“Human history becomes more and more a race

between education and catastrophe”. – H.G Wells (The outline of History’, Chapter-40).

మనిషిగా తన కర్తవ్యమేమిటన్న నైతిక మీమాంస, ఏ నిర్ణయం తీసుకోవాలన్న అస్తిత్వ సంకటస్థితి వ్యక్తికి ఎప్పుడు ఎదురవుతాయంటే… చుట్టూరా అస్తవ్యస్తత నెలకొని, సొంత జీవితం సంక్షుభితమైనప్పుడు. అస్తవ్యస్తతకు, సంక్షోభానికి మూలకారణం… తీవ్ర యుద్ధ పరిస్థితులు కావచ్చు. తుపాను, వరదలు, పెను భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు. కార్చిచ్చులా వ్యాపించి లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని హరించి వేసే అంటువ్యాధి లేదా మహమ్మారి కావచ్చు. మనలో కొందరు పుట్టి, ఒక రకంగా సంఖ్యా విషయిక,

భౌతిక సంపత్తి సంబంధిత సాఫల్యాలతో జీవితాన్ని కొలుచుకుని, ముదిమిలోకి జారి, మృత్యువు ఒడిలోకి చేరిపోతారు. వీరు ఒక అర్థవంతమైన జీవనానికి ఆదర్శవంతమైన మార్గదర్శకాలు పెట్టుకోరు. వీరి దృష్టిలో అస్తిత్వం అంటే పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, జబ్బులు, దుర్ఘటనల సంయోజితమైన క్రియాశూన్య ఉనికి మాత్రమే. మరో కోవకు చెందిన వారున్నారు… వీరు నిర్ణయ స్వేచ్చను ఉపయోగించుకుని జీవితానుభవాల్లో

క్రియాశీలంగా నిమగ్నమవడమే అస్తిత్వానికి పరమార్థం అని భావిస్తారు.

ఈ రెండు కోవలకు చెందిన మనుషుల్ని, వారి మనస్తత్వాలని, వారి జీవన వైఫల్య సాఫల్యాలని సుమారు డజనున్నర పెద్ద, చిన్న పాత్రల రూపంలో ‘The Plague’ నవల (1947)లో ఆల్బర్ట్ కాము అద్భుతంగా చిత్రించాడు.

వర్తమానంలోకి వస్తే, 2020 ప్రారంభం నుండి కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూ వస్తోన్న గత 8-10 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొనివున్న కల్లోల భరిత ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ప్రత్యేకించి మనదేశంలోని సంక్షుభిత జీవన స్థితిగతులు, అనేక రంగాల్లోని అనూహ్య పరిణామాలు, ప్రజల భయభ్రాంతులు, వారి నిస్సహాయత,

ప్రజారోగ్య అత్యయిక స్థితి, ఐసోలేషన్లు, క్వారంటైన్లు, సామూహిక ఖననాలు, దహనాలు… వగైరా బీభత్స దృశ్యాలు ‘The Plague’లో చిత్రించిన వాటికన్నా అనేక రెట్లు తీవ్రమైనవి, విస్తృతమైనవని పరిస్థితులు ప్రత్యక్షంగా చూస్తున్న, అనుభవిస్తున్న మనకు తెలుసు. యావత్ ప్రపంచమే ఇప్పుడు గడగడలాడి పోతున్నది. అయితే ఆ నవల గుర్తుకువచ్చినప్పుడల్లా ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా అనుకోని ఉపద్రవాలె దురైనపుడు మనుషుల స్పందనలు, వాటి క్రమానుగత దశలు దాదాపు ఒకేలా వుంటాయి. ఒక చారిత్రిక సంధి దశలో సంభవించిన ఘటనలను, సన్నివేశాలను వాటిపట్ల మనుషుల స్పందనలను, భావోద్వేగాలను కల్పిత పాత్ర(ల)పరంగా ప్రదర్శించి నాటి పరిస్థితులను కళ్ళకు కడతాడు సాహితీకారుడు. ప్రాచీన పత్రాలు, అలేఖనాలు శోధించి, పలు ఆకరాల ద్వారా, వ్యక్తుల ద్వారా విషయ సేకరణ చేసి గతకాలాల ఘటనల్ని ఒక క్రమ పద్ధతిలో కూర్చి సమకాలికులకు అందిస్తాడు చరిత్రకారుడు. వర్తమానంలోని విశేషాలను, కీలక ఘట్టాలను లేదా వైపరీత్యాలను, అవి అశేష ప్రజానీకపు జీవితాల్ని ప్రభావితం చేసే తీరును ఉదంతాలుగా, ధారావాహిక దృశ్యమాలికలా నమోదు చేసి, ఒకవైపు సమకాలికుల దృష్టికి తెస్తూనే మరోవైపు

భావితరాలకు అందిస్తాడు పాత్రికేయుడు. ఇక్కడ పాత్రికేయుడు పరోక్షంగా చరిత్రకారుడు కూడా. ఈ పుస్తకం ‘కరోనా ఎట్ లా డౌన్ 360″ ప్రచురించడం ద్వారా కవీ, ప్రధానంగా పాత్రికేయుడూ అయిన కోడం పవన్ కుమార్ పై ద్వంద్వ బాధ్యతల్ని నిర్వర్తించాడనే చెప్పాలి.

