‘విద్వద్గద్వాల’గా విఖ్యాతి గాంచిన ఈ సంస్థాన చరిత్ర కాకతీయుల కాలం నుంచీ తెలియవస్తున్నది. గద్వాల సంస్థాన మూలపురుషుడు ఐజకు చెందిన బుద్ధారెడ్డి. గ్రామ నామాన్ని బట్టే వీరిని ‘ఐజ గౌడ’లు అనే పిలిచిండ్రు.

కృష్ణా-తుంగభద్రానది మధ్య ప్రాంతంలోని పూడూరు నాడగౌడరీకం చేస్తున్నటువంటి వీరారెడ్డికి బక్కమ్మ అనే కూతురున్నది. ఆయనకు కొడుకులు లేరు. అయితే ఈయన కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామ మునసబు అని కట్టా వేంకటేశ్వర శర్మ తన పరిశోధన గ్రంథం ‘గద్వాల సంస్థానం సాహిత్య పోషణం’ గ్రంథంలో పేర్కొన్నారు. ముష్టిపల్లి పెద్దన గద్వాల సంస్థాన మూలపురుషుడని కాణదము పెద్దన రాసిన ‘ముకుంద విలాసము వల్ల తెలుస్తున్నది.

పురుష సంతానం లేక పోవడంతో వీరారెడ్డి అప్పటికే ఐజ, దరూరు, కందనవోలు, అదవని (అదోని), నంద్యాల సీమలపై ముష్టిపల్లి వంశస్తులైన రెడ్లు నాడగౌడులుగా ఉన్నరు. అయితే ఈ కుటుంబీకులు తమలో తాము కలహించుకోవడంతో పెద్దారెడ్డి అనే అతను ఐజ, దరూరు, కందనవోలు సీమలకు నాడగౌడరీకం చేజిక్కించుకుండు. ఈయన బీజాపూర్ సుల్తాను సామంతుడుగ ఉన్నడు. జ్ఞాతులచే తగవులాడి కుటుంబం నుంచి బయటికి వచ్చిన పెద్దారెడ్డికి పూడూరు నాడగౌడగు వీరారెడ్డి తన కూతురు బక్కమ్మనిచ్చి పెండ్లి చేసిండు. దీంతో మిగతా ప్రాంతాల నాడగౌడరీకంతో పాటు పూడూరుపై కూడా పెద్దారెడ్డికి అధికారం జిక్కింది. వీరికి సోమన్న, సిరిగరెడ్డి అనే ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు. పిల్లలిద్దరు చిన్నగున్నప్పుడే అంటే 1628లో పెద్దారెడ్డి మరణించిండు. దీంతో బక్కమ్మ నాడగౌడరీకము చేపట్టి ప్రజలను కన్నబిడ్డలవలె కనిపెట్టుకుంది. ఆమెకు దైవభీతి, పాపభీతి ఎక్కువగా ఉండిందని మారేమండ సీతమ్మ ఒక వ్యాసంలో రాసింది. ఈమె 34 ఏండ్లు అంటే 1628 నుంచి 1663 వరకు పాలన జేసి అధికారాన్ని పెద్దకుమారుడు పెద సోమభూపాలునికి అప్పగించింది. ఈయన బాహుబలము, రాజనీతిజ్ఞత వలన పాలనలో రాణించిండు. బీజాపూర్ సుల్తాన్ పై జరిగిన దాడిలో ఔరంగజేబుకు మద్దతుగా నిలిచి ఆయన అభిమానాన్ని చూరగొన్నాడు. అంతేగాకుండా ఔరంగజేబు నుంచి కర్నూలు, బళ్ళారి ప్రాంతాలలోని అనేక ప్రాంతాలపై నాడగౌడరీకము సంపాయించిండు.

