ఆదిలాబాద్ భాషా సొగసుల ఆవిష్కరణ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు మాట్లాడుతున్న భాషలోని పదాలను సేకరించి, వాటికి అర్థాలను సమకూర్చి ఒక పదకోశాన్ని తయారు చేయడం కష్టసాధ్యం . చేపట్టిన పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చిన కూడా పూర్తి చేయకుండా ఉండలేరు ఉత్తములు. అట్లాంటి కోవకు చెందిన కవి, రచయిత, సాహితీ యాత్రికుడు మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మడిపల్లి భద్రయ్య.

జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వ్యావహారికలో గల పదాలను గుర్తించి రాసుకోవడం, అకారాధి క్రమంలో అమర్చుకోవడం, వాక్యానిర్మాణం చేయడం వంటివి చేసి, ప్రచురించి వెలికి తేవడానికి ఒక పుష్కర కాలం పట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యావహారిక భాషా పదకోశమును “మన భాష-మన యాస’ పేరుతో ప్రచురించి అందించడం సముచితమైనది. గతంలో ఆయన ఆదిలాబాద్ విశిష్టతను వివరించిన ‘మన ఆదిలాబాదు’ గ్రంథంను వెలువరించి ఈ జిల్లా ప్రాముఖ్యతను పరిచయం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్, ఖానాపూర్, జన్నారం, లడ్డెట్టిపేట, భైంసా, మంచిర్యాల,చెన్నూరు, బెల్లంపల్లి, ఆసీఫాబాద్, కాగజ్ నగర్, ఉట్నూరు, జైనూర్, నార్నూరు, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడలు కొన్ని ముఖ్యమైనవి. ఒక్కొక్క ప్రాంతంలో మాట్లాడే తీరు కూడా వేరువేరుగా ఉంటుంది. మైదాన ప్రాంతంలో తెలుగుపై హిందీ, ఉర్దూ, ఇంగ్లీషుల ప్రభావముంటే, ఏజెన్సీ ప్రాంతంలో గోండు, లంబాడి, మరాఠి, కొలామి భాషల పదాలతో తెలుగు పదాలు కలిసిపోయి ఉంటాయి.

ఉపాధ్యాయుడుగా, పధానోపాధ్యాయుడుగా భద్రయ్య గారు ఈ ప్రాంతాలలో చాలా చోట్ల పనిచేశారు. ఈ పదకోశ నిర్మాణానికి కవి మిత్రుల సహకారం, తనతో పని చేసిన సహ ఉపాధ్యాయుల చేయూత, తన దగ్గర చదువుకున్న విద్యార్థుల సహాయం ఆయనకు లభించింది.

భాష అనేది అనేక పదాల సమూహం . ఒక పదం యొక్క పుట్టుక, విస్తరణ, వాడుకల గూర్చి పరిశోధన చేయడం ఆసక్తికరమైనది. మానవ జీవతంలోని అనేక రంగాలను ప్రభావితం చేస్తుంది భాష, మానవుల మధ్యన ఉంటే సంబంధాల వినిమయం నుంచే పదజాలం పెరిగింది. ఒక ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే భాషకు ఇంకొక ప్రదేశంలో మాట్లాడే వారి మధ్యన తేడాలుంటాయి. వారి నిత్య వ్యావహారంలోని భాషల పదాలు భాష మీద చాలా ప్రభావం చూపుతాయి. పలుకుబడులు, జాతీయాలు, సామెతలు భాషలో సునాయాసంగా మనం మాట్లాడే భాషలో వచ్చి చేరుతుంటాయి. వాటిని మనం మాట్లాడే భాషలో ఉపయోగించడం వలన ఆ భాషా సౌందర్యం వికసిస్తుంది. అట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మాట్లాడే భాషలోని యాస పదాలను సేకరించి పదకోశంను నిర్మాణం చేయడమంటే భావితరాలకు బంగారు కానుకను అందించడం వంటిది.