ప్రపంచ మానవాళిని కనీ వినీ ఎరగని రీతిలో భయభ్రాంతుల్ని చేస్తూ, శాస్త్ర సాంకేతిక, వైద్య విజ్ఞాన రంగాల్లో ఎంతో పురోగతి సాధించానని జబ్బలు చరుచుకునే ఆధునిక మానవుడికి పెను సవాలుగా మారి, ఆధునిక చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక స్థాయిలో ప్రాణ నష్టం, ఆర్ధిక నష్టం కలిగిస్తూ అప్రతిహతంగా విలయతాండవం సాగిస్తున్న ‘కరోనా వైరస్ డీసీజ్-2019’ మిగులుస్తున్న దారుణ ఫలితాలను – సామాజిక సంబంధాల్లో, కుటుంబ బంధాల్లో, వ్యక్తి ప్రవర్తనలో, వ్యవస్థల వ్యాపారాల్లో, ప్రభుత్వాల పనితీరులో మొత్తంగా మానవ సమాజంలో చోటు చేసుకుంటూన్న అమానవీయ మార్పులను – సినిమా రీలులా మన కళ్ళ ముందర కదిలిస్తూ, ప్రస్తుతం మనం ఎంతటి దయనీయమైన సంకట స్థితిలో, అనివార్యమైన స్వార్థపూరిత బంధనాల్లో చిక్కుబడిపోయామో వివరిస్తున్నాడు పవనకుమార్. రం ఫలితాల్లో కొండొకచో సానుకూల అంశాలూ గోచరిస్తాయి. అందరూ ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చిన కారణంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల నడుమ అనుబంధాలు, అన్యోన్యత పెరిగాయి; ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి పై, పుస్తక పఠనం పై శ్రద్ధ

హెచ్చింది; వాతావరణ, నీటి కాలుష్యాలు గణనీయంగా తగ్గినై; డిజటల్, ఆన్ లైన్ లావాదేవీల వేపు ఎక్కువ మంది మొగ్గు చూపడంతో సాంకేతికత వాడకం పెరిగింది. అయితే ఇవన్నీ ఎంతకాలం నిలుస్తాయో తెలియదు. ఏదేమైనా, అనేక బతుకులను వివిధ రకాల వెతలకు గురిచేసి, దాదాపు అన్ని వర్గాల ప్రజల్లో జీవన భారాన్ని, భయాందోళనలను పెంచిన ఈ మహమ్మారి వర్తమాన చరిత్రను కోవిడ్-19కు ముందు, ఆ తర్వాత అని విభజించాల్సిన అవసరాన్ని కల్పించిందని మనకు అర్థమవుతుంది.

ఏమిటి ఈ కోవిడ్-19? 2019 డిసెంబర్ చివరలో హుబెయ్(చైనా)

ప్రావిన్స్ లోని వూహాన్ పచ్చి/సముద్ర సంబంధ ఆహార మార్కెట్లో ‘నావెల్ కొరోనా వైరస్’ (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం కలిగించే – ‘SARSCov-2’) ఉనికిని కనిపెట్టారు. గతంలోని SARS-COV, MERS-COVE కుటుంబానికి చెందిన వైరస్ ఇది. కాకపోతే అతి వేగంగా ఉత్పరివర్తనాలకు లోనుకాగల గుణం వున్న వైరస్ ఇది.

SARS-COV-2 వైరస్లు మనిషి శ్వాస నాళాల్లోకి ప్రవేశించాక ఆంజియో టేన్సిన్ కన్వర్టింగ్ ఎంజైం-2 (ACE2)ని, ఆ తర్వాత ఆల్వోలర్ టైప్-2 కణాలను, ఇంకా ఊఊపిరితిత్తుల్లోని ఇతర తెలియని టార్గెట్ కణాలను ఇన్ఫెక్షను గురిచేస్తాయి. వైరస్లో ఇన్ఫెక్ట్ అయిన కణాలు ఆతిథేయి ఉత్పత్తి చేసే ఇంటర్

