నవీన్ కథాసంపుటిపై సమీక్షా వ్యాసం…

-వరిగొండ కాంతారావు

డా|| అంపశయ్య నవీన్ గారు నవలాకారునిగా సుప్రసిద్ధులు. ఇప్పటి వరకు ముప్పది మూడు నవలలను రచించారు. రెండు జీవిత చరిత్రలను, తొమ్మిది వ్యాస సంపుటాలనువెలువరించారు. హండియా దినపత్రికలో ‘విగ్నెట్స్ ఆఫ్ లైఫ్’ పేరిట (ఆంగ్లంలో) శీర్షికను చాలాకాలం నిర్వహించారు. లోగడ ఏడు కథా సంపుటాలను వెలువరించారు. ఇప్పుడు వారి ఎనిమిదవ కథాసంపుటం వెలువడింది. పేరు “యానాంలో ఒకరోజు “.

ఇందులో పధ్నాలుగు కథలున్నాయి. మొదటి కథ పేరునే కథాసంపుటి పేరుగా నిర్ణయించారు. ఈ కథలన్నీ పత్రికలలో అచ్చయినవే.

కాకినాడలో సన్మానానంతరం యానాంలో ఒక రోజు కవిమిత్రులతో గడపగలందులకు వెళ్ళిన కథారచయిత గోదారిలో బోటు షికారు కెళ్తారు. వీరితో పాటుకొత్తగా పెళ్ళయిన జంట కూడా ఆ షికారులో భాగమౌతారు. పెళ్ళికూతురు తండ్రి వలన ఆ దంపతులకు ప్రాణాపాయం వున్నది.

ఆ ప్రేమజంటకు యానాంలో పోలీసు రక్షణ కల్పిస్తారీ కవులు,రచయితలు. స్థూలంగా కథ యిది. ఇందులోని పాత్రలన్నీ యథార్థాలే. కవుల, రచయితల పేర్లు యథాతథంగా వున్నాయి. ఒక్క ప్రేమజంట పేర్లు తప్ప. బోటులో కవులు తమ కవిత్వాన్ని ఆశు వుగా చదువుతారు. నవీన్ నవలలను వాని వైశిష్ట్యంతో సహా ఏకరువు పెడుతుందా పెళ్ళికూతురు. ఇంతకూ నవీనగారా బోటులోనే వున్న సంగతి తెలియదామెకు. విషయం తెలిశాక ఆమె ఆశ్చర్యానందాలకు అంతం వుండదు.

పరిచయం లేకుండానే తన రచనలను అభిమానించే వ్యక్తి అకస్మాత్తుగా తారసపడడం ఏ రచయితకైనా ఆనందాన్నిచ్చే విషయమే.

రచయిత గొప్పతనమెక్కడంటే మనమంతా ఆ బోటులో షికారుకెళ్తాం. యానాంలోని గౌతమిని దర్శిస్తాం. బోటు నదిలో వెళ్ళినంత అలవోకగా వెళ్ళి పోతుంది కథనం. చదువరికి బుచ్చిబాబు, అడివి బాపిరాజు గుర్తుకు రావడం ఖాయం.

కరీంనగర్‌లోను, వరంగల్ లోను ఫిలిం క్లబ్బులున్నాయి. వాని – స్థాపనలో నవీన్ పాత్ర మరువరానిది.

నవీన్ కి సినిమాలంటే అభిమానం అని చెప్తే చిన్నమాట అవుతుంది. సినీరంగాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన. ఆయన నవలల్లోనూ, కథల్లోనూ ఎక్కడో ఒకచోట సినిమాల ప్రసక్తి అనివార్యంగా వస్తూనే వుంటుంది. డెబ్బయ్యవ పడిలో పడిన మనిషికి సినిమాల పట్ల ఆసక్తి గతకాలానికి సంబంధించిం దనడం సహజం. నవీన్ గారికలా కాదు. సినిమాల పట్ల వారి ఆసక్తి ఇంకా నిత్యనూతనంగానే వున్నది. ఇటీవల వచ్చిన ‘

జానూ’ అన్న సినిమాను చూచిన నవీన్ కి తను కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడుజరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఆ జ్ఞాపకాలు “నా గుండెల్లో దాచుకుంటా” అన్న కథానికగా రూపొందాయి.

