ఏగిలివారంగ కోడి కూత అమ్మకు ” అజా “

సెంట్రల్ జైలు లాంటి ఇంటికి పెద్దర్వాజ …చైనా గోడలా …

తెరిసేప్పుడు …నాకునోరుందని

కర్రుమని ధిక్కార స్వరం …

మసక చీకట్లో …నిద్రలో నడిచినట్టుగా

బావి దగ్గరకు అమ్మ …

కాబూలీ వాలా లాగా

బొక్కెనతో అప్పు రాబట్టుకోవడం ..

బాధా సర్పద్రష్ట బావి …

నీటిచెల్లింపులతో ఏళ్లకేళ్లు …

నిత్య నైవేద్యం చేసినా …

పిసరంతైనా తరగని బావి అప్పు …

కిర్రుమంటున్న బావి గిరక సాచ్చిగా ( సాక్షి )

తోడి ..తోడి …అమ్మ …రెక్కలు

“ఫ్రీవీలు ” పోయిన సైకిలు పెడల్ లా .. ..

బావి ఎప్పట్లాగే …తీరని ఆప్పుతో నిండుచూలాలుగా …పురిటినొప్పులతో …

పసులు పొలంబాట పట్టకముందే…

అరెకరం వాకిలికి అలుకు అలంకారం …

ఎర్రమన్ను పూసుడుతో …

కడుపుల పేగులు నోట్లోకి …

కట్టెల పొయ్యితో కుస్తి నిత్య కృత్యంకాగా..

పొగవాసనతోమమేకమైన ఛా @ ఛాయ …

మా కడుపుల్లోకి సెలైన్ ఎక్కించినట్లు…

చెమటనీళ్లతోపాటు …తనకూ గిన్నె కడిగిన నీళ్ల లాంటి రంగునీళ్లు ..మహా భాగ్యంగా

పోద్దటికి … పగటికని జాయింటుగా …

వండిన అడ్డెడు బువ్వ …

తలా ఇంత పంచంగ …

మిగిలిన శేషం …. మాడుచెక్కలు…

నీళ్లల్ల ముంచుక తిననిక …

మాపటిజాము …పీకలదాకా తాగి …

అయినదానికీ కానిదానికీ శివతాండవం చేసే …”బాపు ” కు మౌన ప్రేక్షకురాలు

ఏడవడానికి సొతంత్రంలేని అస్వతంత్ర ప్రాణి

పవళింపు సేవ అయ్యేసరికి …

తాను బద్దలయ్యే అగ్నిపర్వతమైనా …

మంచు పర్వతమంత చల్లగా …

పెద్ద దర్వాజా బందు అయినాక …

ఆకాశాన్నంటే బాపు గుర్రులో ..

అమ్మ కన్నీళ్లు …వెక్కిళ్ల..కాక్ టైల్

అర్ధరాత్రి ఆజాద్ వచ్చినట్టు …

తుఫానులో పిచ్చుక స్వరంలా …

అమ్మ ….

జీతం బత్తెంలేని …కట్టు బానిస..

ఆకలి ..రుచి తెలియని మానవ యంత్రం ..

ప్రేమకు …

ఆనందానికి …

సంతోషానికి …

నోచుకోని అనాధ …

సంసార

సుడిగుండంలో …

చిక్కుకున్న ఒంటరి పడవ …

అన్నీ ఉండి …

అందరూ ఉండి …

ఏమీ లేని అనాధ …

అమ్మ …అందరికొరకైనా …

అందరం …. ఎవరికివారే యమునా తీరే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com