పెద్దన (పెద్దారెడ్డి), బక్కమాంబికల కుమారుడైన పెద శోభనాద్రి ఈ సంస్థానాన్ని పాలించిండు. ఈయన 1712లో చనిపోయిండని సీతమ్మ రాసింది. 1735వరకు జీవించినట్లు కట్టా వెంకటేశ్వర శర్మ రాసిండు. బహుశా రెండోదే నిజం కావొచ్చు. పెదశోభనాద్రి అసలు పేరు ‘పెద సోమభూపాలుడు’. ఈయన తన తల్లి బక్కమ్మ పేరిట అయిజలో ఒక బాయిని ప్రజోపయోగం కోసం తవ్వించిండు. ఈయన 1688-97 మధ్యకాలములో శత్రువులపై దాడి చేస్తూ అయిజ తదితర ప్రాంతాలను కైవసం చేసుకున్నడు. 1663-1712 మధ్యకాలంలో గద్వాల కోటను నిర్మించిండు. ఈయన 1735 లో చనిపోవడంతో పెదభార్య రాణీ అమ్మకమ్మ పరిపాలన బాధ్యతలను స్వీకరించింది. అంతకుముందు సంస్థాన పాలన 12 ఏండ్ల పాటు ఉద్యోగులు నిర్వహించారు. అమ్మకమ్మ రెవిన్యూ బాధ్యతలను చూస్తున్న కట్టా వెంకన్నకు, ఆతని తర్వాత బ్రాహ్మణుడైన రమణయ్యకు పాలనను అప్పగించారు. వీరి పాలన వరుసగా 1735-1740, 1741-46 మధ్యకాలములో సాగింది. పెద శోభనాద్రి కుమార్తె గిరియమ్మ (బోరవెల్లి) ప్రోత్సాహముతో లయగ్రాహి గరుడాచల కవి ‘కౌసలేయ చరిత్రము’ అనే గ్రంథాన్ని రాసిండు. గిరియమ్మ చేసిన ధాన, ధర్మాల వివరాలు ఈ కౌసలేయ చరిత్రలో వివరంగా రికార్డయ్యాయి. అయితే ఈ దశలో ఉద్యోగుల పాలనతో సంతృప్తి చెందని అమ్మకమ్మ బాధ్యతలు తానే స్వీకరించింది.

అంటే అమ్మకమ్మ 1746-47 మధ్యకాలంలో ఆమె పాలన చేసింది. అనంతరం పెదశోభనాద్రి రెండో భార్య లింగమ్మ 1747-1760 వరకు రాజ్య పాలన చేసింది. ఈమె పాలనా కాలంలోనే బీచుపల్లి వద్ద ‘నిజాంకొండ’ కోట నిర్మాణం ప్రారంభమయింది. కరువు బారిన ప్రజల కోసం ధాన్యాన్ని పంచింది. అందరికి వసతి సదుపాయాలు సమకూర్చింది. అలాగే ప్రజాహితార్థం వంగాల, తాండ్రపాటి చెరువులను తవ్వించింది. తన పేరిట గద్వాలలో ‘లింగమ్మ బాయి’ని తవ్వించింది. ఈమె తన కుమార్తె ‘గిరియమ్మ’ను బోరవెల్లి చిన సోమభూపాలునకిచ్చి వివాహం జరిపించింది. అనంతరం

లింగమ్మ దత్తపుత్రుడు రాజా తిరుమలరావు అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు పాలన జేసిండు. ఈయనకు ఇద్దరు భార్యలు. తిరుమలరావు 1760-64 మధ్యకాలములో పాలన జేసిన కాలములో తల్లి కాలములో ప్రారంభమై అసంపూర్తిగా నిర్మితమైన నిజాం కొండ కట్టడాన్ని పూర్తి చేసిండు.