ప్రఖ్యాత రచయిత ‘శైలేంద్ర’ రాసిన “చీకటి మూసిన ఏకాంతం” నవలను చదివిన ‘నీహారిక’ ఆయనను హైదరాబాదుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉత్తరం రాస్తుంది. కథా కాలానికింకా సెల్‌ఫోన్లు రాలేదు. మామూలు ఫోన్లు కూడా అందరిండ్లలోనూ ఉండే రోజులు కావవి. స్టేషనుకు వచ్చి రచయితను రైలు దింపుకొని తన కారులో ఊరంతా తిప్పుతుంది నీహారిక. ఇద్దరూ కలిసి ‘ఉత్సవ్’ సినిమాకు కూడా వెళతారు. ఆమె ఒక ప్రఖ్యాత సినీదర్శకుని కూతురు. రచయిత నవలలోని విషయం విడాకులు. ద్వేషంతో కలిసుండడం కన్న మిత్రులుగా విడిపోవడం మిన్న అన్నది ఆ నవల సారాంశం. అదీ చర్చకు వస్తుంది. ఆ రాత్రి రచయితను తమ ఇంట్లోనే ఉండి పొమ్మంటుంది. తమ పడకగదిలో రచయితకు ఏర్పాట్లు చేసి కూతురితో పాటు వేరేగదిలో పడుకుంటుంది నీహారిక. ఉదయమే బొంబాయి నుండి వచ్చిన ఆమె భర్త తమ పడకగదిలో ఉన్న రచయితను చూసి అప్రతిభుడవుతాడు. కోపగించుకొంటాడు. చేయని తప్పుకు క్షమాపణలు చెప్తూ బయటకు వచ్చేస్తాడు రచయిత.

తర్వాత కొన్నాళ్ళకు ఆ దంపతుల విడాకుల వార్త, ఆమె తండ్రి గొప్ప సినీదర్శకుడైనందున, పత్రికల్లో ప్రముఖంగా ప్రచురింపబడింది. కథ పేరు “అభిమాని”. విడాకులు పొందగలం దులకు గాను రచయితను వాడుకున్న అభిమాని ఆవిడ. “ఉజ్వల” అనే సంస్థ ప్రతిఏటా తమతమ రంగాల్లో నిష్ణాతులైన కార్యతత్పరులను సన్మానిస్తూ ఉంటుంది. ఓ సంవత్సరం సినీరంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులను తన కార్యక్రమానికి ఆహ్వానిస్తుంది. అందులో విశ్వేశ్వరరావు అన్న ప్రఖ్యాత దర్శకునికి సన్మానం వుంటుంది. టి.ఆర్.పి. రేటింగుకుతాపత్రయపడే ప్రసార మాధ్యమ విలేఖర్లు, వీడియో గ్రాఫర్లు, ఇంటర్వ్యూ చేసే నెపంతో, వేదికనెక్కి దర్శకుడిని ఘెరావ్ చేసినంత పని చేస్తారు. సభకు వచ్చిన వారికి వేదిక కనపడకుండా పోతుంది. నిర్వాహకులు బలవంతంగా ప్రసార మాధ్యమాల వారిని వేదిక నుండి దించేస్తారు. మాధ్యమాల వాళ్ళు ధర్నా

మొదలు పెడతారు. వచ్చిన అతిథులు కోపగించుకొని వెళ్ళిపోతారు. సభాసదులు నిరాశ చెంది వెళ్ళిపోగా, నిర్వాహకులు హతాశులవుతారు. రసాభాసకు కారణం ప్రసారమాధ్యమాలు. కాని మరునాటి పత్రికలో వచ్చిన వార్త- నిర్వాహకుల కారణంగా ‘కళాబ్రహ్మ’కు ఘోరావమానం జరిగిందని. చిన్న సంస్థల వారు ప్రఖ్యాతులను పిలిస్తే వచ్చే కష్టాలను “అపశ్రుతులు”గా వివరిస్తుందీ కథ. ప్రసార మాధ్యమాల దాష్టీకాన్ని నిరూపించడంలో రచయిత కృత కృత్యులయ్యారు.