ఫెరాన్ (IFN 1)ను తప్పించుకుంటాయి. ఫలితంగా ఊపిరితిత్తుల్లో వైరస్ కణాలు తమ సంఖ్యని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మరికొన్ని గొలుసు చర్యల తర్వాత ప్రో – ఇన్నై మేటరీ సైటోకిన్స్ హెచ్చు మోతాదుల్లో విడుదలవుతాయి. ఈ ‘సైటో కిన్స్ ప్రభంజనం ఊపిరితిత్తుల వాపుకు, పుండుకు దారితీస్తుంది. ఊపిరి అందక, ఆక్సిజన్ స్థాయి పడిపోయే ఈ దశ రోగికి ప్రాణాంతకమవుతుంది. రం వ్యాధి ప్రమాద తీవ్రతను గుర్తించిన WHO జనవరి, 2020లో దీనికి COVID-19 అని నామకరణం చేసి ‘పాండెమిక్ (మహమ్మారి)’గా ప్రకటించింది. మొదట్లో (పచ్చి/సముద్ర సంబంధ ఆహార) జంతువుల నుండి మనుషులకు జబ్బు అంటుకోవడమే ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రధాన విధానం అని అందరూ భావించారు.

కానీ అనంతర కాలంలోని కేసులు జంతువులతో ప్రత్యక్ష సంబంధం లేనివయినందున జబ్బు మనిషి నుంచి మనిషికి సంక్రమించే ఆస్కారముందని తెలియవచ్చింది. వ్యాధి లక్షణాలున్నవారి నుంచే కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశాలు హెచ్చు అయినప్పటికీ లక్షణాలు లేని వారి నుంచి కూడా అది వ్యాపించే ఆస్కారం తోసివేయలేము. ఇప్పటివరకు ఈ వ్యాధి చికిత్సకు కచ్చితమైన మందు లేదు. వివిధ కంపెనీల వాక్సినులు ప్రయోగదశ (క్లినికల్ ట్రయిల్స్)లో వున్నాయి.

నేనిది రాస్తున్న నాటికి ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 10 లక్షల మంది ఈ వ్యాధి బారినపడగా వారిలో 11 లక్షల మంది మరణించారు. వ్యాధి 220 దేశాలను తాకింది. అగ్ర రాజ్యమైన అమెరికా, లాటిన్ అమెరికా దేశమైన

బ్రెజిల్ ఈ వ్యాధి కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. అమెరికాలో సగటున రోజుకు 60 వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటూ ఎక్కువగానే వుంది. భారతదేశంలో 75.5 లక్షల కేసులు నమోదు కాగా ఒక లక్షా పద్నాలుగు వేల మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల 23 వేల కోవిడ్-19 కేసులు రికార్డయితే, వారిలో 1,275 మంది మృత్యువాత పడ్డారు. కారణాలేమిటో తెలియదుగాని, వ్యాధి వ్యాప్తి ఉధృతి ఇటీవల కొద్దిగా తగ్గినట్లుగా కనపడుతోంది (వైరస్ ‘విరిలిటీ’ తగ్గిందని డాక్టర్లు అంటున్నారు).

కానీ కొన్ని దేశాల్లో ‘సెకండ్ వేవ్’ ప్రారంభమైనట్టు వార్తలు వస్తున్నాయి. మన దగ్గర ప్రజలు మునుపటిలా భయపడటం లేదు. ఊరికనే కూర్చుంటే బతుకు బండి సాగదన్న భావన, 80-85 శాతంగా ఉన్న రికవరీ రేటు ఇస్తున్న భరోసా, త్వరలోనే వాక్సీన్ వస్తుందన్న నమ్మకం, ఏదయితే అది కానీ లెమ్మనే మొండి ధైర్యం… బహుళ ఇందుకు కారణాలు కావచ్చు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. గమనించాల్సిన వాస్తవమేమిటంటే, మానవుడు వేటాడి ఆహారం సేకరించే దశ నుండి వ్యవసాయ దశకు వచ్చేసరికి, అంటే గత 10,000 సంవత్సరాల నుంచే, అంటువ్యాధుల బారిన పడటం, ఆరంభమైంది. ప్రాచీన మానవులు విడి సమూహాలుగా దూరదూరంగా వుండేవారు. కాలక్రమేణా వ్యవసాయం అభివృద్ధి చెంది, మిగులు ఉత్పత్తులు పెరిగి, సమూహాల నడుమ వస్తు మార్పిడి, వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాక స్థానిక వ్యాధులు అంటువ్యాధులు (మలేరియా, మశూచి, క్షయ, కుష్టు, ఇన్ ఫ్లూయెన్ జా)గానూ; నాగరికత పెరిగినా కొద్ది దేశాల మధ్య సముద్ర, వాయు రవాణా మార్గాలు నెలకొనడం, వనరులకై పోటీలో యుద్ధాలు జరగడం మూలంగా అంటువ్యాధులు మహామ్మారులు (కలరా, ఎయిడ్స్, వైరల్ జబ్బులు)గానూ మారాయి. మన జబ్బులకు సూక్ష్మజీవులు, వైరస్లు, పరాన్న జీవులు బాహిర్ కారణాలైతే, ప్రత్యేక సందర్భాల్లో పలు శరీరావయవాల పనితీరు మందగించడం అంతర్గత కారణం. సృష్టిలోని ప్రాణికోటిలో

ప్రతిజీవికీ దానిదంటూ ఒక ప్రత్యుత్పత్తి విధానం, జీవిత చక్రం వుంటాయి. ఒక

ప్రాణి తన మనుగడ కోసం మరో ప్రాణి (ఆతిథేయి-హెస్ట్)లో తిష్ట వేసినప్పుడు

ఆ రెండింటి మధ్య సయోధ్య ఉన్నంత కాలం ఏ పేచీ లేదు. ఉదా. మానవ శరీరరంలోని గట్ బాక్టీరియా.