1764లో ఈయన మొదటి భార్య రాణీ మంగమ్మ కొన్ని నెలలు పాలన చేసింది. అనంతరం రెండో భార్య రాణీ చొక్కమ్మ 1764-68 మధ్యకాలములో పాలన చేసింది. ఈమె గద్వాలలో ‘లింగమ్మ బాయి’ని తవ్వించింది. కృష్ణానది ఒడ్డున గల బీచుపల్లిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టింప జేసింది. ఈమె తన ఇరువురు పుత్రుల పెంపకం, గద్వాల సంస్థాన పాలక బాధ్యతలను సమీప బంధువు బోరవెల్లి సంస్థానాధీశుడైన రామరాయలుకు అప్పగించింది. 1768-1783 మధ్యకాలములో రాజా రామరాయలు పాలన చేసిండు. రాణీ చొక్కమ్మ ఇద్దరు కుమారులకు విద్యాబుద్ధులు చెప్పించి తన సొంత నాడగౌడరీకంలో ఉన్న బోరవెల్లిని కూడా గద్వాలలో కలిపిండు. ఈతడు అవుకు తాలూకా బేతెండ్ల గ్రామములో చెన్నకేశవస్వామిని ప్రతిష్టింపజేసిండు. కర్నూలు నవాబుతో యుద్ధం చేసి గెలిచిండు.

అనంతరం పెదసోమ భూపాలుని మనుమడగు చిన సోమభూపాలుడు గద్వాల రాజ్యమును పాలిచించిండు. 1784-1815 మధ్యకాలములో ఈయన పాలన సాగింది. ఈతను మరణించే నాటికి అతని పుత్రుడు రెండవ రామరాయడు బాలుడగుటచే చిన సోమభూపాలుని భార్య రాణీ రామక్కమ్మ పాలన చేసింది. ఒక ఏడాది పాలన తర్వాత కుమారునికి పట్టం కట్టింది. రాజా రామభూపాల్ బహద్దూరను పేర విఖ్యాతుడైన ఈయన చాకచక్యముతో వివిధ రాజులతో యుద్ధాలు చేసిండు. మహారాష్ట్రులపై కూడా దాడులు చేసిండు. ఈయన పాలన 1816-1828 మధ్యకాలములో సాగింది. ఆయన మరణానంతరం గద్వాల రాజవంశములో కల్లోలాలు జరిగాయి. రామరాయనికి శేషమ్మ, లక్ష్మమ్మ అను ఇద్దరు భార్యలున్నారు. రాజు మరణించేనాటికి చిన్న రాణియగు లక్ష్మమ్మ గర్భవతి. రాజు మరణశయ్యపై నుండి తల్లియగు రామక్కమ్మను పిలిచి “నా చిన్న భార్య పుత్రుని గనినచో నామెను నీమేనల్లుడగు సీతారామునికి బెండ్లి చేసి యతనికి రాజ్యము నప్పగింపుము. అంత వరకును సంస్థానమును రక్షించుచుండుము” అని చెప్పెను. ఈ సమయములో రాజబంధువుల సహాయముతో కార్యక్రమాలను ఆమె చక్కబెట్టింది. ఇదే సమయమంలో సినీ ఫక్కీలో పెద్ద భార్య శేషమ్మ అసూయతో సవతికి విషమివ్వజూడడం, అది విఫలం కావడం కూడా చరిత్రలో రికార్డయింది. ఆ తర్వాత రామక్కమ్మ తన చిన్న కోడలుకు పుట్టిన అమ్మాయిని సీతారామారెడ్డికిచ్చి పెండ్లి చేసింది. ఆ తర్వాత అతను రాజా సీతారామ భూపాల్ బహద్దరను పేరిట సింహాసనమెక్కిండు. అనంతరం పెద్ద సీతారామ భూపాలుడు 1828-61 మధ్యకాలంలో పాలన జేసిండు. ఈయనకు ముగ్గురు భార్యలు. అనంతమ్మ, లింగమ్మ, వెంకట లక్ష్మమ్మ. ఇందులో రాణీ లింగమ్మ తన ఏకైక కుమార్తె లింగమ్మను చోళపురం వాస్తవ్యుడైన నల్లారెడ్డికిచ్చి వివాహం చేసిండు. అతన్ని ఇల్లరికపుటల్లుడుగా తెచ్చుకున్నడు. తన అనంతరం అల్లుడి పేరును రాజా సీతరామ భూపాలుడిగా మార్చి అతనికి అధికారాన్ని అప్పగింపజేసిండు. ఈయన సంతాన రహితుడిగానే గతించాడు. అనంతరం లింగమ్మ పాలనా బాధ్యతలను స్వీకరించింది. 1861-63 మధ్యకాలములో పాలన జేసింది. ఇదే సమయములో రాణి లింగమ్మ వడ్డేపల్లికి చెందిన యల్లారెడ్డి కుమారుడు రాయన్నను దత్తత తీసుకొని అతనికి రాజ సోమభూపాలుడు