కరోనా కాలంలో ఏర్పడిన ఖాళీ సమయంలో ఈ కథలను రాశానని తమ ముందుమాటలో చెప్పుకొన్నారు నవీన్. ఇందులో మూడు కథలు కరోనాకు సంబంధించినవే.

ఆకలిదప్పులతో అలమటించిపోతూ వందలకొద్ది కిలోమీటర్లు కాలినడకన పయనించారు వలస కూలీలు. సుధీర్, గోపాల్ అన్న ఇద్దరు కూలీలు కరోనా కారణంగా పనులు నిలిచిపోవడంతో వరంగల్లులో చిక్కుకుపోయారు. వరంగల్లు నుండి వారి స్వగ్రామమైనమహబూబునగర్కు నడచిపోతుండగా వంగపల్లి దగ్గర తాగేందుకు మంచినీళ్ళు కూడా లభించక సుధీర్ మరణిస్తాడు. ఊరివాళ్ళు వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి శవ దహనానికి సహకరించకపోగా శవం వల్ల కరోనా వ్యాపిస్తుందన్న భయంతో శవం పైన పెట్రోలు పోసి తగులబెట్టడానికి వస్తుంటారు. గత్యంతరం లేక ప్రాణభయంతో పారిపోతాడు గోపాల్.. కష్టాల నధిగమించి సుఖపడాలన్న వారి ఆకాంక్షలు కథ మొదట్లో వర్ణితమైనాయి.

వారి ఆకాంక్షలన్నీ అడియాసలైనాయి. కథ పేరు “నడకేరా అన్నిటికి మూలం”.

కరోనా సమయంలోని ప్రాణభయం దురదృష్టవశాత్తు మనిషిలోని క్రూరత్వాన్ని వెలికితీసింది. ఎనభై తొంభై ఏళ్ళ క్రింద వచ్చిన గత్తర్ల ( ప్లేగు, మశూచి, కలరా) కాలంలో ఊళ్ళకు ఊళ్ళు మరణించినా వ్యాధిగ్రస్తుల పట్ల ఇంతటి క్రూరత్వాన్ని తోటివారు చూపించిన దాఖలాలు లేవు. అందుకు భిన్నంగా సాటివారి సేవానిరతిని గురించి, వెలిబుచ్చిన సానుభూతిని గురించి కథనాలున్నాయి.

తల్లిదండ్రులకు తెలియకుండా సరదాగా గడిపొద్దామని హైదరాబాద్ నుండి బొంబాయికి వెళ్ళిన ఇద్దరు విద్యార్థి మిత్రులకు కరోనా కారణంగా తిరుగు ప్రయాణానికి వీలవదు. ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోగా ఆకలిదప్పులతో గుల్బర్గా నుండి కాలినడకన వారు హైదరాబాదు చేరుకొన్న వైనం పేరు “వినోద యాత్ర”. కరోనా ఇబ్బందులను మాత్రమే కాక డబ్బున్న తల్లిదండ్రుల పిల్లలకుండే నిర్లక్ష్య ధోరణిని కూడ వర్ణిస్తుందీ కథ.

కరోనా కారణంగా కుటుంబ సభ్యు లందరూ ఆనందంగా కలిసి వుంటున్నారు అన్న విషయాన్ని ప్రసార మాధ్యమాలు విరామం లేకుండా ఊదర గొడ్తున్నాయి. ఎటూ వెళ్ళకుండా ఇరవై నాల్గు గంటలూ అందరూ ఒకే చోట ఉండడం వల్ల ఉత్పన్న మయ్యే సమస్యలను “సమాంతర రేఖలు” కథ చర్చిస్తుంది.

వాసంతి, కుమార్ భార్యాభర్తలు. ఎప్పుడో ఒకసారి మందుకొట్టి ఇంటికొచ్చే కుమార్, కరోనా పుణ్యమా అని ఇంట్లోనే తాగుతున్నాడు. ఇరవై నాలుగ్గంటలూ మత్తులోనే జోగుతున్నాడు. సాఫ్ట్ పోర్న్ పుణ్యమా అని అతనిలో శృంగార

భావనలు నశించి కామోద్దీపనం లేకుండా అయినాడు. పెళ్ళయి రెండేళ్ళు కూడ కాని దంపతుల మధ్య ప్రేమానురాగాలు నశించడంతో వాసంతి నిరాశ చెందుతుంది. కరోనా నుండి రక్షణ నిమిత్తం కుమార్ తన తల్లిదండ్రులను హైదరాబాదుకు తెచ్చుకుంటాడు.