కానీ విబ్రియో కలరే, మైక్రో బాక్టీరియం టుబర్క్యులోసిస్… వంటివి ప్రమాదకర సూక్ష్మజీవులు. ఇవి కలరా,కానీ విబ్రియో కలరే, మైక్రో బాక్టీరియం టుబర్క్యులోసిస్… వంటివి ప్రమాదకర సూక్ష్మజీవులు. ఇవి కలరా,

క్షయ కారకాలు. మనిషిలోని సహజ ఇమ్యూనిటీ వ్యాధికారక సూక్ష్మ జీవుల దాడిని తిప్పికొడుతుంది. ఒక్కొక్కసారి మన ఇమ్యూనిటీ తికమక పడిపోవడం లేదా చిత్తయిపోవడం వల్ల వ్యాధి కారక సూక్ష్మజీవులది పై చేయి అవుతుంది. పరిణామ వాదం, ప్రకృతి వరణం ప్రకారం పరిసరాలకు తగిన శక్తి యుక్తుల్ని సముపార్జించుకున్న ప్రాణి మాత్రమే మనుగడ సాగించగలదు. అలా పరిణామం చెందిన రోగ కారక సూక్ష్మజీవులు ఒక దశలో మందులకు లొంగవు, వాటికి వ్యాక్సీన్లు పని చేయవు. వైరస్ అనేది ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్(ఇది వస్తువుని రెండు లక్షల రెట్లు పెద్దది చేసి చూపిస్తుంది)లో మాత్రమే కనపడే చిత్రమైన కణం. ఇది ఒకసారి జీవిగా, మరోసారి నిర్జీవిగా కూడా ఉండగలదు. కోవిడ్-19 కారక నావెల్ (కొత్తగా

ఆవిర్భవించిన) కరోనా వైరస్ గతంలో వచ్చి పోయిన కరోనా వైరస్ల కన్నా భిన్నమైనది, ఆతిథేయిని బట్టి తన స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్నది. దీనిని నివారించగల వ్యాక్సీన్ని అభివృద్ధి చేయడం క్లిష్టమైన పనిగా వుంది. ఎట్టకేలకు శాస్త్రవేత్తల కోరకృషి విజయవంతమైంది. అయితే వ్యాక్సీన్ అందరికీ అందేలోగా కోవిడ్-19 ఇంకా ఎన్ని లక్షల మందిని బలి తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి. ఇది ఆరోగ్యవంతులను వ్యాధిగ్రస్తులను చేస్తున్నది. వయోధికులు, ఇతర జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాలు హరించి వేస్తున్నది. చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం… వంటి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ, ఇమ్యూనిటీ పెంచే ఆహారపుటలవాట్లు, జీవనశైలిని ఆచరించడం మనం ఇప్పుడు చేయగల్గిన పని. ఈ వ్యాధి వ్యాప్తి ‘కర్వ్’ని వంచేందుకు, ‘లింక్ ని తెగొట్టేందుకు చాలా దేశాలు బహిరంగ సమావేశాలను నిషేధించాయి. లా డౌన్లు ప్రకటించాయి. త్వరగా, వేగంగా అంటుకునే ఈ జబ్బు నుంచి ప్రజల్ని కాపాడేందుకు కఠిన క్వారంటైన్, ఐసోలేషన్ నియమాలు విధించాయి. న్యూజిలాండ్, ఐర్లాండ్, దక్షిణ కొరియా దేశాలు వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో (ట్రేస్, ట్రాక్, ట్రీట్ పద్ధతి ద్వా రా) విజయవంతమైనాయి. కానీ ఇతర చాలా దేశాలు హ్రస్వదృష్టితో, అల్ప సంతోషంతో నియమాలు సడలించిన ఫలితంగా అక్కడ వ్యాధి వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళా పెరుగుతూ పోయింది. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కోవిడ్ నిబంధనల/ఆంక్షల విధింపు, సడలింపులలో, దశల వారీ లా డౌన్, అలాక్లు ప్రకటించిన సమయ సందర్భాల్లో, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు ప్రజలకు అందుబాటులోకి తేవడంలో… వాస్తవిక దృష్టి క్షేత్రస్థాయి పరిస్థితుల అవగాహన కొరవడ్డాయని, వ్యాధి నియంత్రణకు ముందుచూపుతో, శాస్త్రీయ దృక్పథంతో కూడిన వ్యూహ రచన సరిగా జరగలేదు. మన దైనందిన జీవితాలను అమితంగా ప్రభావితం చేస్తున్న కోవిడ్-19 వల్ల కష్టాలు, నష్టాలు కోకొల్లలు చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇది వర్తక వ్యాపారాలను, ప్రపంచ వాణిజ్యాన్ని, ప్రజల కదలికలను దాదాపు పూర్తిగా స్తంభింపజేసింది. చాలా దేశాల్లో పరిశ్రమలు తమ ఉత్పత్తులను భారీగా తగ్గించి వేశాయి. చాలా రకాల పరిశ్రమలు, ఉత్పాదక రంగాలు – ఫార్మాస్యూటికల్, సోలార్ పవర్, టూరిజం, ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ; సేవ, వినోద రంగాలు;

మోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్ళు, జిమ్ లు, ఫంక్షన్ హాళ్ళు, అమ్యూసింగ్ పార్కులు, రోడ్డు, రైలు, విమాన ప్యాసింజర్ రవాణా సంస్థలు ఇత్యాదిగా కోవిడ్-19 దెబ్బకు కుదేలైనాయి. చాలా మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు.

దారుణ మారణ హోమం సాగిస్తూ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ కొత్త రకం మహమ్మారి ఎలా ఆవిర్భవించింది? ఇందుకు మానవ తప్పిదాలు ఏ మేరకు కారణం? ఏ వెల్లులకు మన నాగరికత ప్రస్థానం? అందరి మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలు ప్రపంచ నాయకులను, మేధావులను, శాస్త్రవేత్తలను అంతరావలోకనం లోకి నెట్టాయి. భవిష్యత్తులో రాబోయే ఇలాంటి మహమ్మరులను ఎలా ఎదుర్కోవాలి! నిరోధించాలి అనే ఆలోచనలో పడ్డారు అందరూ. గబ్బిలాల నివాస స్థావరాలు, వాటి ఆహారపు టలవాట్లు, సంచార శైలి… వీటిలోని మార్పులను బట్టి చూస్తే, చుట్టూ పర్యావరణంలో, మనిషి – ఇతర ప్రాణుల జీవావరణ సమతౌల్యంలో ఏదో తేడా వస్తోందనీ, మనుషులకు సోకుతున్న కొత్త కొత్త రోగాలకు ఇదే కారణమనీ తెలియ వస్తున్నది. వనరులు, మానవ వినియోగ భూభాగాల (పట్టణ, వ్యావసాయిక భూములు, నివాసాలు)లోని మార్పులు వైరస్ ఒక జాతి ప్రాణి నుంచి మరో జాతి ప్రాణికి సులువుగా వ్యాపించే దుష్పరిణామానికి దారి తీస్తున్నాయి.

కాబట్టి దీనికి సంబంధించిన మొత్తం ప్రక్రియను సమీక్షించాల్సిన అవసర ముందని అందరూ గుర్తిస్తున్నారు. తరిగిపోతున్న అడవులు, వన్యప్రాణులతో పెరిగిపోతున్న మనిషి సాన్నిహిత్యం , అతని తిండి అలవాట్లు, పెరుగుతున్న జనసాంద్రత, వాతావరణ మార్పులు, ప్రపంచీకరణ ఇవన్నీ ఏదో ఒక మేరకు రోగాల సంక్రమణకు దోహదపడు తున్నాయనేది వాస్తవం.

కోవిడ్-19 నియంత్రణ కోసం ప్రపంచ దేశాలు, ప్రముఖ ఫార్మా కంపెనీలు వాక్సిన్ కని పెట్టే పనిలో తలమునకలై వున్న ప్రస్తుత సందర్భంలో అమెరికన్ సైన్స్ జర్నలిస్ట్ లౌరీ గ్యారెట్ ఒక ముఖ్య విషయాన్ని నొక్కి చెప్పింది. “సమ దృష్టి లేకుండా మనం మహమ్మారిపై సాగించే పోరు విఫలమవుతుంది. వైరస్లు సులువుగా పునర్ వ్యాపిస్తాయి. భూగ్రహం మీద రక్షణ లేని అభాగ్య జీవుల ద్వారా అవి ఒకరి నుంచి మరొకరికి సోకుతూ, బహుశ ఉత్పరివర్తనాలు లేదా మార్పులు చెంది వాక్సీనులను నిష్ప్రయోజనం చేస్తాయి”. విలువైన ఈ మాట అందరూ వింటారని ఆశిద్దాం.