అని నామకరణం చేసింది. ఈయన తల్లి మరణానంతరం మూడు సంవత్సరాలు అంటే 1863-66 వరకు పాలన చేసి చనిపోయిండు.

రాజ సోమభూపాలుడు మరణానంతరం వెంకట లక్ష్మమ్మ పాలన బాధ్యతలను స్వీకరించింది. తన హయాములో గద్వాల కోటలోని కేశవాలయానికి గోపురము, మహద్వారాన్ని నిర్మింప జేసింది. తనకు సంతానం లేక పోవడంతో వెంకటాపురానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు రామన్నను దత్తత తీసుకుంది. అతనికి రాజా రామభూపాలుడు అని నామకరణం చేసింది. వెంకట లక్ష్మమ్మ 1867-87 అధికారాన్ని చలాయించింది. అనంతరం దత్త పుత్రుడు రాజ రామభూపాలుడు పాలనా బాధ్యతలను స్వీకరించిండు. ఈతను 1887-1923 వరకు అధికారం చలాయించినాడు. 1843లో జన్మించిన ఈతన్ని మూడో ఏటనే వెంకట లక్ష్మమ్మ దత్తత స్వీకరించింది. అయితే ఈతనికి కూడా సంతాసం లేక పోవడంతో తన అన్న కొడుకు వెంకటాపురానికి చెందిన భీమిరెడ్డి తనయుడు వెంకటరెడ్డిని దత్తత స్వీకరించి అతనికి

చిన సీతారామభూపాలరావు అని పేరు పెట్టిండ్రు.

భర్త రాజ రామభూపాలుడు మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన రాణి 1923 నుంచి 1935 వరకు పాలన చేసింది. ఈమె బతికుండగానే ఆ బాధ్యతలను దత్త పుత్రుడు చిన సీతారామభూపాలరావుకు 1935లో బదలాయించింది. ఈతను 1913లో ఆదిలక్ష్మిదేవమ్మను వివాహమాడిండు. వీరిద్దరికి వరలక్ష్మమ్మ, శ్రీలక్ష్మిదేవమ్మ అనే ఇద్దరు కూతుళ్లు ృన్నరు. చిన సీతరామభూపాలరావు 1935 నుంచి 1946 వరకు పాలన చేసిండు. అనంతరం ఆయన భార్య ఆదిలక్ష్మిదేవమ్మ ఆ బాధ్యతలను స్వీకరించింది. ఈమె పాలన కాలంలో ఎంతో సాహిత్యం ఈ సంస్థానం నుంచి వెలువడింది. కవి, పండితులను ఆదరించింది. ఈమె జీవిత చరిత్రను పండితులు పద్యరూపములో రాసి ప్రచురించినారు. పెద్ద కుమార్తె వరలక్ష్మమ్మను దోమకొండ సంస్థానాధీశులు రాజా సోమేశ్వరరావుకిచ్చి వివాహం చేయించడమే గాకుండా ఆతనికే సంస్థాన పాలనా బాధ్యతలను కూడా అప్పజెప్పినారు.

ఇదే జిల్లాకు చెందిన రాజోలు సంస్థానంలో కూడా మహిళలు కీలక భూమిక పోషించినారు. ముష్టిపల్లి ఇమ్మడి ఎల్లారెడ్డి సోదరుడు చిన్నరెడ్డి భార్య లక్ష్మాంబ, చిన్న విభుడు భార్య లింగాంబ కూడా పాలనలో చేదోడు వాదోడుగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com