దాశరథి పద్య కవిగా సుప్రసిద్ధుడు. వచన కవిత్వం కూడా అదే స్థాయిలో రాసిన  సవ్యసాచి. ఆయన వచన కవితా నైపుణ్యానికి నిదర్శనం ఈ కవిత. దాశరథి కాలంనాటికి ప్రతీక వాదం, మార్మకత, తెలుగు కవిత్వంలో పూర్తి స్థాయి లాక్షణికం కాలేదు. అయినా రానున్న వచన కవిత్వానికి దాశరథి ఇట్లాంటి కవిత ద్వారా మార్గనిర్దేశం చేస్తున్నారు. పాఠకునిలో బలమైన అనుభూతిని ప్రోదిచేస్తూ ఊహాశాలీనతకు దోహదమవుతున్నారు. తెలంగాణకు జాతి భావానికి  పునాదులు వేసిన ఈ మహాకవి కవిత తంగేడు పాఠకుల కోసం.  

 

చెట్లు నడిస్తే ఎంత భయంకరమో

అట్లా చీకట్లు నడుస్తున్న ఈనాడు

అంతా నిద్రపోతున్నారు నీడల్లో

కాలరాక్షసి అడుగుజాడల్లో,

ఎవడో అనంగా విన్నమాట సుమా! ఇది –

ఎక్కడో ఎవ్వడో మేలుకొన్నా’డని.

విచిత్రమే ఈ అర్ధరాత్రి మేల్కోడం;

అయినా చూచి రావడం మంచిది.

నేను మాత్రం మేల్కొని వున్నాననా!

వట్టిది! ఇదీ కలలోని ప్రస్తావనే;

కలలోనైనా మేల్కొన్న వాణ్ణి చూడ్డం

ఘన విషయం కాదా ఈనాటి లోకంలో!

శవం బతకడం ఎంత విచిత్రమో

మనం మేలుకోవడం అంత చిత్రమే.

ఎవడో కొత్తరకం మేటి వైద్యుడు

ఏదో కొత్త తరహా ఔషధం వాడివుండాలి.

లేంది ఇన్నాళ్ల నల్లమందు మత్తు

ఇంత త్వరగా విడిపోవడం సులభమా!

ఏమైతేం వెళ్లి చూచిరావడం మంచిది:

మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళ్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com