కోవిడ్-19 విషయంలో ప్రజల్లో అనేక భయాలు, అపోహలు వున్నాయి. క్వారంటైన్, ఐసోలేషన్, సానిటేషన్, భౌతిక దూరం, మాస్కులు… తదితర నిబంధనలు ప్రజల్ని గాభరా పెట్టేశాయి. కోవిడ్ నిబంధనల పేరుతో మృత దేహాలను దూరం నుంచే బంధువులకు చూ పెట్టి సామూహిక ఖననం లేదా దహనం చేసిన పరిస్థితులు, తల్లో, తండ్రో, ఇతర ఆప్తులో కోవిడ్ అనుమానంతో మరణిస్తే కుటుంబ సభ్యులు శవాన్ని ఇంటికి తీసుకెళ్ల నిరాకరించి, ఆసుపత్రి/ మున్సిపల్ సిబ్బందికే డబ్బులిచ్చి అంత్య

క్రియలు జరిపించిన ఘటనలు: కన్నతల్లో, తండ్రో కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి వస్తే కొడుకులు, కోడళ్ళు వాళ్ళను ఇంటిలోకి రానివ్వకుండా బయటే ఉంచిన సన్నివేశాలు మనం చూశాం. దూర ప్రాంతం నుంచి తిరిగి వచ్చిన కుటుంబాలను కోవిడ్ భయంతో ఊరి బయటే వుంచడం, ఒక వూరి వాళ్ళు మరో ఊళ్ళోకి ప్రవేశించకుండా కంచెలు/ కందకాలు ఏర్పాటు చేసిన ఉదంతాలూ విన్నాం.

కోవిడ్ సంక్షోభ కాలంలో వలస కార్మికుల బతుకులు మరీ దయనీయంగా మారాయి. భవన నిర్మాణ పనులు, ఇతర వ్యాపారాలు స్థంభించడంతో కూలీ పనులు దొరకక, పొట్ట గడవక వీరు నానా యాతనలు పడ్డారు. మొత్తంగా వాళ్ళ సంఖ్య ఎంత, ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కడెక్కడ వున్నారు –

ఈ వివరాలు ఏ సర్కారు శాఖలోనూ లేవు. వాళ్ళను ఆదుకునే విషయంలో ఏ చట్టాల్లోనూ స్పష్టత లేదు. ఏదో గత్తర కమ్ముకు వస్తోంది, చస్తామో బతుకుతామో తెలియదు, చచ్చేలోగా అయినవాళ్ళని, కన్నవాళ్ళని చూడాలన్న తపనతో, వందలు, వేల మైళ్ళయినా నడిచిపోవడానికి సంసిద్ధులై మూటాముల్లె నెత్తిన పెట్టుకుని, పసివాళ్ళని చంకనేసుకుని ఎర్రటి ఎండలో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూశాం. ఎలాగోలా గమ్యస్థానం చేరుకోవాలన్న ఆరాటంలో దొరికిన ప్రయాణ సాధనాలు ఎక్కేసి భద్రత లేని బతుకు పయనంలో రోడ్డు ప్రమాదాలకు గురై వివిధ రాష్ట్రాల్లో పలువురు మరణించారన్న వార్తలు విన్నాం . గ్రామాల గుండా వెళితే

గ్రామస్థులు అడ్డుకుంటారన్న భయంతో కొన్ని అమాయక వలస కుటుంబాలు రైలు పట్టాల వెంట నడిచిపోతూ, అలిసిన చోట నిద్రిస్తూ, ఊహించని రీతిలో గూడ్స్ రైలు చక్రాల కింద ఖండ ఖండాలుగా చిద్రమైపోయాయన్న వార్తలు కూడా చూశాం. ఆంక్షలు, నిబంధనలు రాష్ట్రాల సరిహద్దులు దాటనివ్వనప్పుడు కడుపు మండిన కార్మికులు అక్కడక్కడా – మన రాష్ట్రంలో కంది, పటాన్‌చెరు ప్రాంతంలో, ముంబైలోని బాంద్రాలో – హింసాకాండకు తెగబడితేనే ప్రభుత్వాలు వారి కోసం ప్రత్యేక రైళ్ళు నడిపాయని మనకు తెలుసు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ‘వాళ్ళను రాష్ట్రాలు విడిచి ఎవరు వెళ్లి పొమ్మన్నారు?’ అని కోపించే బదులు వారి గోడును మానవీయ కోణంలో అర్థం చేసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం నివాస, భోజన, వైద్య వసతులు కచ్చితంగా ఏర్పాటు చేయాలని గట్టి ఆదేశాలు ముందే ఇచ్చి వుంటే బాగుండేది. ఆలస్యంగానైనా వాస్తవ పరిస్థితి గ్రహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకుని దేశవ్యాప్తంగా 21,000 పునరావాస కేంద్రాలు, జిహెచ్ఎంసి పరిధిలో 80 షెల్టర్ హెూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఇవన్నీ తలచుకున్నప్పుడు, భారత్ సర్వ సమగ్ర రాజ్యాంగం, సవ్యవస్థత పాలనా, అధికార యంత్రాంగాలు, సుస్థిర ప్రభుత్వం వున్న పెద్ద ప్రజాస్వామ్య దేశమే అయినా మన వ్యవస్థలో ఏదో లోపం ఉందన్న వాస్తవం స్పురించి మన కడుపు లో దేవినట్టవుతుంది. ఇదలా ఉంచితే, గొప్ప ఊరట కలిగించే విషయమేమిటంటే – మన ప్రజలు సంక్షుభిత కాలంలోనూ, ఉపద్రవం వెన్నాడుతున్న ఇంతటి భీతావహ సందర్భంలోనూ మనిషితనం మరిచిపోలేదు. దోవన పోతున్న వలస కార్మిక కుటుంబాలకు ఊళ్ళల్లో ప్రజలు అన్నపానీయాలు అందించారు, సేద దీర్చుకునేందుకు ఆశ్రయం కల్పించారు. పలు గ్రూపులు, స్వచ్చంద సంస్థల వాళ్ళు భోజనం పెట్టి, ఇతర అవసరాలు సమకూర్చి మానవత్వం చాటుకున్నారు. కొందరు రైతులు, పేద మహిళా కార్మికులు సైతం ‘కోవిడ్ నిధి’కి ఉడతా భక్తిగా విరాళాలిచ్చి దాతృత్వం ప్రదర్శించారు.

