తెలంగాణ ప్రభుత్వం ప్రతిభావంతులైన కవులకు దాశరధి ,కాళోజి ,అవార్డ్ లను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే .ఈ సంవత్సరం కాళోజి అవార్డు కు ఎన్నికైన కవి రామాచంద్రమౌళి . రామాచంద్రమౌళి శ్రీ కనకయ్య శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులకు 1948 సంవత్సరం లో జన్మించారు.విశేష మేమిటంటే ఆయన ఇంజనీరింగ్ పట్టబద్రుడు.
కవిగా విమర్శకులుగా ,నవలాకారులుగా, కథకుడు గా నాటక కర్త గా అనువాదకుడు గా బహుముఖ ప్రఙ్ఞాశాలి రామాచంద్రమౌళి .ఒక సాహితీ వేత్తగా గ బహుముఖం గా కొనసాగుతూనే ఇంజనీరింగ్ పాఠ
పుస్తకాలు రచించారు .అంతర్జాతీయ సాహిత్య సదస్సులలో పాల్గొన్నారు .జాతీయ స్థాయిలో ఆయన పాల్గొన్న సాహిత్య సదస్సు లు అసంఖ్యాకం .
నాజినామన్ సాహిత్య అవార్డ్ ,అంతర్జాతీయ జీవిత సాఫల్య పురస్కారం ,అవత్స సోమసుందర్ కవితా పురస్కారం ,గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం ,లాంటి అవార్డులు ఆయన గెలుచుకొన్న వాటిలో కొన్ని మాత్రమె .బొమ్మరిల్లు ,డబ్బు డబ్బు ,కులాల కురుక్షేత్రం ,గూటిలోని రామచిలకలు ,జేగంటలు మొదలైన సినిమాలకు కథ మాటలు సమకూర్చారు .ఆయన రాసిన ముప్పై రెండు నవలల్లో ,శాప గ్రస్తులు చూరు నీళ్ళు ,ప్రవాహం ,శాంతి వనం, తెలిసి చేసిన తప్పు ,అనే నవలలు పెర్కొదగినవి .
వివిధ సంకలనాలలో ప్రచురించబడ్డ ఆయన మూడు వందల నలభయ్ ఆరు కథలలో స్పూర్తి ప్రదాతలు ,పొగమంచు ,ఒకసారి మరణం ,కాలనాళిక లాంటివి పేర్కొనదగినవి . అట్లాగే దీప శిఖ, శిలలు వికసిస్తున్నాయ్ ,స్మృతి ధార , ఎటు ఆయన ప్రచురించిన కవితా సంపుటులలో కొన్ని. ఆయన విస్తారమైన సాహితీ సేవకు పులకరించిన తెలంగాణా ముఖ్యమంత్రి రామాచంద్రమౌళి కాళోజి అవార్డ్ కు సంపూర్ణంగా అర్హులు అని ప్రశంసించారు. ఆయన లోపలి ఖాళీ అనే కథలో ఆయనే చెప్పినట్టు ఒకవ్యక్తి హృదయం లోపలి మరోవ్యక్తి అత్మీయునిగా ప్రవేశం పొందాలంటే ఆ హృదయం లో నిజమైన ప్రేమ ,చోటు ఖాళీ ఉండాలి అంటూ విశ్వ మానవునికి ఉండాల్సిన వైశాల్యత గురించి వాపోతారు .ఇలాంటి వైశాల్యత ,కవితా ప్రతిభ ఆయనకు ప్రతిష్టాత్మకమైన కాళోజి అవార్డును తెచ్చి పెట్టింది .
రామాచంద్రమౌళి తనకు కాళోజి అవార్డ్ రావడం ఒకమరపు రాని అనుభూతి అంటారు .
ఆయన మరిన్ని సాహితీ శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటున్నది తంగేడు .