వాసంతి తన తల్లిదండ్రులను కూడ తీసుకురమ్మంటుంది. వాసంతి అన్నగారు కూడ హైదరాబాదులోనే ఉంటున్నాడు. అతనికి సొంత కారుంది. వీరికి లేదు. కొడుకు బాధ్యతగా అతడే తన తల్లిదండ్రులను తెచ్చుకోవాలి, మనకు వీలవదంటాడు కుమార్. భార్యాభర్తల మధ్య ఘర్షణ జరుగుతుంది.

అత్తాకోడళ్ళ గొడవలో తల్లి పక్షం వహిస్తాడు భర్త. భార్యను కొడతాడు కూడ. స్నేహితురాలి సహాయంతో అత్త మామలపైన, భర్తపైన గృహహింస కేసు పెట్టేందుకు బయల్దేరుతుంది వాసంతి.

కుటుంబ సభ్యుల మధ్యన గల సర్దుబాటు లేమిని ఈ కథ చక్కగా వర్ణిస్తుంది. అత్తాకోడళ్ళు నేరుగా సమస్యలను చర్చించుకొంటే కుటుంబాలలో శాంతి వర్ధిల్లుతుంది. అత్తగారు కోడలిని తన కొడుక్కి భార్యగాను, కోడలు అత్తగారిని తన భర్తకు తల్లిగాను మాత్రమే భావించి మగవాణ్ణి వీలయినప్పుడు ఆయుధం గాను, వీలవనప్పుడు వార్తాహరుని గాను వాడుకున్నంత కాలం, అత్తాకోడళ్ళు ఒకరికొకరు పరాయి వారవుతారు. ఈ ప్రథ ప్రారంభమై సుమారు ఐదు దశాబ్దాలు కావస్తున్నది. అప్పుడు రాజుకున్న ద్వేషాగ్ని ఇప్పుడు ఎవరూ ఆర్పడానికి వీలుకాని దావాగ్నిగా మారిపోయింది.

విద్య వల్లనే సమాజం బాగుపడుతుంది. సరియైన విద్యను అందుబాటులోకి తెస్తే సమాజం మారుతుంది అన్న సదుద్దేశంతో పాతికమంది అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లు కలిసి ఆదర్శ పాఠశాలను నెలకొల్పుతారు. అధ్యాపకుడైన ఆనంద్ రచయిత కూడ. అతనికి కళాశాలలోనే కాక ఊళ్ళో కూడా చాలా మంచి పేరుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వార్థరహితంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కామేశ్వరరావు అనే సహోద్యోగి పాఠశాలను ప్రారంభిద్దామంటాడు. విష్ణువర్ధన్ అని కొత్తగా వచ్చిన లెక్చరర్తను ఆనంద్ గారి అభిమానినంటాడు. పాఠశాల నేర్పించే సంఘంలో తను చేరడమే కాకుండా మరో ఐదుగురిని చేరుస్తాడు. ఉపాధ్యాయులకు స్వతంత్రమివ్వడం, ఖర్చులు పోను మిగిలిన ధనాన్ని పాఠాలు చెప్పేవారికే అప్పచెప్పాలన్నది ఆదర్శం. రెండు మూడేళ్ళలోనే పాఠశాలను భ్రష్టుపట్టించి మూతపడేట్లు చేస్తాడు విష్ణువర్ధన్. కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అన్న చిన్నయసూరి ‘నీతిచంద్రిక’ కథ గుర్తుకు వస్తుంది.

ఆనంద్ పట్ల గల అప్రకటిత ఈర్ష్యాసూయలు విష్ణువర్ధన్ చేత ఆ పనిని చేయించాయి. ఆనంద్ వ్యక్తిత్వ హననమే తన కర్తవ్యంగా ఉండింది. తమను తాము కమ్యూనిస్టులుగా ప్రకటించుకొని, వారి ఆదర్శాల పట్ల గాని, ఆ ఆదర్శాల ఆచరణ పట్లగాని లవలేశం కూడ గౌరవభావం లేని వ్యక్తులకు ప్రతినిధి విష్ణువర్ధన్. దురదృష్టవశాత్తు ఈ సమాజం వారినే గొప్ప ఆదర్శవాదులుగా

భావిస్తుంది. ఈ కారణంగానే ఆదర్శ పాఠశాల మూతపడింది. మార్పును ఈ సమాజం అంత సులువుగా అంగీకరించదు అని చెప్పే కథ “మార్పు”.