పాత్రికేయుడు కోడం పవన్‌కుమార్ వినూత్నంగా ఆలోచించి ఒక నాన్-ఫిక్షనల్ ప్రక్రియ ఎంచుకున్నాడు; యావత్ ప్రపంచాన్ని కుదిపి వేస్తున్న కోవిడ్-19 విలయ హేలను, భారతదేశం, తెలంగాణపై ప్రత్యేక ఫోకతో, దాని ప్రభావపు సమస్త పార్శ్వాలను మనకు అందిస్తున్నాడు. ఇతనికి హై డిఫినిషన్ కెమెరా లెన్స్ లాంటి నిశిత దృష్టి ఉంది.

‘కరోనా ఎట్ లాక్ డౌన్ 360″ పుస్తకంలో ఒక రకంగా వ్యాసాల రూపంలో వివిధ టాపిస్తున్నాయి; ప్రతి టాపిక్, విషయాన్ని పలు కోణాల్లోంచి ఆవిష్కరించి అనేక వివరాలు గుదిగుచ్చిన ఉదంతం/వార్తా కథనంగా దర్శనమిచ్చి మనలను అబ్బురపరుస్తుంది. ఉదాహరణకు, ‘విమర్శల వెల్లువలో నిలదొక్కుకున్న డబ్ల్యూహెవో’. ఇందులో, ప్రపంచ ప్రజల ఆరోగ్య రక్షణలో డబ్ల్యూ హెవో పాత్ర, బాధ్యతలు, కార్యకలాపాలు, జెనీవాలో దాని ప్రధాన కార్యాలయం రూపు రేఖలు, ఐరాస సహకారం, కొన్ని ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడంలో ఆ సంస్థ సాధించిన సాఫల్యాలు, కరోనా వైరస్ గురించి వాస్తవాలు దాచిన చైనాని వెనకేసుకొచ్చిందంటూ దానిపై ఆరోపణలు, ట్రంప్ ఆగ్రహించి ఆ సంస్థకి నిధులు నిలిపి వేయడం… తదితర వివరాలిచ్చి ‘ప్రపంచ దేశాలను చుట్టు ముట్టే మహమ్మారి వ్యాధులను తుద ముట్టించడానికి ఈ సంస్థ అవసరం ఎంతైనా వుంది. దీన్ని కాపాడుకుంటూ మరింత పటిష్టవంతంగా తయారు చేయడానికి సభ్య దేశాలు ముందుకు రావాలి’, అని ముక్తాయించడం బాగుంది. మరో ఉదాహరణ: ‘కుదేలైన దేశదేశాల ఆర్ధిక వ్యవస్థ’. ఇందులో అమెరికా, జర్మనీ, జపాన్… లాంటి సంపన్న దేశాల ఆర్ధిక వృద్ధి రేటులోని క్షీణతని తెలియజేసే పలు గణాంక వివరాలు వున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావం, ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలను వివరిస్తూ, ‘… ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్త లా డౌన్ మూలంగా 120 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లు) మేర ఆర్ధిక వ్యవస్థ పై భారం పడే అవకాశం వుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వున్న సమయంలో కరోనా విజృంభణ పిడుగుపాటులా పరిణమించింది… నెమ్మదించిన ఆర్ధిక వ్యవస్థకు ఆర్బీఐ ఊపిరిలూదుతూ రూ.5.24 లక్షల కోట్ల మేర వెసులు బాట్లు రెండవ విడత చర్యలో భాగంగా ప్రకటించింది. వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూడటంతో పాటు బ్యాంకుల రుణాల మంజూరు పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రివర్స్ రేపో రేటుని పావు శాతం తగ్గించింది. కరోనా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో ఓ అవకాశంగా మార్చుకోవాలని ఆశిస్తున్న భారత ప్రభుత్వం ఆర్ధిక స్వావలంబన సాధనకు ఇదో మార్గంగా ఎంచుకుంది. మూడవ విడత ‘ఆత్మ నిర్బర్ భారత్ (స్వయం సమృద్ధ భారత్)’ పేరుతో ఆర్థిక రంగం, మౌలిక వసతులు, మొత్తంగా వ్యవస్థ, క్రియా శీలమైన జనాభా, డిమాండ్ పెంపుదల… అనే అయిదు స్తంభాలపై రూ.5.94 లక్షల కోట్లతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీనితో మొత్తం ప్యాకేజీ విలువ రూ.12.88 లక్షల కోట్లకు చేరింది. రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజిలో మిగిలిన రూ.7.11 లక్షల కోట్లను విడతల వారీగా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆయా రంగాలకు కేటాయించారు.

