— ఏనుగు నరసింహారెడ్డి

పరుగుల పాద విన్యాసంలోనో

పగ్గంలేని బుడితనం గంతుల్లోనో

హక్కుల్లేవని తెలియక లాంగ్ జంప్ బెర్రలు దాటినప్పుడు

నిషిద్ధాక్షరిని ఉచ్ఛరించినట్లు

తాళ్ళుకట్టి లాగబడేది ఆమె శైశవం

తనే మొదలుపెట్టిన ఆట యేటిలో

బ్యాల్యం కేరింతలు కొడుతూ ఉన్నప్పుడు

అకస్మాత్తుగా మొలిచిన కేకల కొక్కాలకు చిక్కి

ఆమె ఆటలోతుల వికాసం లాక్కుపోబడేది

జ్ఞాన శిఖరాల సోపానాల పంక్తిలో

అధిరోహనాహ్లాదం అరవిరియకముందే

బలవంతంగా దారితప్పించబడ్డ

ఆమె కౌమార్యం

అపరిపక్వ కుటుంబ గానుగకు

ఆసక్తితో నిమిత్తం లేకుండా అర్పించబడేది

తెలియకుండా చేసిన తప్పు

తెలిసి తెలిసీ చేసిన నేరం

రెండూ ఒకవైపే లాగే పాసంగంతో

శిక్షల త్రాసుమొల మొగ్గుతూ ఉంటే

ఆమె యవ్వనం రెప్పల నడిమి కన్నీటి కింద

ఏకపక్షంగా నలిగిపోయేది

ఒకవైపు దారి వికసిస్తాఉంటే

మరోవైపు తోవ్వల్లో

తీసినకోద్దీ అడ్డంబడే ముళ్ళపొదలు.

ఒక మైదానంలో వెన్నెల విస్తరిస్తాఉంటే

మరో ఎగుడుదిగుడు నేలల్లో

ఆవరించుకుంటున్న అమావాస్య నిశి.

ఒకవైపు వికాసం కేరింతల

మోసులెత్తుతా ఉంటే

ఇంకోవైపు కుటుంబ గుడారంలో

కుందేటి రూపం విస్తరిస్తూ

రెప్పలకింద కన్నీటిని

అదిమిపట్టలేని అశక్తత

పూడుకుపోయిన గొంతును

ఉగ్గబట్టకుండా ఆపలేనితనం

భ్రూణ హత్యల రహస్యావసరాల సంగతి సరే

భువన హింసను వేరుపరిచే

మానవహంసలే కరువైన దైన్యం

వెంటాడుతూ ఉంటే

ఒక మూల మలుపులో

ఒక మూల మలుపులో

ఎదురుపడి నివ్వేరపోవలసిందే

ఒక చౌరస్తాలో నిలబడి

అక్కా తమ్ముడూ

దుఃఖపుటేరులో మునగాల్సిందే

అవకాశాలు రెక్కల్ని ఇచ్చినట్టే ఇచ్చి

అదుపాజ్ఞల చట్రాల్ని పరిచినందుకు

మనమంతా వీరంగమేసి

వాళ్ళను పట్టాల్లో మాత్రమే

పరుగెత్తనిచ్చినందుకు

ఇంకా మన తర్వాత మాత్రమే నడిచే

అవకాశాల్ని ఒడుపుగా పరిచినందుకు

ఆట ఒకవైపే ఆడనిచ్చినందుకు

ఆట ఒకవైపే ఆడనిచ్చినందుకు

a

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com