పున్నామ నరకాన్నుండి రక్షించేవాడు పుత్రుడని నానుడి. బ్రతికుండగానేతండ్రికి పున్నామ నరకాన్ని చూపించే కొడుకుల కథ “తండ్రులూ కొడుకులూ”. కొడుకులు పెట్టే కష్టాల్నుండి ముసలి తండ్రులు తమని తాము కాపాడు కోవడానికి కావలసిన చిట్కాలను చెపుతుందీ కథ.

నిజాయితీపరుడైన పోలీసాఫీసరు అరెస్టు చేసిన నిజాయితీపరుడైన నక్సలైట్ కథ “అంతరాత్మ అపరాధ భావన”.

ఉద్యమ జీవితానికి వైయక్తిక జీవితానికి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఎంతటి ఉద్యమకారుడైనా క్షణకాలం పాటు కౌటుంబిక జీవనం వైపుమొగ్గుచూపుతాడు. మొగ్గుచూపడానికి కారణం పోలీసులు ఇవ్వజూపిన బహుమతి, తదుపరి కాలంలో లభింపనున్న ప్రశాంతకరమైన జీవితం. ఇందు నిమిత్తం మరొక వరిష్ఠ ఉద్యమ కారుని జీవితాన్ని పణంగా పెట్టాల్సివస్తే!

ఉన్నతశ్రేణి తీవ్రవాది పరశురాం దాక్కున్న స్థలం చెప్తే కైలాసానికి ధనమూ, స్వతంత్రమూ లభిస్తాయి. ఉద్యమానికి

ద్రోహం చేయాలన్న చింతన కైలాసానికి ఏ కోశానా లేదు. పరశురాం ఉండడానికి అవకాశం లేదనుకొన్న స్థలాలు రెంటిని పోలీసాఫీసరు హరివిఠల్ రావుకు చెప్తాడు కైలాసం. కైలాసం చెప్పిన చోట పరశురాం ప్రాణాలతో పట్టుబడ్డాడని చెప్తాడు. హరివిఠల్ రావు. ఉద్యమానికి ద్రోహం తల పెట్టినా అన్న అపరాధ భావనకు లోనవుతాడు కైలాసం. పుస్తకాన్ని మూసేసి పక్కన పెట్టినా, కథ మనల్నువెంటాడుతూనే ఉంటుంది.

తనను తాను విపరీతంగా అభిమా నించుకోవడం అన్నది ఒక మానసిక వ్యాధి. సునందకు ఫోటోల పిచ్చి. ఎక్కడ ఏ ఫంక్షనైనా సరే తనా ఫంక్షనుకు వెళితే చాలు ఫోటోలు దిగాల్సిందే. వాటినిసేకరించి ఆల్బమ్స్ లో పెట్టుకోవాల్సిందే. ఆ ఆల్బమ్స్ ని తరచుగా చూచుకొని మురిసిపోవడమే కాక ఇతరుల కంటే తాసు బాగున్నట్లుగా భర్తతో చెప్పించు కోవాలి. భర్త సుకుమార్‌కు ఇలాంటి పనులంటే చిరాకు. చిన్నచిన్న ఘర్షణలుతీవ్రస్థాయికి చేరి విడాకుల వరకు వెళ్ళింది విషయం. పెద్దవాళ్ళ ప్రమేయంతో మానసిక వైద్యుని వద్దకు వెళతారు. దీన్ని ‘నార్సిజమ్’ అంటారని చెప్పి ఆయన కొంతకాలం వైద్యం చేశాడు. | గుణం కనిపించకపోవడంతో ఆమెకు | ఫోటోల పట్ల విరక్తి కలిగేలా చిట్కా చెప్తాడు. ఆమెను కురూపిగా చూపించడమే ఆ చిట్కా. తనను కావాలని ఫోటోలలో కురూపిగా చూపిస్తున్నారని ఆమె గ్రహించడంతో చిట్కా పనిచేయడం ఆగిపోయింది. ఆమెతో సరిపెట్టుకోవడమే వైద్యమంటాడు వైద్యుడు. కథ పేరు “రూపం-ప్రతిరూపం”.

