాబు: ఆధునిక సమాజంలోని‌ జీవితాన్ని వ్యంగ్యంగా, వక్రోత్తితో సందేశాత్మకంగా చెప్పాలనే ఉద్దేశ్యంతో ‘తిరునగరీయం’ ప్రారంభించాను. కొంత సమ్మితంగా కవిత్వం ఉండాలి ‌కాబట్టి, ఎవరినీ‌ నొప్పించకుండా కఠినమైన శబ్దజాలమేది లేకుండా రాశాను, రాస్తున్నాను. ఇప్పటికీ 4 భాగాలు వచ్చాయి. ప్రస్తుతం 5 వ భాగం వ్రాస్తున్నాను. సమాజమే దీనికి ప్రేరణ. అందుకే స్వర్గీయ సినారె గారు ఒక చోట “తిరునగరీయం సమాజాన్ని విశ్లేషిస్తూ వచ్చిన ఎక్స్-రే లాంటి పద్య కావ్యం అన్నారు.

పొలముదున్నువాడు పూజ్యుడు జాతికి

బురద మేనుచూచి పోకు తొలగి

బురద చేతికంట పెరుగు నోటికందు

తిరునగరిది మాట తిరుగు లేదుఇలా బురద అంటిన ఒక రైతును చూచి బస్సులో అసహ్యించుకొన్న ఒక వ్యక్తి ని చూచి spontaneous గా రాసిన ఆట వెలది పద్యము అక్కడి నుండి ఈ తిరునగరీయం ప్రారంభమైంది. ఇటువంటి సామాజికాంశాలను స్మృశిస్తూ, కృత్రిమమైన నాగరికత వద్దని, మన జీవన మూల్యాలను కాపాడుకోవాలనే లక్ష్యం తోనే ఇప్పటికి కూడా ఈ తిరునగరీయాన్ని కొనసాగిస్తున్నాను.

ప్రశ్న: వెయ్యికి పైగా సాహిత్య విమర్శా వ్యాసాలు రాసారు కదా. నేటి సాహిత్య విమర్శ దిశ, దశ ఎలా ఉంది. ఈ 50 ఏళ్ళలో మీరు ఏం గమనించారు.

జవాబు: సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం సమాజాన్ని సంస్కరించటమే. తిమిరంతో సమరం చేసే వారిని మనం మెచ్చుకోవాలి. చీకట్లోకి దీపాన్ని తీసుకురావడం లాంటిదే ఈ విమర్శ. విమర్శకుడు సహృదయుడై ఉండాలి. విమర్శకునికి ఒక గ్రంథాన్ని చదివేప్పుడు పవిత్రమైన ఆలోచన ఉండాలి. నా 50 ఏళ్ల సాహిత్య విమర్శలో ఎక్కువగా ఇష్టపడేది రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారిని. కావ్యంలోని మంచి చెడులను సమదృష్టితో వివేచించడం వారి లక్షణం. నేను కూడా ఆ మార్గంలోనే వెల్తున్నాను. ఒక గ్రంథానికి విమర్శ రాసేటప్పుడు ఏ కోణంలో రాస్తే సమాజానికి బలమొస్తుంది, మేలు‌ జరుగుతుందో ఆలోచించాలి. ఇప్పుడొస్తున్న విమర్శలో ముందే ఒక కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. అందరూ కాదు, కొందరు. కుందుర్తి గారు చెప్పినట్టు “మనకున్న విమర్శా దీపము చిన్నది”. ఇది నిజం. ఇప్పటికీ అలాగే ఉంది. విమయ ఇంకా బలీయం కావాలి. పారదర్శకత ఉండాలి. సమదృష్టి ఉండాలి. కవిత్వం వచ్చినట్టుగా విమర్శ ఇంకా రావడం లేదు. విమర్శకులు ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. మూలాలను కదిలించాలి. ప్రామాణికత సంతరించుకున్నదే మంచి విమర్శ అని నా అభిప్రాయం.

ప్రశ్న: కవిత్వం, గేయం, విమర్శ, వ్యాఖ్యనం, వీటన్నిటిలో మీకు బాగా ఇష్టమైనది ఏది..?

జవాబు: నేను ముందుగా కవిని. అందుకే కవిత్వమే నాకు అత్యంత ఇష్టం. ఆ తర్వాత ఇష్టమైనది సాహిత్య విమర్శ.

ప్రశ్న: ఈ 50 ఏళ్ల సాహిత్య జీవితంలో ఎన్నో ఉద్యమాలు చూశారు. మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉద్యమం, లేదా మిమ్మల్ని ఆకర్షించిన కవిత, ఉద్యమం ఏదైనా ఉందా..?

జవాబు: నేను భావ కవిత్వ ఉద్యమం వచ్చే నాటికే కవిగా ఎదిగాను. నన్ను మూడు తరాల వారధిగా కొందరంటారు. ఇది నిజమే. విశ్వనాథ నుండి నేటి కవుల వరకు అందరి‌ కవిత్వాన్ని పరిశీలిస్తున్న వాణ్ణే. ఎన్ని‌ ఉద్యమాలు వచ్చినా భావ కవిత్వం నుండే అభ్యుదయ కవిత్వం వచ్చింది. భావ కవిత్వాన్నే నేను చాలా ఇష్టపడుతాను. భావ కవిత్వం అనగానే కృష్ణ శాస్త్రి గారు గుర్తిస్తారు. ఆయన చెప్పిన ప్రతి విషయంలో ఒక నవ్యత ఉంది. ఆకులో, పూవులో, రెమ్మలో ప్రతి చోట కవిత్వం చూసినాడు. ప్రకృతి లోని ప్రతి విషయాన్ని అందంగా కవిత్వీకరించారు కృష్ణశాస్త్రి. జానపద జీవితంలోని రమ్యతను కూడా భావకవి చూశాడు. భావకవులలో నుండే అభ్యుదయ కవులు వచ్చారు. అందుకే సాహితీపరంగా ఙావ కవిత్వ ఉద్యమమే గొప్పదిగా భావిస్తాను. అదే నాకు ఇష్టం కూడా. భావ కవిత్వం తర్వాత అసలు కవిత్వ స్థాయి పలుచబడి పోయిందని‌ నా అభిప్రాయం. భావకవిత్వోద్యమం సౌందర్యం వైపు కవులను ‌నడిపించింది. సందేశం వైపు నడిపించింది.

దాశరథి అవార్డ్ తీసుకున్న సందర్భంగా మీ అనుభూతి?

నేను 1996లో మొదటి సారి దాశరథిని కలిశాను. నా రచనలు చదివి ఆయన “అలాగే రాస్తుండు.శైలి బాగుంది. ప్రాచీన ఆధునిక రచనలు చదువుతుండు” అని ప్రోత్సహించారు. ఆయన నన్ను తమ్మునిగా చూశారు. గంగాఘరి ప్రవాహ సదృశంగా వీడు మాట్లాడుతాడు అనేవారు. నిజాం బాద్ జైలు జీవితం లాంటి అనుభవాలు, అనుభూతులు చెప్పేవారు. ఈ అవార్డు తీసుకోవడం జీవితంలో సాధించిన గొప్ప విజయం అనుకొంటాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com