మొత్తం ప్యాకేజి స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 10 శాతంగా ఉంటుందని’ వివరించారు. అదే పేరాగ్రాపులో ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని మన కళ్ల ముందుంచుతాడు రచయిత.

చాలా ఆకరాలు శోధించి అనేక వివరాలు, గణాంకాలు సేకరించి ప్రతి journalistic piece ని సమగ్రంగా తీర్చి దిద్దాడు పవనకుమార్. దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, సూడాన్, అఫ్ఘనిస్తాన్ సిరియా… లాంటి దేశాలతో కలుపుకుని

మొత్తం ప్రపంచ క్షుద్బాధితుల సంఖ్య 2019లో 13.5 కోట్లు కాగా, ఆ సంఖ్య 2020లో 26.5 కోట్లకి పెరిగింది….. ‘హైదరాబాదులో మొత్తం 20 లక్షల మంది వలస కార్మికులు, బిచ్చగాళ్ళు, అనాథలు ఉన్నారు… ‘తెలంగాణలో 56,000 పరిశ్రమలు మూతపడ్డాయి. 16 లక్షల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు’. ‘కుల/చేతి వృత్తుల వారు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు’… రచయిత సమగ్ర అవగాహనకు అద్దం పట్టే ఇలాంటి అంకెలు, వివరాలు ఈ పుస్తకంలో కోకొల్లలుగా కనపడతాయి. ఇందులోని వ్యాసాలన్నీ కరోనా ఉధ్బుతిని ఏప్రిల్-జులై

నెలల వరకు మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాసినట్లుగా వుంది.

కోవిడ్-19 బతుకుల్ని అతలాకుతలం చేసింది. ఎన్నో విషాద ఘటనలు, హృదయ విదారక దృశ్యాలు వింటు న్నాము, కంటున్నాము. ఈ పుస్తకం చదువుతూంటే మనల్ని ఒకరకమైన ‘dejavu’ ఆవహిస్తుంది. కోవిడ్ ప్రభావం మన మీద పలు విధాలా పడింది. ఈ పుస్తకంలోని వ్యాసాల సమాహారంలో ఆ ప్రభావపు అన్ని ఛాయలు, వైవిధ్యం వున్నాయి. అన్ని రంగాల పై, సమస్త జీవన పార్శ్యా లపై కోవిడ్-19 ప్రభావాన్ని అనితర సాధ్య మైన లోచూపుతో, సామాజిక అధ్యయనకారునికి వుండే సమగ్ర దృష్టితో విశ్లేషించాడు పవనకుమార్. దేశ విభజన నాటి కల్లోలం, ఘర్షణలను చిత్రించిన ఫిక్టన్, నాన్-ఫిక్షన్ (The Otherside of Silence, Train to Pakistan), హెలో కాస్ట్ దురంతాలను వర్ణించిన సాహిత్యం (If this is a Man), అక్టోబర్ విప్లవాన్ని అన్ని దశల్లో వివరించిన చారిత్రిక గ్రంథాలు (October- The Story of the Russian Revolution),

రెండో ప్రపంచ యుద్ధ తుది దశను, హిట్లర్ పాలన చరమాంకాన్ని అక్షర బద్దం చేసిన పుస్తకాలు (Ten Days that Shook the World) చాలా చదివాం.

ఈ పుస్తకం ఇదే కోవలోకి వస్తుందనడంలో సందేహం లేదు. వర్తమానానికి, నడుస్తున్న చరిత్రకు కత్తుల వంతెన వేసిన కోవిడ్-19 ప్రభావ సమస్త పార్శ్వా లను వివరించే ఈ ‘కరోనా ఎట్ లాక్ డౌన్ 360″ భవిష్యత్ తరాలకు మంచి రిఫరెన్స్ పుస్తకంగా నిలిచి పోతుంది. పాత్రికేయ మిత్రుడు కోడం పవనకుమారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com