సునంద అనారోగ్యం తీవ్రస్థాయికి చేరడానికి కారణం ఆమె భర్త సుకుమార్ ప్రవర్తన. రచయిత ఈ విషయాన్ని సూచించి వదలిపెట్టారు. ఫోటోల పిచ్చి అంతో ఇంతో అందరికీ వుంటుంది. సునందరకు కాస్త ఎక్కువగా వుంది. సుకుమార్ చెల్లెలి పెళ్ళిలో మిగతా కుటుంబ సభ్యులంతా ఫోటో సెషన్లో విపరీతంగా పాల్గొంటారు. సునంద ‘మనం కూడా ఫోటోలు దిగుదా’మంటుంది. సుకుమార్ నిరాకరిస్తాడు. సుకుమార్ వ్యక్తిత్వంలో హిపోక్రసి వుంది. ఆడంబరాలకు పోయి డబ్బు ఖర్చుచేసే వాళ్ళంటే తనకు అసహ్యమంటాడు. కాని అటువంటివాళ్ళతో తన స్నేహాన్ని మాత్రం వదులుకోడు. చెల్లెలి పెళ్ళిలో భార్యతోకలిసి నాలుగు ఫోటోలు దిగి వుంటే ఆమె డిప్రెషన్‌కు లోనయ్యేది కాదు. ఇవన్నీ కథాంశాలుగా మనకు కనపడవు.

కాని ఇవన్నీ రచయిత చెప్పినవే. అక్కడక్కడా విత్తనాలు చల్లి వదిలేస్తాడు రచయిత. పాఠకుడు ఆ విత్తనాల నుండి మొలకెత్తే మొక్కల్ని పట్టుకోగలగాలి.

“సమయం కోసం ..” అన్నది ‘మీ టూ’ ఉద్యమానికి సంబంధించిన కథ. వాసంతి, నిరంజన్ అధ్యాపక వృత్తిలో సద్యో గులు. నిరంజన్ కొంతకాలం వాసంతి వెంటపడతాడు. ఆ తర్వాత వాసంతికి నిజంగానే సాయం చేస్తాడు. వాసంతి నిరంజన్ ఒకటవుతారు. నిరంజన్రాజకీయాల్లోకి వెళ్ళిపోయి వాసంతిని నిర్లక్ష్యం చేస్తాడు. వేరొక స్త్రీని పెళ్ళాడతాడు. ఎమ్మెల్యే అయిన నిరంజన్ వాసంతి పనిచేస్తున్న పాఠశాలకు ఏదో కార్యక్రమం పైన వస్తాడు. పాత సంబంధాన్ని పునరుద్ధరించు కుందామంటాడు నిరంజన్. వాసంతి స్నేహితురాలు సుహాసినిని కలుస్తుంది. ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా నిరంజన్ చరిత్రను ప్రసార మాధ్యమాల ముందుం చుతుంది వాసంతి. మంత్రి కావలసిన నిరంజన్ ఉన్న ఎమ్మెల్యే పదవిని కూడా పోగొట్టుకుంటాడు. సమయాన్ని చూసి శత్రువును దెబ్బ కొట్టాలి అన్న సూచనతో కథకు “సమయం కోసం” అన్న పేరు పెట్టినట్లు తోస్తుంది.

