
2019 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని ఆస్ట్రియన్ రచయిత పీటర్ హండ్కేకు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఒకరిగా పీటర్ హండ్కే ఎదిగారు. ‘ఏ సారో బియాండ్ డ్రీమ్స్’, ‘అఫెండింగ్ ద ఆడియన్స్’, ‘ద హార్నెట్స్’, ‘షార్ట్ లెటర్’, ‘లాంగ్ ఫేర్‌వెల్’ వంటివి ఆయన ప్రముఖ రచనలు. 1966లో ‘ద హార్నెట్స్’ అనే నవలతో సాహితీరంగంలో సంచలనం సృష్టించారు. ఆయన రాసిన ‘ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్’ అనే సంభాషణలు లేని నాటకం చాలా ప్రసిద్ధి గాంచింది. ఆత్మహత్య చేసుకున్న తన తల్లి జ్ఞాపకాలతో తెచ్చిన ‘ఎ సారో బియాండ్ డ్రీమ్స్’ కూడా హండ్కేకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే పీటర్ హండ్కే తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కారు. 2014లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని నిషేధించాలని పిలుపునిచ్చి వివాదాన్ని రేకెత్తించారు. జాత్యహంకార దాడుల మీద పీటర్ హండ్కే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.