‘ప్రజల నాలుకల పద సంపద’ అంటూ తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షులు నంధిని

సిధారెడ్డి రాసిన ముందు వాక్యంలో ఇలా అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఆదిలాబాద్ ప్రజల ఉచ్చారణ పదాల్లో వకారం లోపించి ప్రత్యేకంగా కనబడి ఆకర్షిస్తుంది. మిగతా తెలుగు ప్రాంతాల్లో ‘వక్కిపోయి’ అనే పదం, తెలంగాణ కొన్ని చోట్ల (మెదక్) ‘ఒ’త్వం వచ్చి వొక్కిపోయి’ అని వాడితే,

ఈ జిల్లాలో పకారం లోపించి ‘అక్కిపోయి’ అయింది. అట్లాంటిదే ఏడస్తది’. అంతటా ఏదవస్తది-ఏడువొస్తది అంటే ఇక్కడ మూడవ అక్షరం వకారం లోపిస్తుంది. ఏడవమంటే అదేవిధంగా ‘నువ్వుల పొడి’ మారి ‘నూలపొడి’ అయింది. ద్విత్వ లోపం, ద్విత్వ పూర్వాక్షరం దీర్ఘాక్షరంగా మారటం కన్పిస్తుంది. కాగా ఉర్దూ పదాలు తెలంగాణ భాషలో మిళితమై పోయాయి.

చాలా చోట్ల అకల్మంద్ అనే ప్రయోగం

ఉండగా, ద్విత్వం ప్రవేశించి ‘అక్కల మంద్ ‘పదం జిల్లాలో కనిపిస్తున్నది. మరాఠి ప్రభావంతో ‘చోళి’, ‘మక్క’ వంటి పదాలు వ్యవహారంలోకి వచ్చాయి. కర్ణాటక ప్రభావంతో తెలుగులో వాడుకలో ఉన్న ‘ఉప్మా’ ఇక్కడ ‘ఉక్మ’గా మారిపోయింది. హీనాతిహీనం’ అనే సంస్కృత ప్రయోగం స్థానికంగా ‘ఈనమీనం’ అయింది. మహాప్రాణలోపం, ‘అతి’లోపం ఇట్లా చాలా పదాలు ఎన్నో ప్రభావాల, పరిణామాల అనంతరం స్థానిక వ్యవహార సౌందర్యంతో తళతళలాడుతుంటాయి. ఖర్జూర పండ్లని ఆదిలాబాద్లో ‘ఉచ్చడి పండ్లు అంటారనే విషయం భద్రయ్య వల్లే తెలుస్తున్నది’

కేంద్ర సాహిత్య అకాడమి అనువాద అవార్డు గ్రహీత, తెలంగాణ పదకోశాన్ని రూపొందించిన బహు భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ గారు రాసిన ఆత్మీయమైన మాటలో ఆదిలాబాద్

ప్రాంత భాషపై తన అంతరంగపు మాటల్ని రాశారు. ‘భాషా పరంగా చూసినప్పుడు ఆదిలాబాదు జిల్లాకే పరిమితమైన కొన్ని ప్రత్యేక పదాలు మదిలో మెదులుతాయి. ‘జీపులో పోవడం కన్న బస్సులో వెళ్ళడమే నయం’అనే వాక్యంలో ఆదిలాబాద్ లో ‘జీబుల పోవుడు కన్న బస్సుల పోతనే పోపు’ అనే తీరుగా మారుతుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది. ‘పోపు’ అనే పదాన్ని. దీని కర్థం నయం, మేలు, మంచిది అని చెప్పుకుంటున్నాం. నిజానికి ‘పోపు’ అంటే ప్రొపు, ప్రోచు, బ్రోచు అనే క్రియ నుండి పుట్టినదే పోపు. అంటే రక్షణ అని అర్థం. ఆదిలాబాద్లో దుర్మార్గుణ్ణి ‘కడ్డు’ అంటారు. ఇది ‘కరుడు’ అనే మాట వర్ణసమీకరణం చెందగా ఏర్పడిన రూపం. ‘కరుడు’ అంటే గడ్డ కట్టిన రూపం. అంటే ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేని కరగని హృదయం కలవాడని అర్థం. ఇవే గాక ఆదిలాబాదు జిల్లా భాషపై మరాఠీ ప్రభావం కూడా ఆధికం. ఉర్దూ అసర్ ఎలాగు వుంటుంది. మరాఠీలోని ‘కసకాయ్’ అనే మాటకు అనువాదంగా ఎట్ల, ఏమిటి(ఎట్లేం) అని ప్రశ్నిస్తుంటారు. అట్లాగే తల్లిని ఆయి అనీ, భార్యను బాయి అని పిలుస్తారు. ఆదిలాబాదు జిల్లా భాషపై గిరిజనుల నుడుల ప్రభావము ఉంటుంది’.