పై కథలో వలెనే ఈ కథలో కూడా రచయిత ‘మీ టూ’ పరిస్థితి ఉత్పన్నమ వడానికి వాసంతి నడవడి కూడ దోహదకారి అని సూచ్యంగా చెప్పి వదిలేస్తాడు. వాసంతి తల్లి చనిపోయింది. ఆ తర్వాత ఒంటరితనంలో మనిద్దరం పెళ్ళి చేసుకుందామంటాడు నిరంజన్. ఇలాగే ఉండిపోదామంటుంది వాసంతి. ఇలాగే ఉండిపోదామన్నది పెళ్ళి బాధ్యత లేని సహజీవనంగా అర్థమైంది నిరంజన్ కి. స్నేహితురాలిగా ఉండిపోతాననుకున్నది వాసంతి. స్త్రీ పురుష స్నేహంలో పురుషుని నైజాన్ని “అభిమాని” కథలో సైతం రేఖామాత్రంగా చెప్పి వదిలేశారురచయిత. స్త్రీ పురుష స్నేహంలో కొన్ని పరిమితులుంటాయి. ముఖ్యంగా స్పర్శ. స్పర్శ కోరికలు చెలరేగడానికి దారితీస్తుంది. కోరిక హద్దులు దాటిన స్పర్శను కోరుకొంటుంది. మనస్సు శరీరాన్నదుపు చేయడం సంస్కారం. శరీరం మనస్సును స్వాధీన పరచుకోవడం ప్రకృతి. స్వాధీనం తప్పిన మనస్సు శరీరం అదుపులోకి వస్తుంది. శరీరం హద్దులు దాటాక స్త్రీ పురుషునికి లోకువవుతుంది. సమాజమంగీకరించిన సాంఘిక బంధమే స్త్రీ గౌరవాన్ని కాపాడి ఆమెకు రక్షణ కలిగించగలుగుతుంది. ఆ బంధం పేరుపెళ్ళి.

ఇదంతా కథలో ఉందా అంటే ఉంది. కథకుడు చెప్పాడా అంటే చెప్పలేదు. ప్రధానంగా చెప్పదలచుకొన్న విషయాన్ని సూచ్యంగా చెప్పి, కథను సాధారణ మార్గంలో నడిపించుకుపోవడం నవీన్ గారి రచనాశిల్పంలో నాకు కొట్టవచ్చినట్లు కనిపించిన అంశం. పరిశోధకులీ విషయాన్ని లోతుగా ఆలోచించి వివరిస్తే రచయితలకు మేలవుతుంది.

ప్రాణ స్నేహితురాండ్రైన సుస్మిత, అనూహ్యల ప్రాణాలు అనూహ్యంగా ఒకేసారి గాలిలో కలిసిపోయే విషాదగాథ “సృష్టిలో తీయనిది”. అనూహ్య అపురూపంగా తన స్నేహితురాలికి కొనిచ్చిన ఖరీదైన సెల్ఫోన్ ఈ విషాదానికి కారణం. నవీన్ గారి కథనం మనస్సును కలచివేస్తుంది.

కోటీశ్వరుడి కూతురు అపర్ణ. ఇంగ్లండులో వాస్క్యులర్ సర్జన్ అనురాగ్. పెళ్ళి చాలా అట్టహాసంగా జరిగింది. హనీమూన్’కని ఊటీకి వెళతారు కొత్త దంపతులు.

రాత్రి తొలి కలయికకు ముందు అనురాగ్ ని కొన్ని ప్రశ్నలడు గుతుంది అపర్ల. అతడిచ్చిన సమాధానాలతో అతడు తనకు తగిన వరుడు కాడని నిర్ణయించుకొంటుంది. అతణ్ణి దూరం పెడుతుంది. ఇద్దరూ ఘర్షణ పడతారు. పొద్దున్న అనురాగ్ లేచేప్పటికి అపర్ణ లేదు. పొద్దుటే ఇంట్లో దిగబడ్డ కూతుర్ని చూచిన తల్లిదండ్రులకుమతిపోయింది. తనకతడు సరిపడడని, విడాకులు తీసుకుంటానని ప్రకటించేసింది అపర్ల. ఎవరెంత చెప్పినా వినలేదు. అనురాగ్ స్వార్థపరత్వాన్ని, విషయలోలతను, ఆడవారిపట్ల చిన్నచూపును, విలాసాల పట్ల అతనికి గల దృక్కోణాన్ని అపర్ల సరిగానే అంచనా వేసింది. అందరాడపిల్లలకూ ఆ వివేచన, వివేకము, తెగువ వుండాలని ఆశిద్దాం.

ఒక్కమాటలో చెప్పాలంటే “యానాంలో ఒకరోజు” కథాసంపుటి – ఒక మంచి పుస్తకాన్ని చదివాం అన్న అనుభూతిని పాఠకుడిలో మిగులు స్తుందనడం సత్యదూరం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com