జాగృతి తన ప్రస్థానం కొనసాగిస్తూ 14వ ఏట అడుగు పెట్టింది. జాగృతి ప్రతి అడుగు నవ తెలంగాణ నిర్మాణ లక్ష్యానికి ఒక అవిశ్రాంతమైన కొనసాగింపు. ఆ కొనసాగింపులో భాగమే ఈ తంగేడు సాహిత్య పక్షపత్రిక. మన మిగిలి ఉన్న కలలను సహకారం చేసుకోవడానికి ఇపుడు ఒక నూతన ఆవిష్కరణకు దోహదం కాదలచాం.
అధ్యయనం మానవ ప్రగతికి ప్రాతిపదిక. అధ్యయనం అంటేనే మనిషి కొనసాగింపు. అధ్యయనం అనే పునాదుల నుండే నాగరికతా సౌధాలు వెల్లివిరిసినయి. ఇపుడు మనిషి విశ్వ మానవుడు అయిండు. ఆధునికానంతర కాలంలో ప్రపంచం కుగ్రామం అయింది. అయితే ప్రపంచ మానవుడిగా మనిషిని నిర్వచించడం లో ఎన్ని అనుకూలతలున్నాయో అన్ని ప్రతికూలతలున్నాయి. కాబట్టి మనిషిని విశ్వమానవుడు అనడం మన సేవా భావానికి మరింత ప్రాతిపదిక అవుతుంది. మానవులందరికీ తల్లి దక్షిణాఫ్రికాలోని ప్రాచీన స్త్రీ అని చెబుతున్నారు. ఈ భావనను నిజంగా ఆవాహన చేసుకుంటే మానవత్వం ఎంత విశ్వ జనీనమో తెలుస్తుంది. విశ్వ మానవత్వం ప్రాంతీయ అస్తిత్వానికి వ్యతిరేకం కాదు. ప్రాంత, సంస్కృతి, స్వీయ అస్తిత్వం విశ్వజనీన భావనకు ప్రాతిపదిక. మనిషికి భిన్నత్వంలో ఏకత్వం ఏకకాలంలో సంతరించుకునే సదవకాశం దీనివల్ల కలుగుతుంది. ఈ భావం ఆవాహన చేసుకునే విశాలత ఆధునిక మానవుడు ఎందుకు సంతరించుకోవడం లేదు? కుల వివక్ష, వర్గ వివక్ష, జాతి వివక్ష, ప్రాంత వివక్షలతో మనిషి ఎందుకు కలత పడుతున్నాడు? ప్రపంచీకరణ పెను ముప్పు మనిషిని ఎందుకు కుదేలు చేస్తున్నది? దీనికి పరిష్కారం ఏమిటి?
ఈ వివక్ష పరిహారానికే ప్లాటో ఆదర్శ రాజ్యం అన్నాడు. కారల్ మార్క్స్ రాజ్య రహిత సమాజ జీవితం ఆకాంక్షించాడు. గౌతమ బుద్ధుడు, గోసల లోకాయతులు, చార్వాకుడు, పూలే, అంబేద్కర్, లోహియా, పెరియార్, జయశంకర్, దాశరథి కాళోజీ.. ఇట్లా మేధావులంతా మానవ హితాన్ని ఆశించి తాత్విక ప్రతిపాదనలు చేశారు. కవితా సృష్టి గావించారు.
ఈ సోయితోనే జాగృతి తన కొనసాగింపులో తంగేడు సాహిత్య పక్ష పత్రికను ఆవిష్కరిస్తున్నది.
ఇదే సమయంలో బతుకమ్మ పండుగ వస్తోంది . తెలంగాణ లో అతిపెద్ద పండుగ , మన సాంసృతిక జీవితానికి ఒక విలక్షమైన ప్రాతినిధ్యం ఇది .ఇంకోరకం గా ఇది తెలంగాణా మహిళా దినోత్సవం . సమాజం లో సగమైన స్త్రీలు తమ ఆట పాటల తో మానవ సంక్షెమాన్ని ఆశిస్తారు .వారి మధురమైన గొంతు లో సంగీత సాహిత్యాల మేళవింపు జరుగుతుంది .
ఈ లక్ష్యంతోనే తెలంగాణ జాగృతి బతకడం, బతికించడం అనే బతుకమ్మస్పూర్తితో ఈ తంగేడును మీ ముందుకు తెస్తున్నది.
ఈ తంగేడు పక్ష పత్రిక వివిధ ప్రక్రియలకు ఆహ్వానం పలుకుతోంది . పాత కొత్తల మేలు కలయికను కోరుకుంటుంది .విభిన్న తాత్విక ప్రతిపాదనలకు ప్రజాస్వామిక ప్రయోగశాల గా ఉంటుంది .ఇది అప్రకటిత ప్రజాప్రతినిధులైన సాహితీవేత్తల గళాలకు వాహిక గా నిలుస్తుంది .
సాహిత్యం సరికొత్తగా ఉండాలి. నూతనత్వాన్ని క్షణం క్షణం ఆవాహన చేసుకోవాలి. అట్లాగని పాతను కాదనకూడదు. సాంప్రదాయం- ప్రయోగంతోనే అనూచాన ప్రతిపాదన మరింత ముందుకు పోవాలి.
సమస్త తెలంగాణా ప్రజానీకానికి ,తెలుగు ప్రజానీకానికి తంగేడు అక్షరాంజలులు. బతుకమ్మ శుభాకాంక్షలు. నిరంతరం మీ సహకారాన్ని కోరుతూ..
జై తెలంగాణ

…కల్వకుంట్ల కవిత

2 thoughts on “సాహిత్యం ఒక సామాజిక అవసరం”
  1. తంగెడు సాహిత్య పక్ష పత్రిక కు స్వాగత శుభాకాంక్షలు.

  2. తంగెడు సాహిత్య పక్ష పత్రిక కు స్వాగత శుభాకాంక్షలు.

Leave a Reply to రమేష్ రావు. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com