ఆదిలాబాదు జిల్లా ప్రజల వ్యవహారిక భాషకున్న ప్రత్యేకతలను సునిశితంగా పరిశీలన చేసిన ఈ పద సంకలనం విశిష్టమైనది. ఇందులో చోటుచేసుకున్న పదాలన్ని కొన్ని వాడకంలో ఉన్నాయి. కొన్ని కనుమరుగై పోయినవి. సేకరించిన పదాలకు అర్థాలను రాస్తూనే, సందర్భాను సారమైన వాక్యాల్లో కూడా ప్రయోగించారు. కుదిరిచ్చుడు, గెద్ముడు, గోలిచ్చుడు, జప్పన, జమిలి, డక్కీ

మొక్కలు, తెలివికచ్చుడు, తిరంలేదు, ధూత్రి, దొబ్బుడు, దండెగొట్టుడు,

నీట్కం, న్యాలముచ్చోడు, బొక్కలు కలికలి అపుడు, బొంకియ్యడు, మాగిపొద్దు, మనాది, మన్ను వడ్డది, మాయలబడుడు, మీపట్టెకు, మూడింది, లేసికుసున్నడు, వరుసైనోళ్లు, సత్తెనాశనం, శనార్తి, శోకంబెట్టుడు వంటి పదివేలకు పైగా ఉన్న ఈ ప్రత్యేక ఆదిలాబాదు పదకోశం తెలంగాణ ప్రాంతంలోని యాస పదాలకు అర్థాలను తెల్పుతున్నది.

తెలంగాణ ప్రాంతంలోని కవిత్వంలోగాని, వ్యాసాల్లోగాని, కథల్లోగాని, నవలల్లోగాని వచ్చిన తెలువని పదాలకు ఈ పదకోశం ఒక ఆధారంగా నిలుస్తుంది. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి సోదరులు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణ రావు, సామల సదాశివ, పొట్లపల్లి రామారావు, పాకాల యశోదారెడ్డి, కాలువ మల్లయ్య, అన్నవరం దేవేందర్ వంటి కవుల, రచయితల రచనల్లోని మాండలిక పదాల అర్థాలను అవగాహన చేసుకోవడానికి ఈ పదకోశం దోహదపడుతుంది.

‘రః పదకోశం అక్షర క్రమంలో తీసుకుంటూ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాడుక లోనున్న పదాలకు సరియగు అర్థంతోపాటుగా ఒకటో రెండో వాక్యాలను ఆయా గ్రామీణ వాతావరణంలో మాట్లాడుకునే తీరునుదహరించడంతో జన బాహుళ్యానికి తొందరగా అర్థం కావాలనే తపనతో వ్రాయడం జరిగింది కాని ఎవ్వరినీ దీన్లో ఎక్కువ తక్కువ చేసే ఉద్దేశ్యం లేదని’ మడి పెల్లి భద్రయ్య గారు విన్న వించుకున్నారు.

ఈ పదకోశానికి కపిలవాయి లింగమూర్తి, ఆచార్య కసిరెడ్డి, నారాయణ, కూరెళ్ల విఠలాచార్య, బి. మురళీధర్,

పెండ్యాల కిషన్ శర్మ, కాచాపురం పాపేశ్వరశర్మ, ఎం.వి.పట్వర్దన్,

దామెర రాములు, అప్పాల చక్రధారిలు అందించిన ముందుమాటలు ఈ నిఘంటువు ప్రాధాన్యతను వివరిస్తు న్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని గ్రంథాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సీటిల్లోని తెలుగు విభాగాల్లో ఉండాల్సిన మంచి పుస్తకమిది. కవులు, రచయితల దగ్గర కూడా ఉండాల్సిన వ్యవహారిక భాషా పదకోశమిది. ఒక సంస్థ చేసే ఈ పనిని ఒక వ్యక్తిగా చేసి తెలంగాణ పద సంపదను బలోపేతం చేసిన భద్రయ్య గారి కృషికి ఏ అవార్డుతో సత్కారం చేసిన తక్కువే అనిపిస్తుంది. ఈ పదకోశానికి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకపోవల్సిన భాధ్యత మనందరి మీదున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com